Search This Blog

Saturday, December 31, 2016

శ్రీమద్భాగవతం - 89వ భాగం

శ్రీమద్భాగవతం - 89

శ్రీకృష్ణుని అష్ట భార్యలు

కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో వున్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణపరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పరమాత్మ తత్త్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేదో. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత యితర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునునియందు ప్రీతి ఎక్కువ. అందుకనే ఆయన అర్జునునకు సారధ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనకాతల వున్న రహస్యం వేరు. యాత్ర యోగేశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః!తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ!!ఎక్కడయితే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో, అక్కడ మన వెనకాతల కూర్చుని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి, ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమయిన మృగములను వేటాడి డస్సిపోయారు. దాహం వేసింది. ఇద్దరూ యమునా నదిలోని నీటిని దోసిళ్ళతో తీసుకుని త్రాగారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నింటిని ఇంద్రప్రస్థమునకు పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ వుండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యౌవనంలో ఉంది. మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు. ‘అమ్మా నీవు చాలా అందగత్తెవి. మంచి యౌవనములో వున్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా వున్నావు. కాబట్టి నీవు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది’ అని అడిగాడు. అపుడు ఆవిడ ఒక చిత్రమయిన జవాబు చెప్పింది. ‘నేను సూర్య నారాయణ మూర్తి కుమార్తెను. నన్ను కాళింది అని పిలుస్తారు. నేను యమునానదిలో ఉంటూ వుంటాను. నేను జన్మించినప్పుడు నాతండ్రి ఒకమాట చెప్పాడు. యమునానది ఒడ్డున ఒకరోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్ళు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు. చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు’ అని మా తండ్రిగారు నాకు చెప్పి ఉన్నారు. అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను’ అని చెప్పింది. అపుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి ‘వారే కృష్ణ భగవానుడు’ అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు. తరువాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది.ఆతరువాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఖాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్ళారు. ఖాండవ వన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాండీవమును అక్షయ బాణ తూణీరములను అర్జునునకు బహూకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన యింత సామగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. ఆర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలచుకున్నాడు. అదీ శ్రీకృష్ణుని గొప్పతనం. తదనంతరము నందు మయుడనే రాక్షసుడు ఖాండవ వనం దహింప బడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు.అవంతీ రాజ్యమును విందానువిందులు అనబడే వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాధిదేవి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త. ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులయిన విందానువిందులు దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్లకి కౌరవులంటే ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురయిన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని, రాజులందరిని పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు. కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నాగ్నజితి. ఆయన ఒక చిత్రమయిన షరతు పెట్టాడు. ‘నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర వున్న ఏడు పొగరు మోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని యిచ్చి వివాహం చేస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యమును చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు.కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉంది. ఆవిడ పేరు శ్రుతకీర్తి. శ్రుతకీర్తికి ఒక కుమార్తె ఉంది. ఆమెపేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు.తదనంతరము మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు. అలా భగవానుడికి ఎనమండుగురు భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు. ఎనమండుగురు భార్యలు అని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది. యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరససల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం. భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు. భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములయిన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది. ఈశ్వర చైతన్యం లేకపతే ఎనిమిది వస్తువులు జడం అయి ఉండిపోతాయి. ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది. భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ!అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా!!అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు. మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము. ఈశ్వరుడు పురుషుడై జడమయిన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు. ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వరుడు లేకపోతే శివము శవము అయిపోతుంది. ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు ఎనమండుగురినే చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిదిమంది. ఇదీ అందులో వున్న రహస్యం. జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. అందుకనే భాగవతమును రెండుగా వినాలని చెపుతారు. అర్థమయిన చోట జ్ఞానిగా వినాలి. అర్థం కాని చోట భక్తునిగా వినాలి.

