Search This Blog

Thursday, January 12, 2017

భాగవతం - 10 వ భాగము

భాగవతం - 10 వ భాగము

భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్నావతారము చాలా గొప్ప అవతారము. ’కృష్ణస్తు భగవాన్ స్వయం’ – అందుకే భాగవతమునకు ’జయ’ అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే – ’నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!’ అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.

’కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. అందుకే మనం ’కృష్ణం వందే జగద్గురుమ్’ అంటాము. జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షన కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై మీకష్టాన్ని పోగొడతాడు. తండ్రియై మిమ్మల్ని కాపాడతాడు. తల్లియై మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమయిన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి’ అన్నాడు సూతుడు శౌనకాది మహర్షులతో.

అశ్వత్థామ పరాభవము

పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ’నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు.

No comments:

Post a Comment