Search This Blog

Monday, December 26, 2016

భాగవతం - 8 వ భాగం

భాగవతం - 8 వ భాగం

నారదుడు వ్యాసునికి చెపుతున్నాడు – ’నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, వారికి రాజ్యములు ఎలా వచ్చాయో మున్నగు విషయములను గూర్చి వివరించి వ్రాశావు. అవి అన్నీ ఇప్పటి ప్రజలకు చాలాబాగా తెలుసు. ఇప్పటి వ్యక్తులు భారతము ఏమీ చదవకుండా దుర్యోధనుని కన్నా అహంకారముతో తిరగగలరు. ధృతరాష్ట్రునికన్నా బాగా పక్కింటివాడిది తెచ్చి దాచేసుకోగలరు. ’నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గూర్చి ఏమీ చెప్పలేరు. భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియలౌల్యం వీనిని వచ్చే జన్మలో హీన ఉపాధులలోకి తీసుకుపోతుంది.’ భగవంతునికి ఏమీ రాగద్వేషములు ఉండవు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయిందనుకోండి. ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది. మీరు వినే వుంటారు.

వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే
వ్యర్థంబైచెడు వాక్ప్రవాహములచే వాత్సల్యచిత్తంబుచే
అర్ధజ్ఞానముచే మహద్భ్రమతచే హాస్యప్రసంగాలచే
స్వార్థంబే పరమార్థమై చెడుదు రీస్వార్థప్రజల్ శంకరా!! (శ్రీశంకర శతకము – ౮౦)

వాడికి కామం ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్బది ఏళ్ళు వయస్సు వచ్చేసిన తరువాత మంచి పంచె కట్టుకొని వచ్చాడనుకోండి – ’తాతయ్యా పెళ్ళికొడుకులా ఉన్నావు’ అని సరదాకి ఎవరయినా అన్నారనుకోండి – అంటే ’అమ్మా అలా అనకూడదు. పెళ్ళికొడుకులా ఉన్నాననకు. మిమ్మల్ని చూడగానే త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ఫలితం కనిపించే ఒక మంచి ఉపాసనాబలం పొందుతున్న వారినా ఉన్నారని అను – అది నా శరీరమునకు సరిపోతుంది. ఇంకా నేను పెళ్ళికొడుకునేమిటమ్మా’ అని అనాలి. కానీ వాడు అలా అనడు. వాడు ఏమంటాడంటే – ’ నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు’ అంటాడు. అంటే వాడికి కడుపులో ఎంతబాధ ఉందో చూడండి! వానిక్ ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడడం లేదు. ’నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే, సంబంధములు చూసి, తాతగారూ, మీరు చేసుకోండి అని పిల్లను తెచ్చి పెళ్ళి చేయవచ్చు కదా’ అని వీడికి కడుపులో బాధ! వృద్ధాప్యంలో ఒక విధమయిన ధూర్తతనం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికింకా వ్యామోహం ఉండిపోతుంది అపుడు శరీరములోంచి నిరంతరము చీము స్రవించే వ్రణములు బయలుదేరతాయి. అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి. అంతదూరంలో ఉండే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. ఎవరూ వాని దగ్గరకు వెళ్ళరు. ఎంతో బాధపడతాడు. అంత బాధపడ్డ తరువాత అప్పుడు కామం పోతుంది. ’నీవు వ్యాసుడవయినందుకు అంతబాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం ఉత్తరజన్మకు వెళ్ళకుండా ఆపేశక్తి వీళ్ళకి ఇవ్వాలి. వ్యాసా, నీవు ఏమి ఇవ్వాలో తెలుసా! భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు.’ వాడు తెలిసో తెలియకో వచ్చి భాగవతమును వినడం కాని, చదవడం కాని చేస్తే అంతమాత్రం చేత వీడు భాగవతం విన్నాడు అని వాని ఖాతాలో వ్రాస్తాడు. వాడు హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితమును అడ్డుపెట్టి వానిని మంచి జన్మవైపుకి తిప్పుతాడు. ’భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒకమంచిమాట చెప్పు. అంతేకాని నీవు మరల అర్థకామములను గురించే మాట్లాడితే కావ్యమునకు ఏమీ ప్రయోజనం ఉండదు. హరినామస్మృతిలేని కావ్యము వృథా. దాని వలన ఏవిధమయిన ఉపయోగం ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామము చెప్పని కావ్యము, నీవు ఎంతగొప్ప అర్థములతో చెప్పినా అది తద్దినం పెట్టేచోటికి కాకులు వచ్చే రేవులాంటిది. అందుకని నీవు ఇప్పుడు భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విశెశములు, భగవద్భక్తుల కథలతో కూడిన విషయములను చెప్పు. భాగవతంలో అటువంటివి చెప్పు’ అని చెప్పాడు నారదుడు.                      
[5:20 PM, 12/26/2016] Daddy: భాగవతం - 10 వ భాగము

భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్నావతారము చాలా గొప్ప అవతారము. ’కృష్ణస్తు భగవాన్ స్వయం’ – అందుకే భాగవతమునకు ’జయ’ అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే – ’నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!’ అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.

’కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. అందుకే మనం ’కృష్ణం వందే జగద్గురుమ్’ అంటాము. జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షన కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై మీకష్టాన్ని పోగొడతాడు. తండ్రియై మిమ్మల్ని కాపాడతాడు. తల్లియై మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమయిన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి’ అన్నాడు సూతుడు శౌనకాది మహర్షులతో.

అశ్వత్థామ పరాభవము

పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ’నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు.

No comments:

Post a Comment