Friday, December 30, 2016

శ్రీమద్భాగవతం -- 88వ భాగం

#శ్రీమద్భాగవతం -- 88

శ్యమంతక మణి ఉపాఖ్యానము
ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చుని ఉండగా సత్రాజిత్తు ద్వారక నగరమునకు విజయం చేశాడు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలురందరూ కూడా సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని భ్రమపడ్డారు. ఎందఱో మహర్షులు, తపశ్శాలురు, తేజోమూర్తులు దేవతలు కృష్ణుడి దర్శనమునకు వస్తూ ఉండడం అక్కడ రివాజు. కాబట్టి సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. అనుకుని పరుగు పరుగున వెళ్లి కృష్ణ భగవానుడికి చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు. సత్రాజిత్తు అనే రాజు. ఆరాజు సూర్య నారాయణ మూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడయిన పరమాత్మ ఆయనకు స్యమంతక మని అనబడే మణిని బహూకరించారు. ఆ స్యమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్య నారాయణుడే అని భ్రమపడ్డారు’ అని చెప్పాడు.సత్రాజిత్తు ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా మణులు ఏడో అలంకార ప్రాయమై మేడలో వేసుకునేందుకు పనికి వస్తాయి. కానీ ఈ స్యమంతకమణి ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంది. ఎక్కడ స్యమంతక మణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు. అక్కడ రోగములు రావు. అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధమయిన మానసికమయిన పీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణములతో పాటుగా ఆ స్యమంతక మణికి ఒక శక్తి ఉంది. అది ప్రతిరోజూ తెల్లవారే సరికి ఎనిమిది బారువుల బంగారమును పెడుతుంది. ఆమణిని ధరించి మణులలో కెల్లా మణి అయినవాడు ఎవడు ఉన్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఈ వార్త ముందే కృష్ణునకు చేరింది. వస్తున్నవాడు సత్రాజిత్తు అని తెలుసుకున్నాడు. సత్రాజిత్తు స్యమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు. కృష్ణ పరమాత్మ నోరువిప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకి లేక కాదు! ఆయనకు చేత కాక కాదు! కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో మథురలో ఉండే కొన్ని లక్షలమంది ప్రజలను సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరమునకు చేర్చిన మహా పురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు. లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయనకోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటి! సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ ఈ మణిని నీవు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనములు ఉంటాయి. రాజ్యమునందు ఏ విధమయిన అరిష్టము ప్రబలదు. నీ ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత యిబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆ స్యమంతకమణిని ప్రభువుకి బహూకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు.అనగానే వచ్చిన సత్రాజిత్తు మనస్సులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆమణిని యాదవ విభునకీయవలసినదని కృష్ణుడు చెప్తే సత్రాజిత్తు ధనేచ్ఛచేత ఆ మణిని యివ్వడానికి అంగీకరించలేదు. మణిని యివ్వకపోతే కృష్ణుడు తనను ఏమీ చేయలేడని భావించాడు. కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి తొలగినట్లయితే ఉపద్రవం మిమ్మల్ని సముద్రం ముంచెత్తినట్లు ముంచెత్తేస్తుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదము కూడా వానిని ఏమీ చేయదు. ప్రమాదము తప్పుకుంటుంది. కృష్ణుడు ‘నేను చెప్పాను. వినలేదు. నీవే పర్యవసానమును తెలుసుకుంటావు’ అని మనసులో అనుకున్నాడు. సత్రాజిత్తు తన గృహమునకు వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్రాజిత్తుకు అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడు అన్నది మరిచిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రం ప్రచారం చేసుకుంటున్నాడు. ఒకరోజున సత్రాజిత్తు తమ్మునికి ఒక చిత్రమయిన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసేనుడు. తాను ఆ మణిని ధరించి వేటకు వెడతానని అన్నగారిని అడిగాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించాడు. అపుడు ప్రసేనుడు మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహము చూసి మాంస ఖండం అనుకోని అమాంతం వచ్చి ప్రసేనుడి మీదకి దూకి అతనిని సంహరించి అతని మెడలోని మణిని తీసుకుని నోట కరుచుకుని వెళ్ళిపోతోంది. అటునుండి జాంబవంతుడు వస్తున్నాడు. జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు. కానీ ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతోంది. సింహము మణిని పట్టుకు పోతుంటే జాంబవంతుడు చూశాడు. సింహంతో యుద్ధం చేసి సింహమును చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. అది తినే పదార్ధం కాదని కేవలం ఒక మణి అని జాంబవంతునికి తెలుసు. జాంబవంతునికి కొడుకు పుట్టి ఉన్నాడు. ఆకొడుకు ఆడుకోవడానికి ఉయ్యాల పైభాగంలో ఈ మణిని కట్టాడు. ఆ పిల్లవాడు దానితో ఆడుకోవడం ప్రారంభించాడు.సత్రాజిత్తు మణి గురించి ఎంతమంది సైన్యమునో పంపించాడు. ఎన్నోచోట్ల వెతికించాడు. అసలు ప్రసేనుడు చచ్చిపోయిన చోటుకాని, గుర్రం కాని కనపడలేదు. కృష్ణుడే ప్రసేనుడిని సంహరించి ఆ మణిని అపహరించాడు’ అని ప్రచారం చేశాడు. ఇపుడు కృష్ణుడు తనమీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలని అనుకున్నాడు. ప్రసేనుడు వేసుకుని వెళ్ళాడు అని తెలుసుకుని బంధుమిత్రాదులను తీసుకుని మణిని వెదకడానికి అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ఒకచోట ప్రసేనుడి గుఱ్ఱము, అతని కళేబరము కనపడ్డాయి. ప్రసేనుడిని ఎవరో చంపి ఉండాలని గ్రహించి వెతకగా సింహం అడుగుజాడలు కనపడ్డాయి. వాటి దగ్గర భల్లూకపు అడుగుజాడలు కనపడ్డాయి. అంటే సింహమును భల్లూకం చంపి ఉంటుందని భావించారు. ఈసారి భల్లూకం వెళ్ళిన వైపు వెళ్ళగా గుహలో ఉయ్యాలమీద మణి వ్రేలాడుతోంది. కృష్ణుడు ఆ మణిని తీసుకుని వెళుతుండగా జాంబవంతుడు వచ్చాడు. ఆకార స్వరూపముల చేత కృష్ణుడు తన స్వామియే అని గుర్తించలేకపోయాడు. వారిరువురి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణునితో యుద్ధం చేసి డస్సిపోయి ఒంటిలోంచి రక్తం కారుతుండగా క్రింద పడిపోయాడు. తనని ఓడించినది ఎవరా అని చూడగా ఈ కృష్ణుడు ఆ రాముడు ఒక్కడే అని తెలుసుకుని ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేసి మణిని, జాంబవతి అనే కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసి పంపించాడు. తరువాత బలరాముడు మొదలయిన వారందరితో సభాచేసి సత్రాజిత్తును పిలిచి అందరూ చూస్తుండగా నేను అపహరించాను అన్నావు. దీనిని జాంబవంతుడు తీసుకు వెళ్ళాడు. నీ మణిని నీవు తీసుకో’ అని మణిని ఇచ్చివేశాడు. మణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు సత్రాజిత్తు. కొన్నాళ్ళకి సత్రాజిత్తులో కృష్ణుని అనవసరంగా నిందించాననే భావన ఏర్పడి జాంబవంతుడు ఏం చేశాడో తాను కూడా అదే చేయాలనుకున్నాడు. సత్యభామ రాజనీతిజ్ఞురాలు, యుద్ధ నీతిజ్ఞురాలు. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటికీ మించి సౌందర్యాతిశయములు కలిగినటువంటి స్త్రీ. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి సత్యభామను మణిని స్వీకరించమని అడిగాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని మణిని నిరాకరించాడు. కొన్నాళ్ళు అయిపొయింది. కృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి స్యమంతకమణిని ఎత్తుకు రావడానికి శతధన్వుడు సత్రాజిత్తు అంతఃపురమునకు వెళ్ళాడు.సత్రాజిత్తు గాఢనిద్రలో ఉన్నాడు. శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసి మణిని తీసుకుని పారిపోయి కృతవర్మ, అక్రూరుల వద్దకు వెళ్ళగా ఇద్దరూ కృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతధన్వుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దానినుండి ప్రకాశం వచ్చే ప్రకాశం వల్ల ఎక్కడ వున్నా తన ఉనికిని పట్టేస్తారు. అందుకని మణిని అక్రూరుని యింట్లో పడవేసి శతధన్వుడు పారిపోయాడు. సత్రాజిత్తు మరణ వార్తవిని కృష్ణుడు వెంటనే వచ్చి అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వలననే చచ్చిపోయాడు. శతధన్వుడి వల్ల సత్రాజిత్తు మరణించాడని తెలుసుకున్న కృష్ణ పరమాత శతధన్వుడు ఎక్కడ ఉన్నా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు. శతధన్వుడు మిథిలానగరం వరకు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చక్రమును ప్రయోగించాడు. శతధన్వుడు మరణించి గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు. వాని దగ్గర వెతకగా మణి కనపడలేదు. బలరాముడు వీడు ఖచ్చితంగా తన స్నేహితులయిన వారి యింట్లో ఆ మణిని పెట్టి ఉండవచ్చు అన్నాడు. కృష్ణుడు వచ్చి అక్రూరా నీవు స్యమంతకమణిని తీశావా అని అడుగుతాడేమోనని భావించి మణిని తీసుకుని అక్రూరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అక్రూరుడు ఇలా చేస్తాడని మనం ఊహించం. ఎందుకు అలా చేశాడో మనం తెలుసుకోవాలి. సత్రాజిత్తు మా పరమాత్మ మీద యిన్ని నిందలు వేస్తారా అని కడుపులో ఆగ్రహం పెంచేసుకుని ఎలాగైనా సత్రాజిత్తును చంపించాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్వుని రెచ్చగొట్టారు. వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కరలేదు. శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ మణి అక్రూరుని చేరి ఉంది. మణి ఉన్నదని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతారేమో నని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరం అయిపోయారు. అతి భక్తితో చేసిన తప్పిదములు ఈశ్వరునికి దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఎంత దూరమయినా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉన్నది. అక్రూరునిలో మూడు లక్షణములు కలిసి వచ్చాయి. ఒకటి అతడు జన్మతః సాధించుకున్న ఫలితం, రెండు మహాపురుషుని తేజస్సు, మూడు అలవిమీరిన కృష్ణ భక్తి. ఈశ్వరుడే అక్కడ వున్నా భక్తుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షములు కురవడం ఆగిపోయాయి. ఈవిషయం కృష్ణుడు తెలుసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీలులేదు. మీరు వెళ్లి కృష్ణ భగవానుడు పరమ సాదరంగా తీసుకు రమ్మంటున్నాడు అని అక్రూరునికి చెప్పి తీసుకురండి’ అని తన సేవకులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి అక్రూరుడికి స్వాగతం చెప్పారు. తాను తెలిసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తిలో పొరపాటు చేశానని అక్రూరుడు పశ్చాత్తాపపడ్డాడు. భక్తి సంయమనం ఎంత అవసరమో స్యమంతకోపాఖ్యానం నిరూపణ చేస్తుంది. కృష్ణ పరమాత్మ అక్రూరునికి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువుచేసి అక్రూరునితో ఒక మాట అన్నారు. ‘మహానుభావా, నీవు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నీవు వెళ్ళిపోతే యిక్కడ వర్షములు పడలేదు. మణి నీ దగ్గరే ఉంది. మణిని నేను అపహరించలేదు అనే విషయం మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. నిన్ను శిక్షించి తేవడం ణా అభిమతం కాదు. ఎందుకనగా నీవు నా భక్తుడవు. నీ అంత నీవుగా యిచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది. పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను దోషం లేని వాడనై నిలబడినట్లు ఉంటుంది’ అన్నాడు.అంతకుమించి అక్రూరుని నిగ్రహించలేదు. వెంటనే అక్రూరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా నా వలన నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న మణిని తీసి ఇచ్చివేశాడు. కృష్ణుడు దానిని సభలోని వారందరకూ చూపించి అక్రూరునికి ఇచ్చి వేశాడు. దానిని అక్రూరుడు తీసుకువెళ్ళి తన యింటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజూ ఎనిమిది బారువుల బంగారమును పెట్టేది. దానితో అక్రూరుడు ప్రతిరోజూ చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవంతుడికి స్మరిస్తూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితమును కృష్ణ పరమాత్మ అక్రూరునికి యిచ్చాడు. ఇప్పుడు ఆ స్యమంతక మణి ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఈశ్వరార్చనకు దగ్గర పెట్టుకున్న వానికి మణి బరువు కాదు. అక్రూరుడు చేసే యజ్ఞ యాగాదుల వల్ల చక్కగా వర్షములు పడేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉండగా ఈ మణి అక్రూరుని వద్ద శాంతించినది. పరమోత్క్రుష్టమయిన ఈ ఆఖ్యానమును ఎవరు వింటున్నారో వారందరికీ ఒక దివ్యమయిన ఫలితం వస్తుందని చెప్పబడింది. చాలాకాలము నుండి తను చెయ్యని నేరమునకు తనమీద అపనిందతో ఉన్నవాడు ఎవరయినా ఉన్నట్లయితే తన మీద వున్నా అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ ఉపాఖ్యానమును చదివినా విన్నా, మనస్సులో ఒక్కసారి తలచుకున్నా వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయే అవకాశం కలుగుతుంది. మహా భక్తుడయిన అక్రూరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుని మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రం మనం మరచిపోకూడదు.

