Search This Blog

Monday, December 26, 2016

భాగవతం - 7 వ భాగం

భాగవతం - 7 వ భాగం

భాగవతం అనేది సామాన్యమయిన గ్రంథము కాదు.
లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై!!

దీని స్కంధము చూస్తే లలితము. కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టుబాగా పెరగాలంటే చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తారు. అపుడు చెట్టు బాగా పెరుగుతుంది. శుకబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమయిన స్తోత్రము. అపారమయిన మంజులమయిన మాటలతో శోభిస్తూ ఉంటుంది. ఈ భాగవతము ఎవరు చదువుచున్నారో వారికందరికి, మంచిమనస్సుతో ఉన్న వారికి అర్థమయ్యే స్వరూపము కలిగినది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడిన కల్పతరువు. భాగవతమనేది వేరొకటి కాదు. సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్లే, భాగవతంలో ఒక పది పద్యములు వచ్చినట్లయితే అటువంటి వ్యక్తి కల్పవృక్షమును జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్క. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతనగారు గొప్పగొప్ప ప్రయోగములన్నిటిని, పద్యములుగా తీసుకువచ్చి పెట్టేశారు. వాని కోరిక ఎందుకు తీరదు? అందుకని భాగవతము అంత గొప్పది! అటువంటి భాగవతమును శుకబ్రహ్మ వివరణ చేశారు.

వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒకమాట చెప్పారు. ’వ్యాసా లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలు అందరికి కూడా తెలిసిన విషయములు రెండు ఉన్నాయి. అవి అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవరినీ తీసుకువచ్చి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కరలేదు. అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు. డబ్బు సంపాదించుకోవడం తెలుసు. ఇంకా బొడ్డూడదు కానీ రూపాయి ఎలా సంపాదించాలనే తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కారబలం తక్కువగా ఉంటుంది. అందునా కలియుగంలో ఉంటే వాళ్ళది అల్పాయుర్దాయం. బుద్ధి బలం చూస్తే తక్కువ. ప్రచోదనం ఎప్పుడూ అర్థకామములయందు మాత్రమే ఉంటుంది’.

వానికి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వచ్చేసరికి వానికి మీరు పెళ్ళి చేయలేదనుకోండి – మీరు వానికి పెళ్ళి చేయలేదనే విషయమును వాడు మీకు తెలిసేలా చేస్తాడు. వాడు అమ్మ దగ్గరికి వచ్చి ’నా ఈడువాడు – వాడికి అప్పుడో కొడుకమ్మా అంటాడు’. ఇదివాడు ’అమ్మా మీరు నా సంగటి పట్టించుకోవడం లేదు’ అని తల్లికి పరోక్షంగా చెప్పడమే! ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి – ఎప్పుడో ఒకరోజు పెళ్ళి చేసేసుకొని మీ దగ్గరకి నమస్కారం పెట్టడానికి వచ్చేస్తాడు.

అందుకని ’మానవుడు ఎప్పుడూ అర్థకామములయందు తిరుగుతూ ఉంటాడు. అర్థకామములను గురించి ఎవరికీ ఏదీ ప్రత్యేకముగా బోధ చేయనక్కరలేదు. భగవత్సంబంధమును గురించి, భక్తి గురించి మాత్రం బోధ చెయ్యాలి’ అని నారదుడు చెప్పడం కొనసాగించాడు.

’రోగం ఎక్కడ పుట్టింది?’ అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. డాక్టరుగారు తినవద్దని చెప్పిన పదార్థములను తినడం ద్వారా మనిషి రోగమును పెంచుకుంటున్నాడు. అతను తన రసనేంద్రియములను నిగ్రహించలేకపోవడం వలన అతనికి అటువంటి స్థితి ఏర్పడుతోంది. రోగము వచ్చేస్తుంది. అని తెలిసినా సరే, శరీరమే పోతుందని తెలిసినా సరే, తినాలని కోరికను నిగ్రహించలేకపోయాడు. ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మలనుండి నిన్ను తరుముతోంది. డబ్బు పిచ్చి, ఇంద్రియముల పిచ్చి అలా తరుముతూనే ఉన్నాయి. వాటికి వశుడవు అయిపోతూనే ఉన్నావు. అయినాసరే ఒక బురదలో పడిపోయిన వాడు బురదనీటిని తీసుకొని స్నానం చేసేస్తే వాడు శుద్ధి అయిపోడు. నీవు ఇంద్రియముల చేత తరమబడి తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తినవాడివి, మరల ఇంద్రియములకు సంబంధించిన సుఖములనే శరీరమునకు ఇస్తుంటే నువ్వు ఇక ఎప్పుడూ ఉత్తమగతులు పొందలేవు. ఒంటికి పట్టిన బురదపోవాలంటే మంచినీటి స్నానము కావాలి. మంచినీటి స్నానము ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ఇక్కడ ప్రేమ వున్న అమ్మ స్వభావం కలవారు ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి. అందుకని ఆయన భాగవతం ఇచ్చారు.

No comments:

Post a Comment