శ్రీమద్భాగవతం -- 87వ భాగం

#శ్రీమద్భాగవతం -- 87🌹🌹🌹
దశమ స్కంధము - ఉత్తర భాగము ప్రద్యుమ్నకుమార చరిత్ర
పోతనామాత్యుల వారు దశమ స్కంధము ఉత్తర భాగమును ప్రారంభిస్తూ అంటారు శ్రీకర! పరితోషితరత్నాకర! కమనీయ గుణగణాకర! కారుణ్యాకర! భీకరశర ధారాకంపిత దానవేంద్ర! రామనరేంద్రా!!
వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు. ‘శ్రీకర’ – సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా! అపారమయిన కారుణ్యమునకు అవధి అయిన వాడా! శత్రువులను పరిమార్చకలిగిన వాడా! రామచంద్ర ప్రభో! భాగవతం ఉత్తర భాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను’ అన్నారు. దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనము ఏ పనిమీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహముతో తాదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడయిన వాడికి అలవాటు కావాలి. అందుకని సంతతము ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ‘నా అంతటి వాడిని నేను’ అని అనడు. అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. కానీ ఆయన మహా దయాళువు. అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనయినా సహిస్తాడు. అందుకనే ఎంత గొప్పమాట అంటారో చూడండి! కమనీయ గుణగణాకర! కారుణ్యాకర!’ మహా కారుణ్యము కలిగినటువంటి వాడా – రామచంద్రప్రభో! అని ప్రారంభం చేశారు. మనం కూడా దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితములో ప్రత్యేకముగా అస్తమానూ ఈశ్వరుడిని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు.రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురుటికందుని చూసుకొని ఆమె పరవశించి పోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆమె నుండియే మిగిలిన అష్టలక్ష్మిలు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండడానికి యిష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు యిచ్చింది.బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది. ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపియై ప్రవేశించాడు. పురిటి పొత్తిళ్ళలో ఉన్న ప్రద్యుమ్నుడనబడే ఆ చిన్న బిడ్డడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించ వలసిన లీల. ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమయిన అనుగ్రహం, కారుణ్యం, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పముతో ఎలా ఏమి జరుగుతాయన్నది మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీయందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఎంత గొప్ప పద్యమును ఇచ్చారో చూడండి! తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలందా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికైవేమఱు నిష్ఠఁ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీకామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్!!
ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది వున్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు. మన్మథుడు శ్రీమహావిష్ణువు కుమారుడు. శ్రీమహావిష్ణువు అందం అంతా మన్మథునికి వచ్చింది. మన్మథుడు అనగా మనస్సులను మథించగలిగిన వాడు అని అర్థం. ఆయన పుష్ప బాణుడై అవతలవారి మనస్సులను కదుపుతాడు. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణ ప్రయోగం చేయబోయాడు. ఇంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మథుడు కనపడ్డాడు. అంతే! మూడవకన్ను తెరిచాడు. కాముడు భస్మమయిపోయాడు. అతను హర తేజస్సుచేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు. మూడవకంటి మంట. ఇంక డానికి ఎదురులేదు. అటువంటి మంటయందు మన్మథుడు దగ్ధమయి పోయాడు. శివుడికి ఉన్న మూడు నేత్రములే సూర్యచంద్ర అగ్నిహోత్రములు. అటువంటి అగ్నిహోత్రముచేత కాలి బూడిదరాశియై పడిపోయాడు. మన్మథుడు కాలిపోవడం పరమశివునకు విజయము. ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు. కామునికి లొంగడు. కాని మన్మథుడు దహింప బడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఇపుడు ఆమెకు ఎవరు అయిదవతనమును ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనము పొండుతారనే భావనచేత మన్మథుడు బానప్రయోగం చేశాడో, అటువంటి భర్తను తనకు యిమ్మనమని పార్వతీదేవిని, పార్వతీ పరమేశ్వర కళ్యాణం తరువాత రతీదేవి అడిగింది. అందువలన పరమేశివుని మంట చేత కాలిపోయిన మన్మథుని మరల పార్వతీదేవి బ్రతికించినది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువలననే కాలి బూడిద అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగినది. ఆవిడ ఏదయినా చేయగలదు. అటువంటి శక్తి స్వరూపం ఆవిడ! ఆమె రతీదేవికి ఒక వరం యిచ్చింది. నీ అయిదవతనమునకు భంగం లేదు. నీ భర్త అనంగుడు అవుతాడు. శరీరం ఉండదు. కానీ నీకు కనపడతాడు. పైన ఎవ్వరికీ కనపడడు. నీకు మాత్రం కనపడతాడు’ అని వరం యిచ్చింది. రతీదేవికి తన పతిని శరీరముతో చూడాలని కోరిక కలిగింది. అపుడు పరమశివుడు మన్మథునితో అన్నాడు ‘వచ్చేసారి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించెదవుగాక! అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు’ అని వరం ఇచ్చాడు.ఈ పుట్టిన మన్మథుడు రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు హరుని కంటిమంటచేత కాలిపోయిన వాడు యిప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్లి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ‘తాను రాక్షస సంహారం చేసి భూభారమును తగ్గిసాను’ అని అభయం యిచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదుకదా! ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంది. ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడు ఉన్నాడు. అతను శంబరాసురుడు అనే రాక్షసుడు. వానికి ఈ విషయం తెలుసు. తన మృత్యువునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు. అందుకని శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్ళిపోయాడు. కానీ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు శంబరాసురుని ఇంటికే వెళ్ళాడు. శంబరాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపముతో దాని కడుపు కోయగా కడుపులో చంటి పిల్లాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ళ ప్రభువు అయిన శంబరాసురుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. శంబరాసురుడు మాయకు వశుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా, ఈ మాంస నేత్రముతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురుచూస్తోంది. అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతొ శంబరాసురుని వంటశాలలో ఉంది. ఈమె శంకరాసురుని వద్దకు వెళ్లి ఆ పిల్లవాడిని తనకివ్వమని, వానిని తాను పెంచుకుంటానని చెప్పింది. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు. ప్రపంచంలో ఎవరయినా తన భర్తను భర్తగా మాత్రమె చూడగలరు. కానీ భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మథుడనని తెలియదు. రతీదేవికి తెలుసు. ప్రద్యుమ్నుడికి యౌవనము వచ్చిన తరువాత ఈమె ప్రవర్తనయందు చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తనయందు దోషమును కనిపెట్టి ‘నీవు మాతృత్వమునకే కళంకం తెస్తున్నావు. నీ ప్రవర్తన యందు దోషం కనపడుతోంది. ఎందుకు నీయందు ఈ విధమయిన విచిత్రమయిన ప్రవర్తన జరుగుతోంది?’ అని అడిగాడు. అపుడు ఆవిడ జరిగిన విషయమును తెలియజెప్పి ఆ అమ్మకు వున్నా కష్టమును పరిమార్చి నీవు మరల అమ్మవద్దకు చేరవద్డా’ అని అడిగింది. ఆయనలో వున్న మాతృ భావమును ఎవరి వైపుకి తిరగాలో వారి వైపుకి తిప్పింది. అవతార ప్రయోజనమును పూర్తి చేయిస్తోంది. అప్పుడు ప్రద్యుమ్నుడు ‘ఉత్తర క్షణం నేను ణా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను వెంటనే శంబరాసురుణ్ణి చంపేస్తాను’ అన్నాడు అపుడు ఆమె ‘నీవు అంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలను నిర్జించడం ఎవరివల్లా కాదు. కాబట్టి నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను. ఆ విద్యపేరు మహామాయా విద్య’ అని ఆ విద్యను బోధచేసింది. అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకులను చెపుతారు.మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథః అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంధశ్శివస్తథా క్రోధభట్టారకోదేవ్య ద్వాదశాని ఉపాసకాః!!
అను ఈ పన్నెండుమంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళి అయిన తరువాత మాతృత్వమును కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి. అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడమును అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు. చూడండి ఆయన ఉపకారం. ప్రద్యుమ్నుడు మహా మాయా తత్త్వమును పొంది శంబరాసురుని మీదికి యుద్ధమునకు వెళ్ళాడు. వాడికి ఈ సత్యం తెలియగానే తోక త్రొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మహా మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అణచివేసి తరువాత కత్తిలో శంబరాసురుని కుత్తుక ఖండించివేశాడు. ఎవరిచేతిలో శంబరాసురుద్ చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వానిచేతిలోనే శంబరాసురుడు చచ్చిపోయాడు. అలా చంపివేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా! ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు. కానీ ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకి తెలుసు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసింది మనం చేయకూడదు. కృష్ణుడిది పరిపూర్ణావతారం. కృష్ణుడిని అనుకరించకూడదు.ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశమార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్లు అలానే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదా అని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి ‘అమ్మా, ఎవరో ఆకాశమునుండి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడి లాగానే ఉన్నారు. మీరు చూడవలసినది’ అని చెప్పారు. వెంటనే రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది. ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపొయింది. ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె స్తన్యములలో పాలు చేపునకు వచ్చాయి. ఆవిడ అంది “ఈపిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే యిప్పటికి యింత అయి ఉండేవాడు. ఈతడు నా కొడుకే అయివుండాలి’ అనుకుంది. అమ్మ యిరువది అయిదేళ్ళ తరువాత తన కుమారుని గుర్తు పట్టేసింది. ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకువచ్చారు. ఆయన మహా మాయావి. ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక, ఒకసారి ప్రద్యుమ్నుని వంక చూసి ప్రద్యుమ్నుని ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పేలోపల అక్కడికి మహా జ్ఞాని అయిన నారదుడు వచ్చాడు. ‘అయ్యా! నీకు తెలియని విషయమా! ఆనాడు మన్మథుడు కాలి బూడిద అయిపోతే వరం యిచ్చారు కదా! దాని ప్రకారం మన్మథుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో శంబరాసురుడు అపహరించాడు. తరువాత యితడు శంబరాసురుణ్ణి సంహరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ యింటికి కొడుకు కోడలు కూడా ఈశ్వర వరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకుని చేసుకున్న పెళ్ళి కాదు. ఇది జన్మజన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యత్వమును నిరూపించుకొని, భర్తను తీసుకుని వచ్చి తల్లికి అప్పజెప్పిన కోడలు! అత్తగారియందు అంత గౌరవమును చూపించిన కోడలు! యింక యింతకన్న నీకు ఏమికావాలి?’ అని చెప్పాడు.రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని, రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మ్రోగాయి.చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లవాడు బతికి వచ్చాడు. ఆహా! రుక్మిణీ దేవి ఎంత తపస్సు చేసినదో! మరల కొడుకు యింతవాడయి కనపడ్డాడు’ అని గోపకులందరూ

శ్రీమద్భాగవతం -- 86 వ భాగం

#శ్రీమద్భాగవతం -- 86 🌷🌷🌷

స్వామి ఈ లేఖను చదివి, దానిని పక్కనపెట్టి అగ్నిద్యోతనునీతో ‘ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను’ అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అపుడు అగ్నిద్యోతనుడు అన్నాడు “ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు. గురువు ఈశ్వరదర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ యిద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణా నీవు వెంటనే బయలుదేరి రావలసినది’ అని చెప్పాడు. ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు.‘తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?” అని బలరాముడు అడిగాడు. ‘విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షస వివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాతల బలరాముడు వెళ్ళాడు.కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడురా మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!!
ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి’ అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది.ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?విని కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుండనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యా మహా దేవియున్నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?
‘అగినిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో యిలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో’ అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు."తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుందగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱందగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియైమగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."
‘నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గోప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులయితే ఎంత బాగుంటుందో! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని యిచ్చేస్తాము. మా పుణ్య ఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి’ అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది.అమ్మవారు అన్న మాటలో ‘ఆర్యామహాదేవి’ అనే ఒక గమ్మత్తయిన మాట వుంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు.బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతేఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌత్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరిఃపూజ్యాత్ పూజ్యతర స్స ఏవహి నచేత్ కోవా తదన్యోధికః!!
శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతొ పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది.ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి ‘కన్యకా! కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువు నయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది’ అన్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగల్గుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కతాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పిందినమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పెద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! నిన్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు యిద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా, నీవు తరగని అయిదవ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ యీశ్వరీ, నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు’ అంది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది. రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందఱో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు.కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావలగ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదేహు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్!!
రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది. ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడుబ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన. బ్రతుకు కలిగెనేని భార్య కలదుబ్రతికితీవు; భార్యపట్టు దైవమెరుంగు, వగవ వలదు చైద్య! వలదు వలదు!!
శిశిపాలా, నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు’ అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడిమా సరివాడవా మా పాప గొనిపోవ? నేపాటి గలవాడ? వేది వంశ?మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి? వెయ్యది నడవడి? యెవ్వడెరుగు? మానహీనుడ వీవు? మర్యాద లెరుగవు; మాయ గైకొని కానీ మలయ రావు;నిజరూపమున శత్రు నివహంబుపై బోవు; వసుధేశుడవు గావు వావి లేదు;కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు, విడువు; విడువవేని విలయకాలశిఖిశిఖా సమాన శిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు!!
రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. ‘నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు నిలు కృష్ణా, నిన్ను యిప్పుడే తుదముట్టించేస్తాను’ అని వస్తున్నాడు.కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నిండా చేస్తున్నాడు. కానీ అది స్తుతిపాఠం అయిపొయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్ట్టుకొని సంకల్పం చేస్తున్నారు.అని డగ్గుతికతో మహాభయముతో నాకంపితాంగంబుతోవినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁగనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిం దెగవ్రేయఁబోక మగిడెం గృష్ణుండు రోచిష్ణుఁడై.
అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తనతోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని యింకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది, భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా ఈశ్వరా, నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు’ అని ఆయన పాదములు పట్టుకుంది. అపుడు కృష్ణుడు ‘వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను’ అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు. తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు.ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.br/>ఆరోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినది, అయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడ గ్రీడ సలుపుచున్న కృష్ణు జూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి, ప్రీతి లగుచు ముక్త భీతు లగుచు!!
ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. ‘ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు’ అని ప్రజలందరూ భావించారని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు.

Tuesday, December 27, 2016

శ్రీమద్భాగవతం - 85 వ భాగం

#శ్రీమద్భాగవతం -- 85

తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ యింటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడు అయి వుండాలి. అంతే కానీ యింటికి వచ్చేవాడు లౌకికమయిన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక యింట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే యింట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. యింట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన యింటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి వున్నదై ఇంతకూ పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై కులవతియై ఆచారము సంప్రదాయము తెలిసి వున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.
బంధువు లెల్ల గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషిసింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టి దు స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపుష్పందయవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నంధుడై!!
నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి యింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు. ఇపుతూ రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. ‘మహానుభావా నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది’ అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేతూ అయ్యా మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?’ అని అడిగాడు.అపుడు అగ్నిద్యోతనుడు ‘నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీ దేవి మీకు యిచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది’ అని ఆలేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి ‘నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి’ అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది. నేను కాని గత జన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను అయితే ఒక నోము నోచిన దానను అయితే ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పెట్టిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే వుంటే అధముడయిన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను ఔదును గాక! అంది.ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు యింద్రియములు. చేది ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. యింద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి. కృష్ణా నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశ పెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి. రుక్మిణీ నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అపుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర వున్నా పరమశివుని యిల్లాలయిన పార్వతీ దేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో. అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.
అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరమూ నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మేడలో వున్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవునే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండునే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగునే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయునట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు,కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ఈశ్వరా, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగాలిగిన నాడు ణా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన”. నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను’ అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.

శ్రీమద్భాగవతం - 84 వ భాగం

 #శ్రీమద్భాగవతం - 84

వారు మరికొంత లోపలికి వెళ్ళగా చాణూర ముష్టికులు ఉన్నారు. మనలో ఉన్న కామక్రోధములే చాణూరముష్టికులు. వాళ్ళు మల్లయుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకు పట్టుకు మనలను పడగొడతారు. ఇప్పుడు కంసుడు చాణూర ముష్టికులను ప్రయోగించాడు. అజ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదకమీద మల్లయుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమయిన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ వున్నవారు ఆశ్చర్యపోతున్నారు. వాళ్లకి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది. ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది. వాళ్ళు అన్నారు – ‘ఇదేమీ వైకుంఠ పురం కాదు, కంసుని సభ. ఇది సంసారమును వదిలి పెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. పిల్లాడా, మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు – సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా, నిన్ను మట్టు పెడతాము’ అన్నారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమయిన మల్లయుద్ధం జరిగింది. గరుడుడు పాములను పట్టుకుని ఎగరేసుకు పోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూరముష్టికులను ఇద్దరినీ సంహరించారు. వీళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తితీసి భటులను పిలిచి ‘వసుదేవుని సంహరించండి – ఉగ్రసేనుని సంహరించండి – ఈ గోపాల బాలురను మట్టుబెట్టండి’ అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే కంసుడు పంచత్వమును పొందేశాడు. వాడు చచ్చిపోయాడు.కంసుని మీదకి కత్తి విసరలేదు.
జరాసంధుడు – కాలయవనుడు – ముచుకుందుడుతరువాత ఒక ముఖ్యమయిన ఘట్టం జరిగింది. జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసునికి యిద్దరు భార్యలు. వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి ‘కృష్ణుడు మా భర్తను సంహరించాడు మాకు వైధవ్యం వచ్చింది’ అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి ఇరువది మూడు అక్షౌహిణుల సైన్యమును తెసుకొని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా పదిహేడు మార్లు వచ్చాడు. పదేహేడు మార్లూ అనేక అక్షౌహిణుల సైన్యమును కృష్ణుడు చంపాడు. పదునెనిమిదవ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు.ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమయిన పని చేశాడు. జరాసంధుడు మధురా నగరమును ముట్టడిస్తే అమాయకులమయిన గోపాల బాలురు మరణిస్తారని, తనకి కొంత చోటును యిస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు యిచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరునకు తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. కాలయవనుడు అని ఒకాయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒకమాట చెప్పాడు ‘ నీవు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. ఆ కాలయవనుడు అతని యవన సైన్యమునంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిదిచేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరయినా ఉంటె కదా! లోపల బలరామ కృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరకు వస్తున్నాడు. అలా వస్తున్నా వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తు పట్టి కృష్ణా, నీకోసమే వచ్చాను ఆగు’ అన్నాడు. కృష్ణుడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక కొండగుహ లోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలివేసి కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండగుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పడుకుని వున్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ‘ఎవడురా నన్ను నిద్రలేపిన వాడు’ అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కిందపడిపోయి బూడిద యిపోయాడు. అపుడు పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడు ఎవరు?” అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడనేవాడు ఒకడు ఉండేవాడు. ఆటను మహా తేజోసంపన్నుడు. గొప్ప భక్తుడు. రాక్షససంహారమునకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఆఖరుకి కుమారా స్వామివారికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకొనమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు నిద్రపోవాలని ఉంది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి’ అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. ‘నీకు ఎవరయినా నిద్రాభంగం చేస్తే నీవు వాడికేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు’ అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా! ఈవిధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు.ఇపుడు పదునెనిమిదవ సారి జరాసంధుడు వచ్చాడు. బలరామ కృష్ణులిద్దరూ కోటలోనుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారివెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్లకి బలరామకృష్ణులు కనపడలేదు. అపుడు జరాసంధుడు ఆ పర్వతము నంతటినీ తగల పెట్టెయ్యమణి తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగులపెట్టేశారు. అపుడు అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులిద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీదనుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు యిద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణబలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు. ఇందులో మీరు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉంది. ‘సంధి’ అనగా సగము. సంధికాలము వచ్చింది. యుగ సంధి వచ్చింది అంటారు. మనం ఎవరినయినా ఆశీర్వచనం చేస్తే ‘శతమానం భవతి శతాయు పురుషశ్శతేంద్రియఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతీ’ అంటూ నూరు సంవత్సరములు జీవించు అంటాము. నూరు సంవత్సరములలో సగము ఏభై. మీరు ఈశ్వరారాధన ఈ ఏభై లోపల చెయ్యాలి. ఏభై తరువాత చేసే ఆరాధన మానసికమయినది. ఏభై తరువాత అంత కలివిడిగా శరీరముతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ ఏబది సంవత్సరముల వయసు లోపల పూర్తి అవాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు. మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు. అనగా హృదయగుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడయిపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరమూ భక్తితో ఉండడం. పరమభక్తితో ఉంటే మృత్యువు మిమ్ములను ఏమీ చేయలేదు. అపుడు యమధర్మరాజు గారు మీ దాపులకు రాడు. పరమభక్తుడయిన వాడిని తీసుకు వెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు. శివుని పార్షదులు వస్తారు. యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమయిన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈవిధంగా లోకమున కంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.రుక్మిణీ కళ్యాణంభాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారువినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుండను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుండనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలైమనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగుబాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పుబర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Monday, December 26, 2016

SremadBhagavatam - శ్రీమద్భాగవతం

#SremadBhagavatam #శ్రీమద్భాగవతం

భాగవతోత్తములకు అందరికి జై శ్రీ రామ్-జై శ్రీ కృష్ణా...
మనం మంగలకరమైన ఈ రోజు న భగవంతుని అవతారాల ప్రయోజనం శ్రీ భాగవతం గురించి అద్యయనం మొదలుపెడుతున్నాం...
ఆ సర్వేశ్వరునికి శత కోటి ప్రణామములతో:-

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

$$$$$$$$$$$$$$$$$$$

భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –

‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి’

నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి.
ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను ఉంది మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునండు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.
Sapta Vandanamulu !
🙏🙏🙏🙏🙏🙏

శ్రీమద్భాగవతం - 1 వ భాగం

శ్రీమద్భాగవతం - 1 వ భాగం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.

వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విదివిదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.

పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమినిచేత వెతమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.

‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ!
వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం!!

పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశాములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధంగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రమునొకదానిని పెద్దలు ప్రతిపాదించారు.

‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!

‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!! (దేవీభాగవతం 1-3-21)
మద్వయం – మకారంతో రెండు పురాణములు ప్రారంభంఅవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము.
భద్వయం – భ తో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణము, భవిష్య పురాణము.
బ్రత్రయం – బ్ర’ తో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము.
వచతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహపురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము.
అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణం వస్తుంది.
అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.
వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.

NEXT PART

శ్రీమద్భాగవతం - 2 వ భాగం

శ్రీమద్భాగవతం - 2 వ భాగం

మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు.

పురాణ వాజ్ఞ్మయమునంతటిని కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుకచేతనే అపారమయిన జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే – ఆయన మంచి నిండు యౌవనములో ఉండే రోజులలో తండ్రిగారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు వివాహం అక్కరలేదు...ఈలోకం అంతా దుఃఖభూయిష్టమయిపోయింది. నేను ఆనందమును అనుభవించాలి. అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను’ అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకనుంచి వ్యాసుడు పుత్రునిమీద వున్న కాంక్షచేత ‘హాపుత్రా హాపుత్రా’ అని అరుస్తూ వెంటవస్తున్నారు. శుకుడు ‘ఓయ్’ అనలేదు. అంతటా ఆత్మతత్త్వమును చూడడానికి అలవాటయిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో వున్న చెట్లు అన్నీ ‘ఓయ్ ఓయ్’ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యౌవనమునందే ఒంటిమీద బట్టలేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు.

శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్కనుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటిమీద వస్త్రం కట్టుకోకుండా లేచివచ్చి శుకునికి నమస్కరించారు. అపుడు శుకుడు నిండు యౌవనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అపుడు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కుమారుడు యౌవనంలో ఉన్నాడు. నేను వార్ధక్యమునందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి ఈ తేడా’ అని వ్యాసుడు అప్సరసలను అడిగారు. అడిగితే అప్సరసలు అన్నారు – ‘నీ కుమారునికి స్త్రీ పురుష భేదము తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీపురుష భేదము తెలుసు. అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము’ అని బదులు చెప్పారు. అదీ శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే!

శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరోకరిచేత చెప్పించకుండా శుకునిచేత మాత్రమే చెప్పించారు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్ధత చూశాడు. ‘కుశ’ అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంత సేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే – కర్మ చేయగా చేయగా ఇంటిని తుడుచుకుకుని తుడుచుకుని బూజులన్నీ దులుపుకుని పండగ వచ్చే ముందు శుభ్రపరుపబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చొనడానికి, సత్కర్మాచరణమును పూనికతో సంతోషముతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధియందు ఆనందప్రదమయిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానివలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానముచేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేదానికి దర్భాలతో సంబంధం ఉంది. తిరగేస్తే – ‘శుక’ అయింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణము లేదు. అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యడానికి కర్మలేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడు. ఆయన ఇరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు. బ్రహ్మముతో కలిసిఉంటాడు. బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనందస్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన ‘కౌపీనపంచకము’ అని ఒక పంచకము చేశారు. అందులో – ‘అసలు కౌపీనము పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ వున్నాడు’ అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగియై ఈశ్వరుని పాదారవిందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వానికి ఇంద్రపదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు.

అటువంటి మహానుభావుడయిన శుకుడు నిరంతరమూ ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదయినా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవుపాలు పితకడానికి ఎంతసమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు వాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడయినా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి, వీరు ఫలానా వీరు ఫలానా అని గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ లోపలపెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమము తగ్గిపోయి లోకముతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని ఏడురోజులు భాగవతములు ప్రవచనము చేశాడు.

శ్రీమద్భాగవతం - 3 వ భాగం

శ్రీమద్భాగవతం - 3 వ భాగం

భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహేడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ‘ఎక్కడో ఏదో చెయ్యడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది’ అని అనుకున్నారు.

ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. ‘వేదరాశినంతటినీ విభాగం చేశాను. పదిహేడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది’ అని ఆలోచన చేశారు.

ఆ ఆలోచన చేసినపుడు మహానుభావుడు నారదుడు దర్శనం ఇచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడూ నారదుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడూ నారదుడే. ‘నారం దదాతి ఇతి నారదః’ – ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒకమాట చెప్పారు. ‘వ్యాసా, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో, ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు. భారతమును రచించావు. కానీ భారతంలో కృష్ణకథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతేతప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతున్నదో విశ్వము ఎలా సృష్టించబడిందో పంచభూతములు ఎలావచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై స్థితికర్తయై, ప్రళయ కర్తయై ఈలోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆకారణం చేత నీమనస్సులో ఎక్కడో చిన్నలోటు ఏర్పడింది. ఇది పూర్తిచేయడానికి నీవు భాగవత రచన చెయ్యి’ అని ప్రబోధం చేశారు.

అపుడు వ్యాసభగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత, ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తనజన్మ సార్ధకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మలనుండి మనస్సు ఏది పట్టుకొనక పోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్ధకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు.

అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు.అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగినవ్యక్తి. అందుకని తన కుమారుడయిన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు.

ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –

‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి’

నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను ఉంది మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునండు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.

శ్రీమద్భాగవతం - 4 వ భాగం

శ్రీమద్భాగవతం - 4 వ భాగం

శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాదు – ’ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు’ అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు. పడితీరుతుంది. ధ్రువుడంతటివాని శరీరం పడిపోయింది. ఎవని శరీరం అయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు. ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి ’నేను’ అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. ’నేను’ అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది. మరణభయంలో సమస్తమయిన అజ్ఞానం ఉంది. అవిద్య ఉంది. భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యమును పట్టుకో. అది అంత తేలికయిన విషయం కాదు. భాగవతమును వినినివాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.

ఏడురోజులు భాగావతమును వినిని పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. – ’శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను’ అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము. ’మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ (సౌందర్యలహరి – 97) అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా మాయలో తిరుగుతూనె ఉన్నాము. ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది. అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలు అంటారు –

’నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’

భాగవతమును వినేవాళ్ళు ’భాగవతమును నేను వింటున్నాను” అని ఎప్పుడూ వినకూడదు. ’పిబత భాగవతం’ – భాగవతమును తాగేసెయ్యి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి.కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి – అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ వున్నారు నోరు పుచ్చుకోను అనదు. పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలొ సాధారణంగా మీరు తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూదా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం?

వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమయిన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తననోటిద్వారా ప్రవచనం చేశారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది.

ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారు.
వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉంది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి అవతలపారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు.

పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒకమాట వింటూ ఉంటాము – ’ఏదోనండి, రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడండీ ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండీ – కుదరడం లేదు – నాకూ చదవాలని ఉంటుంది’ అంటూ ఉంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనం చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరినదిలో స్నానం చేసి ఒకసైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. ’పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి’ అన్నారు. వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు – ’అయ్యా మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!’

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
బలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా?

ఎంత వినయముతో చెప్పారో చూడండి! ’నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను” అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి!

భాగవతం - 5 వ భాగం

భాగవతం - 5 వ భాగం

పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.
శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!
పోతనగారి శక్తి ఏమిటోపోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.
పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెట్టే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –
’కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాతభవాండకుంభకు మహానందాంగనా దింభకున్’
అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో
’కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’
ఎదురుగుండా ఉన్న భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టాము అనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు. కాబట్టి ఇపుడు శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ ఎందులోంచి వచ్చాయి? అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. కాబట్టి ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.
పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. ’ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యం పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి ’మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. తరువాత కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంతగొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. అదీ పోతనగారంటే! మహానుభావుడు అంత నిరాడంబరుడు

భాగవతం - 6 వ భాగం

భాగవతం - 6 వ భాగం

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన!
విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేతపరతు!!

ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి! భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. కానీ ’మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన దానిని, నాకు శారదాదేవి ఏది కృపచేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఆయన అంటారు –

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కని గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.

’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఎన్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికి దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యే అని ఏడిచేటటుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.
’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి
చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.
ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.
’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.
అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు. మీరు అస్తమానూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి? ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును ఇచ్చారు.

భాగవతం - 7 వ భాగం

భాగవతం - 7 వ భాగం

భాగవతం అనేది సామాన్యమయిన గ్రంథము కాదు.
లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై!!

దీని స్కంధము చూస్తే లలితము. కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టుబాగా పెరగాలంటే చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తారు. అపుడు చెట్టు బాగా పెరుగుతుంది. శుకబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమయిన స్తోత్రము. అపారమయిన మంజులమయిన మాటలతో శోభిస్తూ ఉంటుంది. ఈ భాగవతము ఎవరు చదువుచున్నారో వారికందరికి, మంచిమనస్సుతో ఉన్న వారికి అర్థమయ్యే స్వరూపము కలిగినది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడిన కల్పతరువు. భాగవతమనేది వేరొకటి కాదు. సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్లే, భాగవతంలో ఒక పది పద్యములు వచ్చినట్లయితే అటువంటి వ్యక్తి కల్పవృక్షమును జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్క. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతనగారు గొప్పగొప్ప ప్రయోగములన్నిటిని, పద్యములుగా తీసుకువచ్చి పెట్టేశారు. వాని కోరిక ఎందుకు తీరదు? అందుకని భాగవతము అంత గొప్పది! అటువంటి భాగవతమును శుకబ్రహ్మ వివరణ చేశారు.

వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒకమాట చెప్పారు. ’వ్యాసా లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలు అందరికి కూడా తెలిసిన విషయములు రెండు ఉన్నాయి. అవి అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవరినీ తీసుకువచ్చి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కరలేదు. అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు. డబ్బు సంపాదించుకోవడం తెలుసు. ఇంకా బొడ్డూడదు కానీ రూపాయి ఎలా సంపాదించాలనే తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కారబలం తక్కువగా ఉంటుంది. అందునా కలియుగంలో ఉంటే వాళ్ళది అల్పాయుర్దాయం. బుద్ధి బలం చూస్తే తక్కువ. ప్రచోదనం ఎప్పుడూ అర్థకామములయందు మాత్రమే ఉంటుంది’.

వానికి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వచ్చేసరికి వానికి మీరు పెళ్ళి చేయలేదనుకోండి – మీరు వానికి పెళ్ళి చేయలేదనే విషయమును వాడు మీకు తెలిసేలా చేస్తాడు. వాడు అమ్మ దగ్గరికి వచ్చి ’నా ఈడువాడు – వాడికి అప్పుడో కొడుకమ్మా అంటాడు’. ఇదివాడు ’అమ్మా మీరు నా సంగటి పట్టించుకోవడం లేదు’ అని తల్లికి పరోక్షంగా చెప్పడమే! ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి – ఎప్పుడో ఒకరోజు పెళ్ళి చేసేసుకొని మీ దగ్గరకి నమస్కారం పెట్టడానికి వచ్చేస్తాడు.

అందుకని ’మానవుడు ఎప్పుడూ అర్థకామములయందు తిరుగుతూ ఉంటాడు. అర్థకామములను గురించి ఎవరికీ ఏదీ ప్రత్యేకముగా బోధ చేయనక్కరలేదు. భగవత్సంబంధమును గురించి, భక్తి గురించి మాత్రం బోధ చెయ్యాలి’ అని నారదుడు చెప్పడం కొనసాగించాడు.

’రోగం ఎక్కడ పుట్టింది?’ అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. డాక్టరుగారు తినవద్దని చెప్పిన పదార్థములను తినడం ద్వారా మనిషి రోగమును పెంచుకుంటున్నాడు. అతను తన రసనేంద్రియములను నిగ్రహించలేకపోవడం వలన అతనికి అటువంటి స్థితి ఏర్పడుతోంది. రోగము వచ్చేస్తుంది. అని తెలిసినా సరే, శరీరమే పోతుందని తెలిసినా సరే, తినాలని కోరికను నిగ్రహించలేకపోయాడు. ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మలనుండి నిన్ను తరుముతోంది. డబ్బు పిచ్చి, ఇంద్రియముల పిచ్చి అలా తరుముతూనే ఉన్నాయి. వాటికి వశుడవు అయిపోతూనే ఉన్నావు. అయినాసరే ఒక బురదలో పడిపోయిన వాడు బురదనీటిని తీసుకొని స్నానం చేసేస్తే వాడు శుద్ధి అయిపోడు. నీవు ఇంద్రియముల చేత తరమబడి తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తినవాడివి, మరల ఇంద్రియములకు సంబంధించిన సుఖములనే శరీరమునకు ఇస్తుంటే నువ్వు ఇక ఎప్పుడూ ఉత్తమగతులు పొందలేవు. ఒంటికి పట్టిన బురదపోవాలంటే మంచినీటి స్నానము కావాలి. మంచినీటి స్నానము ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ఇక్కడ ప్రేమ వున్న అమ్మ స్వభావం కలవారు ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి. అందుకని ఆయన భాగవతం ఇచ్చారు.

భాగవతం - 8 వ భాగం

భాగవతం - 8 వ భాగం

నారదుడు వ్యాసునికి చెపుతున్నాడు – ’నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, వారికి రాజ్యములు ఎలా వచ్చాయో మున్నగు విషయములను గూర్చి వివరించి వ్రాశావు. అవి అన్నీ ఇప్పటి ప్రజలకు చాలాబాగా తెలుసు. ఇప్పటి వ్యక్తులు భారతము ఏమీ చదవకుండా దుర్యోధనుని కన్నా అహంకారముతో తిరగగలరు. ధృతరాష్ట్రునికన్నా బాగా పక్కింటివాడిది తెచ్చి దాచేసుకోగలరు. ’నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గూర్చి ఏమీ చెప్పలేరు. భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియలౌల్యం వీనిని వచ్చే జన్మలో హీన ఉపాధులలోకి తీసుకుపోతుంది.’ భగవంతునికి ఏమీ రాగద్వేషములు ఉండవు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయిందనుకోండి. ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది. మీరు వినే వుంటారు.

వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే
వ్యర్థంబైచెడు వాక్ప్రవాహములచే వాత్సల్యచిత్తంబుచే
అర్ధజ్ఞానముచే మహద్భ్రమతచే హాస్యప్రసంగాలచే
స్వార్థంబే పరమార్థమై చెడుదు రీస్వార్థప్రజల్ శంకరా!! (శ్రీశంకర శతకము – ౮౦)

వాడికి కామం ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్బది ఏళ్ళు వయస్సు వచ్చేసిన తరువాత మంచి పంచె కట్టుకొని వచ్చాడనుకోండి – ’తాతయ్యా పెళ్ళికొడుకులా ఉన్నావు’ అని సరదాకి ఎవరయినా అన్నారనుకోండి – అంటే ’అమ్మా అలా అనకూడదు. పెళ్ళికొడుకులా ఉన్నాననకు. మిమ్మల్ని చూడగానే త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ఫలితం కనిపించే ఒక మంచి ఉపాసనాబలం పొందుతున్న వారినా ఉన్నారని అను – అది నా శరీరమునకు సరిపోతుంది. ఇంకా నేను పెళ్ళికొడుకునేమిటమ్మా’ అని అనాలి. కానీ వాడు అలా అనడు. వాడు ఏమంటాడంటే – ’ నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు’ అంటాడు. అంటే వాడికి కడుపులో ఎంతబాధ ఉందో చూడండి! వానిక్ ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడడం లేదు. ’నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే, సంబంధములు చూసి, తాతగారూ, మీరు చేసుకోండి అని పిల్లను తెచ్చి పెళ్ళి చేయవచ్చు కదా’ అని వీడికి కడుపులో బాధ! వృద్ధాప్యంలో ఒక విధమయిన ధూర్తతనం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికింకా వ్యామోహం ఉండిపోతుంది అపుడు శరీరములోంచి నిరంతరము చీము స్రవించే వ్రణములు బయలుదేరతాయి. అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి. అంతదూరంలో ఉండే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. ఎవరూ వాని దగ్గరకు వెళ్ళరు. ఎంతో బాధపడతాడు. అంత బాధపడ్డ తరువాత అప్పుడు కామం పోతుంది. ’నీవు వ్యాసుడవయినందుకు అంతబాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం ఉత్తరజన్మకు వెళ్ళకుండా ఆపేశక్తి వీళ్ళకి ఇవ్వాలి. వ్యాసా, నీవు ఏమి ఇవ్వాలో తెలుసా! భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు.’ వాడు తెలిసో తెలియకో వచ్చి భాగవతమును వినడం కాని, చదవడం కాని చేస్తే అంతమాత్రం చేత వీడు భాగవతం విన్నాడు అని వాని ఖాతాలో వ్రాస్తాడు. వాడు హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితమును అడ్డుపెట్టి వానిని మంచి జన్మవైపుకి తిప్పుతాడు. ’భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒకమంచిమాట చెప్పు. అంతేకాని నీవు మరల అర్థకామములను గురించే మాట్లాడితే కావ్యమునకు ఏమీ ప్రయోజనం ఉండదు. హరినామస్మృతిలేని కావ్యము వృథా. దాని వలన ఏవిధమయిన ఉపయోగం ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామము చెప్పని కావ్యము, నీవు ఎంతగొప్ప అర్థములతో చెప్పినా అది తద్దినం పెట్టేచోటికి కాకులు వచ్చే రేవులాంటిది. అందుకని నీవు ఇప్పుడు భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విశెశములు, భగవద్భక్తుల కథలతో కూడిన విషయములను చెప్పు. భాగవతంలో అటువంటివి చెప్పు’ అని చెప్పాడు నారదుడు.                      
[5:20 PM, 12/26/2016] Daddy: భాగవతం - 10 వ భాగము

భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్నావతారము చాలా గొప్ప అవతారము. ’కృష్ణస్తు భగవాన్ స్వయం’ – అందుకే భాగవతమునకు ’జయ’ అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే – ’నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!’ అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.

’కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. అందుకే మనం ’కృష్ణం వందే జగద్గురుమ్’ అంటాము. జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షన కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై మీకష్టాన్ని పోగొడతాడు. తండ్రియై మిమ్మల్ని కాపాడతాడు. తల్లియై మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమయిన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి’ అన్నాడు సూతుడు శౌనకాది మహర్షులతో.

అశ్వత్థామ పరాభవము

పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ’నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు.

భాగవతం - 9 వ భాగం

భాగవతం - 9 వ భాగం

వేదవ్యాసుడిని నారదభగవానుడు ప్రార్థనచేస్తే ఆయన సలహామేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతమును రచించడం ప్రారంభంచేశారు. దానిని మన అదృష్టవశాత్తు మన తెలుగువారయిన పోతనామాత్యులవారు ఆంధ్రీకరించారు.

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ!!

అని పోతనగారు ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. ఒక అద్భుతమయిన ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది.
అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరు కూడ దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. సత్రయాగము అనే యాగము ఒక విచిత్రమయిన యాగము. దీర్ఘసత్రయాగం అంటే చాలాకాలం పాటు కొనసాగే యాగం. దానిని నైమిశారణ్యంలో చేశారు. ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగము అని పిలుస్తారు. అటువంటి దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. దానికి అనువయిన ప్రదేశంగా నైమిశారణ్యమును నిర్ణయించుకున్నారు. అది విష్ణుభగవానుని శక్తి ప్రకటితమయిన క్షేత్రము. ఇరుసును ఆధారము చేసుకుని చక్రములు తిరుగుతూ ఉంటాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి (ఇరుసు) ఏ ప్రాంతమునందు శిధిలం అయిపోయిందో అటువంటి పరమ పవిత్రమయిన ప్రాంతమునకు నైమిశారణ్యము అని పేరు. ఆ నైమిశారణ్యములో చేసిన క్రతువు చాలా విశేషమయిన ఫలితమును ఇస్తుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహమునకు నోచుకున్న క్షేత్రము. అటువంటిచోట ఈ దీర్ఘసత్రయాగమును చేసినట్లయితే బాగుంటుందని శౌనకాది మహర్షులందరు కూడ ఈ యాగమును ప్రారంభం చేశారు. అక్కడికి సూతమహర్షి విచ్చేశారు.

ఒక కోయిల వచ్చిందనుకోండి – దానిని మనం పాట పాడాలని కోరుకుంటాము. ఒక నెమలిని చూసినట్లయితే అది ఒక్కసారి పురివిప్పితే బాగుండును అనుకుంటాము. ఎందుచేత అంటే పురివిప్పి ఆడుతున్న నెమలి అందంగా వుంటుంది. సూతుడు కనపడినప్పుడు ’అయ్యా, భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పండి’ అని అడగకపోతే అలా అడగని వాడు చాలా అదృష్టవంతుడు. సూతుడు పురాణవాజ్ఞ్మయము అంతా తెలిసి ఉన్నవాడు. అటువంటివాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండే విశేషములను, హరికథామృతమును తెలుసుకొని గ్రోలాలి.

అందుకని శౌనకాది మహర్షులు సూతుడిని అడిగారు – ’అయ్యా, నీవు రోమహర్షణుని కుమారుడవు. నీకు పురాణములలో ప్రతిపాదింపబడిన విషయములు అన్నీకూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడి భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామములు, హరిభక్తి, హరికథామృతము, విశేషంగా ప్రవచనం చేయబడ్డాయి. ఏ భగవంతుని గుణములు వినడం చేత వేరొకసారి పుట్టవలసిన అవసరము కలుగదో, ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను వినితీరాలో, అటువంటి విషయములను కలిగి ఉన్న గ్రంథము భాగవతము. అటువంటి పురాణమును మాకు వివరించవలసినది. అసలు జన్మనెత్తవలసిన అవసరంలేని పరమాత్మ కృష్ణభగవానుడిగా ఎందుకు జన్మించాడు? అందునా వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారములలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రివేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు? కంసుడిని ఎందుకు వధించాడు? తాను వచ్చిన అవతార ప్రయోజనమును నెరవేర్చడంలో అంత విడంబము చేస్తూ, అంతకాలంపాటు భూమిమీద తాను ఉండి శత్రుసంహారం చేసి జరాసంధుడివంటి రాక్షసులను సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమయిన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు.’

’కన్నులు తెరువని కడు చిన్నిపాపడై దానవి చనుబాలు ద్రావి చంపె’

’కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతకాని వయస్సులో ఉన్న కృష్ణపరమాత్మ పూతన పాలుతాగి పూతనాసంహారం చేశారు. అటువంటివాడు జరాసంధుడికి పదిహేడుమార్లు అవకాశం ఇచ్చాడు. పదిహేడుమార్లు జరాసంధుడు దండెత్తి వచ్చాడు. పదిహేడుమార్లూ జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. పద్దెనిమిదివ మారు జరాసంధుడు దండెత్తి వచ్చాడు కృష్ణుడు పారిపోయాడు. యుద్ధంలో జరాసంధుడిని నిర్జించలేదు. కృష్ణ లీలలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంతమంది రాక్షసులను మట్టుపెట్టినవాడు జరాసంధుడిని మట్టుపెట్టలేడా? జరాసంధుడు కనపడినప్పుడు ఎందుకు పారిపోయాడు? ఈ లీలలు మాకు వినిపించవలసింది ఎన్ని కోట్ల జన్మములనుండియో భగవంతుని కథను విస్మృతిపొందడం చేత మేము మళ్ళీ మళ్ళీ అనేక యోనులయందు తిరుగుతున్నాము. ఇన్నాళ్ళకు మాకు భాగవతకథా శ్రవణం చేసే అదృష్టం పట్టింది. అందుచేత మహానుభావా, శుకమహర్షీ! ఆ భగవత్కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతము అని పేరు.

భాగవతం - 11 వ భాగము

భాగవతం - 11 వ భాగము

తెల్లవారింది మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒకమాట అన్నాడు – ’నేలమీదపడి పొర్లిగుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపదీ! ఏ నీచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీకుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీపగ తీర్చుకో’ అన్నాడు.

పిమ్మట అర్జునుడు కృష్ణభగవానుని సారధిగా పెట్టుకొని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది. తనను చంపేస్తాడన్న భయంతో పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతుంటే పోతనగారు ఒక అందమయిన ఉపమానం వేశారు. తన కుమార్తె వెంటపడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్నట్టి పరమశివుని చేతినుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరుగెడుతున్నాడు అన్నారు. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు. ద్రోణసుతుడు. పరుగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇక పరుగెత్తలేకపోయాడు. వెనకనుంచి అర్జునుని రథం వచ్చేస్తోంది. కృష్ణుడు సారధ్యం చేస్తున్నాడు. ’ఈ రథమే, ఈ సారధ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును మట్టుపెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు’ అని ఉపసంహారము తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా ఫరవాలేదు – తానుమాత్రం బ్రతికి ఉంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునకు ఉండకూడని బుద్ధి. అది పొగలు గ్రక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వస్తోంది.

అర్జునుడు వెనక్కితిరిగి కృష్ణుడివంక చూశాడు. ’మహానుభావా, ఎవరు సారధ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమయిన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడయినవాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటిని సాధించగలిగాను. లోకములన్నిటిని నిండిపోయి సంక్షుభితం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది’ అని అడిగాడు.

అడిగితే అప్పుడు కృష్ణభగవానుడు చెప్పాడు – ’ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇపుడు ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి. విడిచిపెట్టు’ అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణభగవానుడు ఉన్న రథమునకు ప్రదక్షిణం చేసివచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. ఇపుడు రెండు బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురువచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకొని దేవతలు, ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడ ఉత్కంఠను పొందాయి. అందరు హడలిపోతున్నారు. లోకములనన్నిటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణపరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కాని ఆయన అన్నాడు – ’ధూర్తుడయిన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారము తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసెయ్యి’ అన్నాడు. రెండు బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసేశాడు.                      
[5:20 PM, 12/26/2016] Daddy: భాగవతం - 12 వ భాగం

ఉపసంహారం చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి వానిని ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథంమీద పెట్టాడు. పెట్టి విపరీతమయిన వేగంతో యుద్ధభూమి లోనికి వచ్చి రథమును అక్కడ నిలబెట్టాడు. అర్జునునికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి వున్నాడు. అశ్వత్థామ వణికిపోతున్నాడు. కృష్ణుడు అన్నాడు ’అర్జునా, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతనిని బ్రాహ్మణుడని చూడకు. గురుపుత్రుడని చూడకు. సంహరించు. కుత్తుక కత్తిరించు’ అన్నాడు. అర్జునుడు మారుమాట్లాడలేదు. చంపలేదు.

ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు. దానిని మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు.

త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకువెళ్ళి అక్కడ పారవేశాడు. ’ద్రౌపదీ, వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకువచ్చి అశ్వత్థామను అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను’ అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒకతల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గానీ తన పసుపుకుంకుమలకు గానీ, తన బిడ్డలకు గానీ, ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన అయిదుగురు బిడ్డలను చంపేశాడు. ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసింది. ఆవిడ అంది ’మహానుభావా, అశ్వత్థామా, నా భర్తలైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ”ఆత్మావైపుత్రనామాసి’ తండ్రి తన కొడుకు రూపంలో భూమిమీద తిరుగుతూ ఉంటాడు. నీవు మా గురు పుత్రుడవు. అందుచేత నాకు నీయందు నా భర్తల గురువు దర్శనమౌతున్నాడు. అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను నేను ఒక్కమాట అనను.’ ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో మీరూ ఆలోచించండి. ఇదీ ద్రౌపది అంటే! ఆవిడ కోప్పడలేదు. ఎంత మాటన్నదో చూడండి!

’కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్ర శస్త్రములు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకుపూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు. అపారమైన నిద్రలో ఉన్న నాకుమారులు యుద్ధము చేయడమునందు ఆసక్తి లేనివారై గాఢనిద్రలో ఉన్నారు. ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకువు అయ్యావు. నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నీవు పుత్రరూపంలో ఉన్న గురువు అని తలంచి నా అయిదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను’ అంది. ’రాత్రి చంపేటప్పుడు నీకీవిషయములు జ్ఞాపకం రాలేదా? అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి వుండవలసిన ధర్మములు తెలియదా? అని అడిగినట్లు అవుతుందని “నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయయ్యా?” అని అర్జునుని వంక చూసి అంది.

అర్జునా, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా! అయిదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటివరకూ ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి రెండు చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాండీవం పట్టుకొని రథము ఎక్కి పగబట్టి, అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి (ద్రోణుడి భార్య, అశ్వత్థామ తల్లి)కి వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒక ఎత్తు. ఇంక చచ్చిపోతున్నాడు, ఇంక రక్షించుకోలేను అని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామా, మీ అమ్మ అక్కద ఎంతగా ఏడుస్తోందోనయ్యా! తలచుకుంటే నా మనస్సు వికలం అయిపోతోంది.” అని అర్జునుని పిలిచి, “ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతనిని సంహరించకూడదు. ఆయనను విడిచిపెట్టేయండీ. ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చేయండి” అంది.

ఈమాట భీముడు విన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. “ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకొని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను” అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే.

అప్పుడు కృష్ణుడు అన్నాడు. “అర్జునా, నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పనిలేదు. వీడు ఆతతాయి. కాబట్టి చంపి అవతల పడేయవచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తోంది. ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏమి చేయాలో దానిని నీవు చేయవలసింది” అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపాడో అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు. అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉంది. పుట్టుకచేత అశ్వత్థామకి శిరస్సుమీద ఒక మణి ఉంది. ఆ మణికాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు. అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతమంది నెత్తురు త్రాగిందో. అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురక వృత్తిని వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను పుచ్చేసుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క త్రోపు తోసి అవతల పారేశాడు. ఆ త్రోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు. హీనుడై, కాంతిపోయిన వాడై, తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సూతుడు అన్నాడు – శౌనకాది మహర్షులారా, వృత్తాంతమును విన్నారు కదా! ఇదీ కృష్ణలీల అంటే! ఇదీ కృష్ణుడు అంటే! ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అందుకని భాగవతం.

ఈ ఉపపాండవుల పార్థివ శరీరమును తీసుకువెళ్ళారు. దహన క్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలచుకొని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే!
కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖములను ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తున్న కాలమునకు నీవు పరతంత్రుడవు. నీవు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు.