Search This Blog

Saturday, January 14, 2017

శ్రీమద్భాగవతం - 101 వ భాగం

శ్రీమద్భాగవతం - 101 వ భాగం

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందఱో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో.
యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమము అయి వున్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.
కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు. నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు. ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది. తదనంతరం కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తె తలలోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఎ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడో ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనం యిచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు యిక నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. అపుడు కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.
దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవదమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు. అపుడు కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.
యాదవుల అంతమొందుట
ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన యినప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపొయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటె వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడ గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉంది, పాశుపతాస్త్రం ఉంది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు. అపుడు ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం యిక ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.
ఫలశ్రుతి :
కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం యిస్తున్నాను’ అన్నారు. అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాటపట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండలకర్ణముల్ మదేభగతియు నీలవేణియుఁ గృపారస దృష్టియుఁ గల్గు వెన్నుఁ డిమ్ముగఁ బొడసూపుఁ గాత గను మూసిన యప్పుడు విచ్చు నప్పుడున్.
‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండు నరుడు లోకులు వొగడన్!!
‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో యిది వినిన వాళ్ళకి ఇది వ్రాసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో వున్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.
అందరూ భాగవతం చదివి ఆనందించండి. ఇంత మంచి భాగవతం చక్కగా చెప్పిన గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి మా పాదాభివందనాలు.
* భాగవతం పూర్తయ్యింది **
" సార్వజనీనమైన సెలవు "
""ఓమ్ శాంతి శాంతి శాంతిః ""

Thursday, January 12, 2017

శ్రీమద్భాగవతం - 68 వ భాగం

శ్రీమద్భాగవతం - 68 వ భాగం

శకటాసుర సంహారం :
కృష్ణ లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతము వేదాన్తముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. మీరు అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో, పచ్చడో, పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది.
ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున యింట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు.
కానీ యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నది అని అర్థము. కీతి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు, పాడి. వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు,నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. కాబట్టి అతడికోసం చేస్తున్నారు. కానీ ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.
ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి. అక్కడి నుండి క్రిందపడిపోయి తుత్తునియలయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అపుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. ‘అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారికరూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో వున్న అంతరార్థమును మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటిని ‘నావినావి’ అంటారు. ‘నావి’ అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటీ తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింప బడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. కానీ మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కానీ మీరు లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీర శకతంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపడు. తలంపక అన్నీ కూడా ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. కానీ ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల చేయగలిగాను’ అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆపనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే యిది ‘శకటతి యితి శకటః’ అవుతుంది. శం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును నీవు ఎందుకు ఎక్కావు తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తాడు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్త్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది.
అనగా యిప్పుడు నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారధిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థిత ప్రజ్ఞుడయిన సారధి శకటమును వేయికళ్లతో చూసి నడిపిస్తాడు. అపుడు శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు. సారధియే బుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా దానిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసికాని, తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధార్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు – జీవుడు ప్రయాణిస్తున్న యీ బండి రాక్షసుడు. ఎప్పుడు? ‘యిదే నేను – అన్నీ నేను చేస్తున్నాను’ అనే భావన ఉన్నప్పుడు. కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి దానిని చీల్చదానికి అర్థరాత్రి పుట్టాడు. ఇపుడు ఆయనేమి చేశాడు? ‘మనః మనః’ అనకురా, ‘నమః నమః’ అను అని చెపుతాడు. అపుడు జీవుడు కర్మచేత, భక్తిచేత, జ్ఞానము వైపు నడుస్తాడు. ఈవిధంగా శకటా సుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి.
తృణావర్తోపాఖ్యానం :
క్రుశ్ని చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు. కథా శ్రవణం చేతకూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు శుకమహర్షి చెప్పిన బాహ్యకథనే విన్నాడు. విని మోక్షమును పొందాడు కదా! జీవితంలో అసలు భాగవతం వినడం కాని, చదవడం కాని చాలా గొప్ప విషయములు. భాగవతమును విన్నంత మాత్రం చేత వాని జీవితం కొన్ని కోట్ల జన్మల తరువాత ఒక మలుపు తిరిగింది అని లెక్క.
ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి వుండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో వున్న కృష్ణుడు చాలా బరువయిపోయినట్లుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా వున్నాడేమిటి? అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నులలో పడిపోయింది. ఇంతకూ పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమయిన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. అందరూ కన్నులు మూసి వేసుకుని ఏమయింది అని చూసేలోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు. కేవలం కృష్ణుని సంహరించడమే అతని లక్ష్యం. ‘ఆవర్తము’ అంటే త్రిప్పడం. గిరగిర త్రిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకు వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడెయ్యాలని అతని ఉద్దేశం. సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది.

భాగవతం - 10 వ భాగము

భాగవతం - 10 వ భాగము

భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్నావతారము చాలా గొప్ప అవతారము. ’కృష్ణస్తు భగవాన్ స్వయం’ – అందుకే భాగవతమునకు ’జయ’ అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే – ’నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!’ అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.

’కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. అందుకే మనం ’కృష్ణం వందే జగద్గురుమ్’ అంటాము. జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షన కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై మీకష్టాన్ని పోగొడతాడు. తండ్రియై మిమ్మల్ని కాపాడతాడు. తల్లియై మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమయిన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి’ అన్నాడు సూతుడు శౌనకాది మహర్షులతో.

అశ్వత్థామ పరాభవము

పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ’నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు.

శ్రీమద్భాగవతం - 100 వ భాగం

శ్రీమద్భాగవతం - 100 వ భాగం

ఏకాదశ స్కంధము – బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట:
కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు ‘ఈవేళ యింతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం” అని అడిగాడు. అపుడు వాళ్ళు “ఈశ్వరా! రాక్షస సంహారం చెయ్యడం కోసమని మీరు వైకుంఠంనుండి బయలుదేరి యిక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాల బాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి నూట యిరువది అయిదు సంవత్సరములు పూర్తి అయిపొయింది. కాబట్టి ఇంక నీవు ఈ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూల స్థానమునందు ప్రవేశించవలసినది’ అని అడిగారు. అప్పుడు భగవానుడు ‘ఓహో! అయితే యింక నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమయినది. కాబట్టి మేమి అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను’ అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేశారు. ‘తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు. కాబట్టి ఈ యాదవుల కులం అంతా కూడా తనతోపాటే నశించిపోవాలి. మొత్తం కులనాషణం జరగాలి’ అని తలంచారు. తాను నాయకత్వమునందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవరూ చెణకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యమును ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో చూపిస్తారు. అటువంటి ప్రమాదంతో కూడిన పనిని యాదవులచేత చేయించారు.
విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనమునకు వచ్చుట:
ఒకరోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భ్రుగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనమునకు వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒకమాట అన్నారు. “నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధక మయిన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటివైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్థకం అయిపోతుంది. ఆ తరువాత మరల ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకోని, కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకొని గడిపివేస్తున్నారు. కానీ ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్లి దాచుకున్నా యిది ఉండదు. వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాల బాలురతో కలిసి నీవి తిరిగి, కౌగలించుకొని, ఆడి పాడి యింతమందిని తరింపజేశావు. కృష్ణా, నీ లీలలు రాబోవుతరంలో విన్న వారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవింద నామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. తండ్రీ, నీవు అంత గొప్ప అవతారమును స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరల దొరకమంటే దొరకదు. అందుకని ఒక్కసారి నిన్ను కనులార దర్శిద్దామని వచ్చాము’. వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతున్నదని తెలుసు. ఈశ్వరా, నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు.
ఈ సంసారమును దాటడానికి నీ పాదములు ఆధారము. వచ్చే కష్టములు తొలగిపోవడానికి నీ పాదములు ఆధారము. వేదములను నీ పాదములు ఆభరణములు. అటువంటి నీ చరణారవిందములను ఈ మాంసనేత్రముతో చూడాలని వచ్చాము. మరల యిటువంటి పాదములు మాకు దొరుకుతాయా” ఇవి ‘అంగనామంగనామంతరే మాధవం’ అని కొన్నివేలమంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. నీ పాదములను గోపాల బాలురు ‘మా కృష్ణుడు’ అని అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడు అని తెలియక ఆడుకున్న పాదములు. ఈ పాదములు వాళ్ళతో ఆడుకున్నపుడు వాళ్ళని తన్నిన పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేలగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాలబాలుర చేత ఒత్తబడిన పాదములు. ‘బ్రహ్మ కడిగిన పాదము’ అని బ్రహ్మగారి చేత కడిగించు కొనిన పాదములు. ఇంతమందిని తరింప జేసినా ఆ పాదములను ఒక్కసారి చూసి తరించి పోదామని వచ్చాము కృష్ణా’ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు.
కృష్ణా! నీనామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని ముప్ఫయిమూడుకోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. కలియుగామునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికయిన నామము. గోవింద నామము నీ అంతట నీవు కష్టపడి సంపాదించుకున్న నామము. ఏడేండ్ల బాలుడవై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నీవు సంపాదించుకున్న నామము గోవింద నామము. స్వామీ నిన్ను మరల ఎప్పుడు చూస్తాము! ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము’ అని స్తోత్రం చేశారు. అపుడు కృష్ణ పరమాత్మ నవ్వి ‘నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా! చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. ఇప్పడు నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళండి. నదీ స్నానం చేయండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి’ అని చెప్పాడు. ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకుని పొంగిపోతున్నారు.
ఋషుల శాపము:
వారికి కొద్ది దూరంలో వున్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరం నుండి ఆ మహర్షులను చూశారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్ళలో ఒక చిత్రమయిన బుద్ధి పుట్టింది. సాంబుడికి చీరకట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లు చేసి వీళ్ళు ఏపాటి పరిజ్ఞానంతో చెపుతారో చూద్దామని అతడిని ఆ మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి ‘మీరు మహాత్ములు కదా! మీకు తెలియని విషయములు ఉండవు కదా. మీరు త్రికాలవేదులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడు ఉన్నాడా, ఆడపిల్ల ఉందా కవలలు ఉన్నారా ఏ విషయం మాకు చెప్పండి’ అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీవంక చూశారు. వాళ్లకి మహా ఆగ్రహం వచ్చింది. ‘మీకు బ భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడు ఉన్న గడ్డమీద వున్న మీరు యిటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపడడం లేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసివున్న మీకు యింతటి దుస్సాహసమా? మాతో పరిహాసమా? అని వాళ్ళు
“కొడుకూ కాదు, కూతురూ కాదు. క్షణం ఆలస్యం లేకుండా ఆమె కడుపునుంచి ముసలం ఒకటి పుడుతుంది. ఆరోకలి మీ అందరి తీట తీర్చేస్తుంది. దానితో మీ యదుకులం నాశనం అవుతుంది. పరిహాసం చేస్తున్న వారికి భయం వేసింది. ఇలా అన్నారేమిటని సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద యినుప రోకలి కిందపడింది. వాళ్లకి భయంవేసి ఆ రోకలి తీసుకుని పరుగుపరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి “మేము తెలియక మహర్షులతో పరిహాసం ఆడాము. వారు శపించారు. ఈ రోకలి పుట్టింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు? అని అడిగారు. అపుడు కృష్ణ పరమాత్మ – ఈమధ్య దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. యివి యదుకుల నాశానమును సూచిస్తున్నాయి. మీ అందరు ఆ ఇనప ముసలము చేత మరణిస్తారు. కాబట్టి దీనిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరం మీద ఈ ఇనుప ముసలమును అరగదీసి దీనిని సముద్రంలో కలిపివెయ్యండి’ అని చెప్పాడు. అపుడు వారు ఆ ముసలమును పట్టుకుని ఆ శిఖరం మీదికి వెళ్ళి ఆ ముసలమును అరగదీయడం మొదలు పెట్టారు. అది కరిగి కరిగి నల్లని తెట్టు కారుతోంది. ఆ తెట్టు తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదియ్యగా అరగదియ్యగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఆ ములుకు వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించి ఆ ములుకును సముద్రంలోకి విసిరేశారు.
ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకుందుకు సముద్రం దగ్గరకు వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడు యింటికి వెళ్ళి ఈ చేపను కోశాడు. దాని కడుపులోంచి ఆ ఇనుప ముళ్ళు పడింది. ఆ ఇనపముల్లును తన బాణమునకు పెట్టుకుని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు.
కృష్ణుడు – ఉద్ధవుడు:
ఈలోగా ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ‘కృష్ణా! మేము నీతోకలిసి ఆదుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత యింక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.
‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి యిష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు.

శ్రీమద్భాగవతం -- 99

శ్రీమద్భాగవతం -- 99

శ్రీకృష్ణుడు_మృతులయిన_విప్రసుతులను_తెచ్చుటశ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోను ఆయన చేసిన లీలలచేత లోకమునంతటిని తరింపచేయడం కోసమని మనకందరికీ కూడా పాఠం నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుని చేరుకోవడానికి మార్గములను సుగమం చేయడం కోసమని మనందరం కూడా ప్రాకృతికమయిన శరీరంతో వచ్చి కర్మ ఫలితం అనుభవించడం కోసమని పొందే కష్ట నష్టముల వంటివి కాకుండా హేలగా కొన్ని లీలలు చేసి వాటికి అంతమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకు ఒక ఆలంబనమును ఇవ్వకపోతే అది సరియైన ఆలంబనను పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మనలను తిప్పుతుంది కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము మనకు అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మను మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తివైపు నడిపించే విధానమును భాగవతమునందు ఆవిష్కరించారు. పూర్వం ద్వారకానగారమును కృష్ణ భగవానుడు పరిపాలిస్తున్న రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్యయందు ఒక కుమారుడిని కన్నాడు. కాని ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. అపుడు బ్రాహ్మణుడు ఆ పిల్లవానిని తీసుకువచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి ‘నేను ఏ పాపమూ ఎరుగని వాడను ధర్మ బద్ధమయిన నడవడి ఉన్న వాడను. అయినా సరే నా కుమారుడు మరణించాడు, అంటే దేశానికి ఆధిపత్యం వహించిన రాజు దోషం వలన ఇటువంటి పని జరిగి ఉండాలి. కాబట్టి రాజుకు ధర్మబద్ధమయిన నడవడి లేదు’ అని ఉగ్రసేనుని నింద చేసి ఆ శవమును అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి తరువాత ఆ పిల్లవాని శవమును తీసుకుని వెళ్ళిపోయాడు. మరల కొంతకాలము పోయిన తరువాత ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకు వచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు. ఇలా ఎనమండుగురు కుమారులు కలిగారు. అందరూ పుట్టగానే మరణించారు. ఎనిమిదవ సారి బ్రాహ్మణుడు రాజును నిందజేస్తుండగా అర్జునుడు ద్వారకా నగరంలో ఉన్నాడు. బ్రాహ్మణుడు తనకి పుట్టిన బిద్దలందరూ కేవలం రాజు అధర్మం వల్లనే మడిసిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒకమాట అన్నాడు.“నీవు బ్రాహ్మణుడవు. నీ ఏడుపులను బట్టి ఇప్పటికి నీకు ఎనమండుగురు కొడుకులు మరణించారని నాకు అర్థం అవుతోంది. అలా మరణించిన కొడుకులను పెట్టుకుని నీవు రాజద్వారం దగ్గర ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్న వాడు ఊళ్ళో లేదు. ఈ ఏడుపు నుంచి ఉద్ధరించి నీకు పుత్రశోకము కలుగకుండా చేయగలిగిన విలుకాడు ఈ ఊళ్ళో లేడా?” అని అడిగాడు. అర్జునుడు ఈ ప్రశ్నను కృష్ణ భగవానుడు ఉన్న ఊళ్ళో అడుగుతున్నాడు. ఒక్కొక్క సారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తాను గొప్ప విలుకాడననే అతిశయం చేత ఈ మాట వచ్చింది. అపుడు ఆ బ్రాహ్మణుడు ‘మాకిక్కడ కృష్ణుడు ఉన్నాడు.అనిరుద్ధుడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు. బలదేవుడు ఉన్నాడు, ఉగ్రసేనుడు ఉన్నాడు. కానీ యిటువంటి వాళ్ళే రక్షించలేకపోయారు. నీవెవరివయ్యా యిన్ని మాటలు ఆడావు’ అన్నాడు. ఆ మాటలకు అర్జునునికి కోపం వచ్చింది. అపుడు అర్జునుడు నేనెవరినో తెలుసా! ఏ మహానుభావుడు తన గాండీవము పట్టుకుని రెండుచేతులతో బాణములను తీసి సంధించి విడిచి పెట్టి శత్రువుల మూకలను చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుడను. నేను ఉండగా నీకు భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు. నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడుతాను. నీకు అభయం ఇస్తున్నాను. అలా నీ కొడుకును నేను కాపాడలేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ’ అని ద్వారకలో ఉండిపోయాడు. బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి ప్రసవ వేదన ప్రారంభం అవుతోంది అగానా అర్జునునకు కబురు చేశారు. ఆయన శుచియై ఒక పవిత్రమయిన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుని ఒకసారి తలచుకుని నమస్కారం చేసి ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అక్షయ బాణ తూణీరములను రెండు భుజములకు కట్టుకుని శరవేగంతో బాణ పరంపరా ప్రయోగం చేశాడు. మంత్రపూరితములయిన బాణములతో ప్రసూతి గృహం చుట్టూ పంజరం అల్లినాడు. ఇపుడు అందులోకి సూక్ష్మమయిన అణువు కూడా ప్రవేశించలేదు. అందులోంచి ఒక అణువు కూడా బయటికి వెళ్ళలేదు. ఇపుడు మృత్యుదేవత వచ్చి పిల్లవాడి ప్రాణములు తీసుకువెళ్ళడానికి వీలులేదు. అటువంటి దుర్భేధ్యమయిన రక్షణ కవచమును నిర్మాణం చేశాడు.లోపల ఒక పిల్లవాని కేర్ మన్న ఏడుపు వినపడింది. ప్రసవం అయి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు. మరుక్షణంలో బిడ్డడు చనిపోయాడని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి ‘ఏడి పిల్లవాడు’ అని అర్జునుడు లోపలికి వెళ్ళాడు. తీరా చూసేసరికి చనిపోయిన పిల్లవాడు మాయం అయిపోయాడు. అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమయిన బాణ కవచము ఉన్న చోటునుండి ఈసారి శరీరం కూడా అదృశ్యం అయిపొయింది. ప్రాణములను తీసుకు వెళ్ళడం అనే విధి యమధర్మరాజు గారు చేస్తారు. కాబట్టి తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకమునకు వెళ్ళి ‘బ్రాహ్మణ కుమారుని తీసుకు వచ్చి ఎక్కడ పెట్టావు’ అని యమధర్మరాజు గారిని అడిగాడు. అపుడు ఆయన నేను తీసుకురాలేదు అని చెప్పారు. ఆయన ధర్మరాజు అబద్ధం ఆడడు. ఆయన మాటలు విని అర్జునుడు ఆశ్చర్య పోయాడు. అక్కడి నుండి దిక్పాలకుల లోకముల కన్నింటికి వెళ్ళాడు. అన్ని లోకములలో వెతికాడు. అందరూ కూడా తాము పిల్లవాడిని తీసుకురాలేదు అని చెప్పారు. పిల్లవాడు కనపడలేదు. తల వాల్చుకుని భూలోకమునకు ద్వారకా నగరమునకు తిరిగి వచ్చాడు. బ్రాహ్మణుడు కోసం చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్నాడు“వీడు పార్థుడట! వీనికి ఒక గాండీవమట. అక్షయ బాణ తూణీరములట. మంత్రపూరితమయిన బాణములట. నా కొడుకును రక్షిస్తాడట. ఇన్ని చెప్పాడు. కానీ పిల్లవాడు మాయం అయిపోయాడు. నేను పట్టుకు వస్తాను అని వెళ్ళి దిగాము మొహం వేసుకుని వస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు, బలదేవుడు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారని ముందరే చెప్పాను. వాళ్ళు చెయ్యని పని నీవెక్కడ చేస్తావన్నాను. గాండీవం చూపించాడు. తనపాటి విలుగాండ్రు ఊళ్ళో లేరా అన్నాడు. ఈ మాటలను అర్జునుడు విన్నాడు. బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. క్షత్రియునిగా యింతమంది మధ్యలో అధిక్షేపించబడ్డాడు. ఇంకా ఈ బ్రతుకు ఎందుకు అని భావించి చితి పేర్పించుకుని అగ్నిహోత్రుని ప్రార్థన చేసి చితిలో ప్రవేశించ బోయాడు. అపుడు కృష్ణ పరమాత్మ వచ్చి అర్జునుడి చేయి పట్టుకుని ‘బావా ఏమిటి ఈ అగ్నిప్రవేశం’ అన్నాడు. అపుడు అర్జునుడు ‘నేను నామాట నిలబెట్టుకోలేక పోయాను. అందుకని ప్రతిజ్ఞా పరిపాలన కోసం అగ్ని ప్రవేశం చేస్తున్నాను’ అని చెప్పాడు. అంత కృష్ణుడు ‘అంత పని చేయవద్దు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో నాతోరా నేను చూపిస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ రథమును ఇరువురు అధిరోహించి బయలుదేరారు. కృష్ణుని రథం సప్త సముద్రములను, మేరు పర్వతమును దాటి చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది. ‘ఏమిటి బావా నాకు భయం వేస్తోంది. మనం ఎక్కడికి వెళ్ళాలి’ అని అర్జునుడు అడిగాడు. నీవు భయపడకు అని కృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును స్మరించి విడిచిపెట్టాడు. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురును సృష్టించింది. ముందు సుదర్శన చక్రం వెళుతుంటే వెనుక కృష్ణ పరమాత్మ రథం వెడుతోంది. రథంలో కూర్చున్న అర్జునుడు సుదర్శనమును అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వేల్లిప్యిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అపారమయిన మనశ్శాంతి కలిగింది. పాలసముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు, నల్లటి వస్త్రమును కట్టుకుని ఉంటె ఆ ఆదిశేషుడి మీద తన కుడిచేతిని హేలగా శిరస్సు క్రింద పెట్టుకుని పడుకుని ఉండగా ఆదిలక్ష్మి పాదములు ఒత్తుతున్నది. అటువంటి స్వరూపమును కృష్ణార్జునులు దర్శనం చేశారు. అటువంటి మూర్తి దర్శనం అప్పటి వరకు అర్జునుడు చెయ్యలేదు. అది శ్రీమన్నారాయణుని దర్శనం. ఆయనే శ్రీమహావిష్ణువు. అందులోంచి అంశగా శ్ర్తీకృష్ణ భగవానుడు వచ్చాడు. ఆ శ్రీమహా విష్ణువును దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఆ మహానుభావుడిని ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు.అటువంటి మూర్తిని దర్శించిన తర్వాత ఆయన ‘నరనారాయణులారా! రండి’ అన్నారు. వీళ్ళిద్దరూ దగ్గరకు వెళ్లి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచి అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరకు వచ్చి నా అంశ అయిన మీరు నా దగ్గర నిలబడి ఉండగా చూడాలని కోరుకున్నారు. ఈ కోర్కె తీర్చాలి. అర్జునునకు కలిగిన కించిత్ గర్వమును అణచాలి. అందుకని బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చాను. ఇదిగో వాళ్ళు యిక్కడే ఉన్నారు అని చూపించాడు. వారి అదృష్టమేమిటో గానీ ఆ బ్రాహ్మణ పిల్లలందరూ శ్రీమన్నారాయణుని పాదముల దగ్గర కూర్చుని స్తోత్రము చేసుకుంటూ ఆయన పాదములకు నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. పిమ్మట శ్రీమహావిష్ణువు మునుల వైపు తిరిగి ‘మునులారా మీ కోర్కె తీరిందా’ అని అడిగాడు. ఆ బ్రాహ్మణకుమారులనందరినీ కృష్ణుడి చేతికి ఇచ్చి ఈ పిల్లలను తీసుకుని నీవు భూమండలమునకు వెళ్లి ఆ బ్రాహ్మణునకు అప్పజెప్పు’ అన్నాడు. ఎఏ మహానుభావుడి దర్శనమును యోగీంద్రులయిన వారు కూడా తమ మాంస నేత్రముతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయనను చూస్తూ ఆయనను సేవిస్తూ లక్ష్మీ దేవి పెట్టిన అన్నం తింటూ ఆయనను భజించిన మహా పురుషులయిన బ్రాహ్మణ పిల్లలను తన రథంమీద కూర్చో పెట్టుకుని తిరిగి భూమండలమునకు కృష్ణ భగవానుడు తీసుకువచ్చాడు. ఆ నాడు అర్జునునకు కలిగిన కించిత్ ఆవేశమూ తగ్గింది. ‘నా అంత గొప్పవాడు లేడు’ అనే భావనా తగ్గింది.మనం ఒక్కొక్కసారి మనలను నిరంతరం రక్షించే పరమేశ్వరుడిని కూడా మర్చిపోతాము. ఆయనకన్నా నేనే గొప్పవాడినన్న భావన వచ్చేస్తుంది. యథార్థమునాకు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడిని చిన్నబుచ్చేదిగా ఉంది. కానీ కృష్ణుడు అర్జునుని ఏమీ అడగలేదు. అడగకుండా అర్జునుడు అగ్నిప్రవేశం చేసేటంత స్థితికి వచ్చేవరకు ఊరుకున్నాడు. ఆ స్థితికి వచ్చేశాడు అంటే అహంకారం పోయిందన్నమాట. అతిశయం పోయిన తర్వాత యింక తనవాడిని తాను రక్షించుకోవాలి. అపుడు గబగబా పరుగెత్తుకు వచ్చి రక్షించుకుని అర్జునునకు మరల యింత సత్కారమును చేయించి బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చి బ్రాహ్మణునకు అప్పచెప్పాడు. ఆ భగవానుడిని నమ్ముకున్న వాళ్ళకు లోటేమి ఉంటుంది. మనం ఆ స్వామిని నమ్మి ‘నా స్వామి ఉన్నాడు’ అనే పూనికతో ఉంటె, ఎప్పుడయినా తెలియక మనవల్ల ఏదయినా పొరపాటు జరిగినా బిడ్డడి తప్పును తండ్రి దిద్దుకున్నట్లు ఆయనే దిద్దుకుని మనను రక్షించుకుని తన వస్తువుగా మనలను మిగుల్చుకుంటాడు అని చెప్పగలిగిన పరమ పవిత్రమయిన లీల.

శ్రీమద్భాగవతం – 98

శ్రీమద్భాగవతం – 98

సూతుడు ఈవిధంగా చెప్పారు. ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మేము చేసే యజ్ఞయాగాదులను పాడుచేస్తూ ఉంటాడు. మేము యజ్ఞం మొదలుపెట్టి అరణి మంథనం చేసి అగ్నిహోత్రం తీసుకువచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలుపెట్టగానే వాడు ఆకాశంలోకి వచ్చేస్తాడు. మలమూత్రములు, రక్తము యివన్నీ తెచ్చి అగ్నిహోత్రంలో వేస్తాడు. వేదిలో ఉన్న అగ్నిహోత్రం చల్లారిపోతుంది. అపుడు వాడు పెద్దగా పకపకనవ్వేసి వెళ్ళిపోతాడు. అందుకని నీవు పల్వలుని సంహరించు. అపుడు మేము యజ్ఞ యాగాదులను ఆటంకం లేకుండా చేసుకుంటాము’ అని చెప్పారు. ఋషులు పల్వలుని సంహరించమని బలరాముని కోరిన కోరిక చాలా అర్థవంతమయిన కోరిక. బలరాముడు వెంటనే వెళ్లి పల్వలుని చంపలేదు. అతడు ‘ఏమి చేస్తాడు’ అని అడిగాడు. ‘మేము యజ్ఞం చేస్తే పాడుచేస్తాడు’ అని ఋషులు చెప్పారు. అయితే మీరు యజ్ఞం చేయడం ప్రారంభించండి. వాడు వచ్చినట్లయితే సంహరిస్తాను అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞమును ప్రారంభించారు. పల్వలుడు వచ్చినట్లయితే సంహరిస్తాను’ అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞమును ప్రారంభించారు. పల్వలుడు వచ్చి యజ్ఞ గుండంలో మలమూత్రములను విసరడం ప్రారంభించాడు. బలరాముడు చూశాడు. వెంటనే ఎడమచేతితో నాగాలితీసి వాడి తలకాయకు వేసి కిందికి లాగాడు. కుడిచేత్తో రోకలి పుచ్చుకుని తలమీద ఒక దెబ్బ కొట్టాడు. నెత్తురు బుగబుగ కక్కుకుంటూ పల్వలుడు మరణించాడు. తరువాత బలరాముడు ‘నేను పల్వలుని చంపివేశాను. మీరు యజ్ఞ యాగాదులు చేసుకుంటారు. కానీ యింకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది. ఇంతకుపూర్వం నేను చేసిన పాపములు పోవడానికి ఈ పనులు చేశాను. ఇపుడు నేను కొంత పుణ్య బలమును సమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచిపనులు ఏమయినా చెప్పండి అని అడిగాడు. అపుడు ఋషులు ‘నీవు పన్నెండు నెలలు యింటి ముఖానికి వెళ్ళకుండా దేశం అంతా తిరిగి పుణ్య తీర్థములు అన్నిటిలో స్నానం చెయ్యి. అప్పుడు నీ మనసు ప్రశాంతత పొంది, పుణ్యమును పొంది సత్త్వ గుణమును పొందుతావు. మనస్సునందు పాపపు ఆలోచన అహంకారము పైకిరావు. వినయముతో నిలబడగలుగుతావు’ అన్నారు. బలరాముడు అప్పుడు బయలుదేరి పుణ్య తీర్థములలో స్నానము చేశాడు.మనం పుణ్య క్షేత్రములకు ఎందుకు వెళ్ళాలో ఎందుకు తీర్థములందు స్నానం చేస్తామో ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావుడు చిన్నదయినా సరే యింత పరమపవిత్రమయిన ఈ ఆఖ్యానమునందు పొందుపరచారు.వృకాసురుడు విష్ణుమాయచే మడియుట:పూర్వం వృకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆటను శకుని కుమారుడు (భారతంలో శకుని కాదు) ఒకరోజున వాడు వెళ్లిపోతుంటే నారదుడు అటుగా వచ్చాడు. అపుడు వాడు నారదుని చూసి నమస్కరించాడు. నారదుని కాళ్ళకి దణ్ణం పెట్టాడు. తరువాత నారదుడిని ‘అయ్యా నారదా, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని ముగ్గురు పరమాత్మ రూపములు ఉన్నారని చెపుతారు కదా – ఈ ముగ్గురిలో నేను తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమయి నేను కోరిన వరమును యిచ్చేసే ఆయన ఎవరు?’ అని అడిగాడు. అపుడు నారదుడు – ‘వృకాసురా, బ్రహ్మగారు సృష్టి చేస్తారు. ఆయన గురించి చాలా తపస్సు చెయ్యాలి. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అవాలి అంటే సత్త్వ గుణంలోకి వచ్చెయ్యాలి. ఆయన మోక్షం అడిగేవారి కోసం వస్తాడు. నీజాతి వాళ్ళందరికీ తొందరగా ప్రత్యక్షం అయ్యే ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. ఆయన భక్తులకు చాలా తెలికవా వశుడవుతాడు. అందుకని శివుని గురించి తపస్సు చెయ్యి అని చెప్పాడు. అపుడు వృకాసురుడు ‘తపస్సు ఎక్కడ చెయ్యను’ అని అడిగితె కేదారంలో చేయమని నారదుడు చెప్పాడు. అందుకని వృకుడు కేదారం వెళ్లి శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు.కొద్దికాలం తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం కాలేదు. వానికి అక్కసు వచ్చింది. తన శరీరమును తానే ముక్కలుగా నరుక్కుని అగ్నిలో వ్రేల్చేశాడు. చివరకు తన శిరస్సును ఖండించుకుని అగ్నిహోత్రంలో వేయడానికి సిద్ధపడ్డాడు. అపుడు శంకరుడు వెంటనే వచ్చి వృకుడు ఆ పని చేయకుండా అడ్డుపడి ‘నీకు ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. అపుడు వృకుడు ‘శంకరా నేను నా చేతిని ఎవరి తలమీద పెడితే వాడి తల పగిలిపోయేటట్లు నన్ను అనుగ్రహించు’ అని కోరాడు. వీని కోరిక విని శివుడు తెల్లబోయాడు. ‘సరే తథాస్తు; అన్నాడు.ఇపుడు వాడు తొందరగా ఎవరో ఒకడి తలమీద తన చేయిని పెట్టాలని అనుకున్నాడు. ‘శంకరా, నీ తలమీద ఒకసారి చేయి పెడతాను నిలబదవలసింది’ అన్నాడు. ఆయన వృకునకు తల ఇవ్వలేక వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలు పెట్టాడు. అసలు అలా వెళ్ళడం వెనకాతల ఒక రహస్యం ఉంది. సుబ్రహ్మణ్యుని ఉత్పత్తి జరగడానికి కావలసిన బీజం అక్కడ అప్పుడు పడింది.శివుడు అలా పరుగెత్తి వైకుంఠమునకు వెళ్ళాడు. శివుడు వెనకాలే వృకుడు ఆగుఆగు అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. శివునికి కేశవునికి భేదం ఉండదు. శంకరునిగా వృకుడి అజ్ఞానమును అణచి వేస్తె బాగుండదు. శంకరుడు నారాయణునిగా వృకుడి అజ్ఞానమును అణచాలి. శంకరుడు వైకుంఠం వెళ్లేసరికి అందులోనుండి శ్రీమన్నారాయణుడు ఒక వటువు రూపంలో ఒక బంగారు మొలత్రాడు, పచ్చటి గోచి మూడు పోగులు వున్న యజ్ఞపవీతం వేసుకుని చక్కగా ఒక కమండలం చేత్తో పట్టుకుని బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు.వటువు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు పరుగెత్తుకు వస్తున్నవృకాసురుని చూసి ‘’అయ్యో వృకాసురా, అలా పరుగెత్తుకు వస్తున్నావేమిటి? నీ ఒళ్ళంతా చెమట పట్టేసింది. శరీరమును సుఖ పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఎందుకు అలా పరుగెడుతున్నావు ఆగు’ అన్నాడు. అపుడు వృకాసురుడు రొప్పుతూ శంకరుడు వరం యిచ్చాడు. తలమీద చెయ్యి పెడదామంటే పారిపోతున్నాడు’ అన్నాడు. అపుడు నారాయణుడు వృకాసురా నీవు ఎంత పిచ్చివాడవు. దక్ష ప్రజాపతి యజ్ఞం పూర్తయిన నాటినుండి శంకరుని ప్రవర్తనలో మార్పు వచ్చింది. పిశాచములను భూత గణములను వెంట పెట్టుకు తిరగడం, అబద్ధాలాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట సత్యం కాదు. పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది. ఆయన పవిత్రుడు కదా! నువ్వు స్నానం చెయ్యకుండా ఆయనను ముట్టుకుందామంటే ఆయన తల ఇవ్వడు. ఆయన లొంగిపోయే మనిషే. కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే ఆయన లొంగిపోతాడు. నువ్వు అక్కడ కనిపిస్తున్న మడుగులో స్నానం చేసి ఆచమనం చేసి అపుడు శంకరుని తలమీద చెయ్యి పెట్టు’ అన్నాడు. అలాగేనని వృకుడు స్నానం చేసి ఆచమనం చేస్తూండగా పొరపాటున అతని చేయి అతని శిరస్సుకి తగిలింది. వెంటనే వాడు తలపగిలి కిందపడి చచ్చిపోయాడు.‘మనుష్యులు కోరికలు కావాలి అని కోరికలు అడుగుతారు. కోరిక తీరితే తన కోరిక తీరిందని ఈశ్వరునికి కృతజ్ఞత చెప్పరు. వెంటనే భగవంతుడిని మరచిపోతారు. నా అంతటి వాడిని నేను అనుకుంటారు. నేనే అవన్నీ చేశానని అహంకారమును పొందుతారు. తాను ఏ పని చేసినా, ఏ విజయమును పొందినా అది ఈశ్వర కృప వలననే జరిగినది అని భావించగలిగితే అతడు కృతార్థుడు అవుతాడు’ అని ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఈ కథను భాగవతంలో చెప్తారు. వెర్రి పెట్టుకోకుండా ఈశ్వర స్వరూపమును మీరు నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారు అని ఒక అద్భుతమయిన ఆఖ్యానమును ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు.

Monday, January 9, 2017

శ్రీమద్భాగవతం – 97

శ్రీమద్భాగవతం – 97

బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుటదుర్యోధనునకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. అపుడు దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘటించారు. అపుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని సాంబుడు తీసుకుపోతున్న కన్యయైన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు. ఈవార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధనుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు.బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగుమంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను’ అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్లి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహా బలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటపుడు ఉద్ధవుడిని పిలిచి వేదాంత బోధ చేస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి ఒకమాట చెప్పాడు. “మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనను సేవించ వలసినది’ అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముడిని పొగిడాడు. అపుడు బలరాముడు ‘నా తమ్ముడయిన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. అందుకని నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతొ పంపవలసింది’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ‘ఏమి చెప్పావయ్యా బాలరామా, కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ! యాదవులయిన మీరెక్కడ! మీరు పశువులను తోలుకునే వారు మీకు రాజ్యాధికారం లేదు. మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది’ అని యయాతి శాపం చేత అసలు యాదవులయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. కానీ మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు. రాజభోగములనన్నిటిని అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించలేదు. కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రానురాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్యమందాలని కోరిక పుట్టిందే మీకు! కాబట్టి ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది’ అని చెప్పి దుర్యోధనుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేదు. ఆయనతో మాటలాడడమేమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి.ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు యింద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఎ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, ఎ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుని పాదయుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి అంతటిది తాపత్రయ పడుతుందో, నిరంతరమూ సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవ్వాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు’. అది పరమ యథార్థము. కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను’ అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు యిన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు. అంతఃపురము కదిలింది. దుర్యోధనుడు ఏమి జరిగింది అని అడిగాడు. నీవు అనిన మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు’ అన్నారు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగుపరుగున వచ్చాడు.ఇప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు. అప్పుడు బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను యిచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది. ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది.బలరాముడు తీర్థయాత్రకు జనుటబలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి> అనగా బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పొతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి యితనికి బుద్ధి చెప్పాలి అని అనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్ట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు ‘నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠమును నరికేశాను’ అన్నాడు. అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు ‘బాలరామా, నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు. మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము “నీకు తెలియని రహస్యములున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షములున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేఛి నిలబదవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు. సూతునియందు దోషం లేదు. యిప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్యమయిన పాపం కాదు’ అని చెప్పారు.అపుడు బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి యిప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి’ అని అడిగాడు. అప్పుడు మహర్షులు ‘నేను అనంతుడను’ అని అన్నావు కదా ఆ ఈశ్వర శక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. అప్పుడు బలరాముడు ‘నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. కాబట్టి ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను’ అన్నాడు. యికపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధియందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నాను అని మరణించిన సూతుని బ్రతికించాడు. నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు యింకా ఏదయినా అడగండి. చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.

Sunday, January 8, 2017

శ్రీమద్భాగవతం – 96

శ్రీమద్భాగవతం – 96
కుచేలోపాఖ్యానం

శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. కృష్ణుడికి తెలియకుండా ఒకరోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వరం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసులవారు, పోతనగారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడయిన శుకుడు అభిమన్యుని కుమారుడయిన పరీక్షిత్తును చూసి ‘ఓరాజా! ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెపుతాను విను’ అని కుచేలుని గురించి చెప్తున్నాడు.కుచేలుడు అపారమయిన మానాభిమానములు కలిగిన వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచి పెట్టిన వాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్న వాడు. విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరమూ బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహాయిష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీలేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. గోవింద సఖుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి ‘కృష్ణా, నాకు సహాయం చేస్తావా’ అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తానుకూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మమూ తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒకరోజున భర్తతో అంది ‘మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు. నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పదిమాట్లు ఆకలేస్తోంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేక పోయానే అని అమ్మ బాధ పడుతుందేమోనని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకున్తున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా. మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్లి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా యిస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి. పిల్లల కోసమయినా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది’ అని చెప్పింది.భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు ‘పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళలేము కదా! స్నేహితుడికి ఏదయినా కానుక పట్టుకెళ్ళాలి కదా! ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మనింట్లో ఏమి కానుక ఉంది?” అని అడిగాడు. అపుడు ఆవిడ “మనకి ఉన్నదే మనం యిద్దాము. మన యింట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టి యిస్తాను తీసుకువెళ్ళండి’ అన్నది. కుచేలుడి జీవితకాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరుపెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము. కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని బార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడి వేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో, రథములనుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి, చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సఖుడయిన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న యింటిని తెలుసుకున్నాడు. యింటిముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తు పడతాడో పట్టాడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక యిచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి యివ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి యిపుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు. భటులు ‘ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అపుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ వున్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్లి కృష్ణ పరమాత్మతో ‘అయ్యా మీకోరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు’ అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంతదూరంలో చూసి ‘కుచేలా ఎప్పుడు వచ్చావు?’ అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా ఎన్నాళ్ళకు చూశానయ్యా నిన్ను లోపలికి రావలసింది’ అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీ దేవి, తానూ తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంస తూలికా తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్ళు తెప్పించి ఆయన కాళ్ళకింద పళ్ళెం వుంచి ఆదిలక్ష్మియైన రుక్మిణీదేవి నీళ్ళు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్ళు పోస్తుండగా, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమయిన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్ళు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తలమీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు.ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటినిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీ దేవి తెల్లబోయింది. ఆమె కూడా తామరపువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేదతీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం యిచ్చాడు. తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు.ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁడీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?ఏమి ఆశ్చర్యము! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందఱో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకానీ ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహా యోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం యింతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దానిమీద కూర్చోవడమా! అసలు ఈయన ఎవరు? అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు.అపుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమా! నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలాకాలం వేదం నమ్ముకును వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. అవునా?” అని అడిగాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆరోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేక పోతున్నాడు. కుచేలా ఎవరి దగ్గరికయినా వెడితే ఏమయినా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు?” అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గు పడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి యిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేలా, చాలా ఐశ్వర్య వంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి యిచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, కొబ్బరి నీళ్ళను గాని ఎవరయినా భక్తితో తెచ్చి యిస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీత వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను. అని కుచేలుని వద్ద ఉన్న అతుకుల మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు. అలా పోసుకునే సరికి 14 భువనభాండములలో వున్న సమస్త జీవరాసుల కడుపునిండి బ్రేవుమని త్రేన్చాయి. కృష్ణుడికి యింకా ప్రీతి ఆగక మరియొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని, కృష్ణా, మీరు తిన్నది చాలు. యిహలోకమందు పదితరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకచాలు’ అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు.పరమాత్మ కుచేలుడు యిచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు. తాను యింత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు.కుచేలుడు తెల్లవారు ఝామున లేని మరల తనకి వున్న మాసిపోయిన దుస్తులనే ధరించి ‘కృష్ణా, నేను వెళ్ళివస్తాను’ అని చెప్తే కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు. కుచేలుడు తన యింటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యం. ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్లమంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా. నేను తెచ్చిన అటుకులు తిన్నాడా. నా సఖుడిది ఏమి సౌజన్యం. నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కానీ అలా యివ్వలేదు’ అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడయిపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండి పోయేటట్లు నాకు వరమును యిచ్చాడు. అని అనుకున్నాడు. తన ఇల్లు ఉన్నచోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది. ఆ సౌధమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటుఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఎ మహాపురుషునిదో తన పూరి యింటి స్థానంలో అత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు.ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు. అది తన యిల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురువచ్చి భర్త కాళ్ళకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామి కృప వలన యిలా అయిపొయింది అని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును యిచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు యింట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించి పోతూ యిహము నందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి, అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు.ఇంట పరమపవిత్రమయిన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది. ఎవరు దరిద్రుడయిన కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టి ఈ ఆఖ్యానమును వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదములయందు భక్తికలిగి, వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మోక్షమును పొందుతారు” అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.

శ్రీమద్భాగవతం – 95

శ్రీమద్భాగవతం – 95
ధర్మజుని రాజసూయ యాగము

రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. కర్ణుడికి ఒకరికి దానం యివ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధా భక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు. పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి. వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారుచేయించమని తమ్ముడయిన భీమసేనునికి పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే యింటి యజమాని వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యతా కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు. యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు. వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు. భోజనపంక్తిలో రుచులూరించే పదార్థములను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలాఅంత అందంగా రాజసూయ యాగ క్రతువు జరిగింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు. ఇపుడు సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందఱో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందఱో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు వున్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. అపుడు వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి ‘అన్నయ్యా, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి అన్నయ్యా ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశాములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు యివాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయన యిక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి’ అన్నాడు.ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంత జ్ఞానియో సహదేవుడు చూడండి. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారు వన్నె గల వస్త్ర ద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కానీ మూడిన వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. అపుడు శిశుపాలుడు లేచి “ఈయన గోపాలుర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది యితడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది యితడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఈయన కులం తెలియదు. ఈయన గోత్రం తెలియదు. వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రామించాడో. ఎంతమందితో తిరిగాడో. ఇది నడువడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరుగని వాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా! సభలో వీనికన్నా తగినవారు లేరా! కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను యిప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను’ అని తన గదాదండము తీసుకుని కృష్ణుని మీదకు వెళుతున్నాడు.కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రమును స్మరించి ఆ చక్రమును శిశుపాలుని మీదికి ప్రయోగించారు. అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి. నూరు తప్పుల వరకు కాపాడతానని మేనత్తకు మాట యిచ్చాడు. ఇప్పుడు శిశిపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తి అయిపోయాయి. సుదర్శన చక్రమును ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్ను ముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తదనంతరం పాండవులందరూ అవబృథ స్నానమును చేశారు. యాగము అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవబృథ స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరమునకు చేరుకుంటున్నారు.శ్రీకృష్ణుడు సాళ్వుని, దంతవక్త్రుని చంపుట ఈలోగా సాళ్వుడు అనబడే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమయిన తపస్సు చేశాడు. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. పరమశివుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. అపుడు సాళ్వుడు తన యిష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరశివుని కోరాడు. అపుడు పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానమును నిర్మింపజేసి సాళ్వునికి యిచ్చాడు. ఆ విమానమునకు సౌభకము అని పేరు. ఆ విమానమును ఎక్కి ద్వారకా నగరం మీదకి వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపుర కుడ్యములను, గోపురములను తన గదా దండంతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్దమును ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనపడ్డాయి. రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్లు సాళ్వుడు కూడా మాయా వసుదేవుడిని సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుడిని సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటివారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలా ఖిన్నులయారు. కానీ మిగలిన వాళ్ళు ‘ఇది జరిగేది కాదు – వసుదేవుడు లోపలే ఉన్నాడు’ అని చెప్పారు. అప్పుడు ఆయన సుదర్శన చక్రమును ప్రయోగిస్తే సాళ్వుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తునియలు అయిపొయింది. తదనంతరం దంతవక్త్రుడు వచ్చాడు. వీడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. శిశుపాల దంతవక్త్రులిద్దరూ మరణించిన తరువాత వారిలో వున్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. గతంలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకులయిన జయవిజయులకు ఇవ్వబడిన శాపం చేత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి కాబట్టి ఈ జన్మలో వారు శిశిపాల దంతవక్త్రులుగా జన్మించి వారిరువురూ శ్రీకృష్ణ పరమాత్మచే సంహరింపబడి ఆయనలో లీనమయిపోయారు.

Friday, January 6, 2017

శ్రీమద్భాగవతం -- 94 శ్రీకృష్ణుని_మహిమ_నారదుండరయుట

శ్రీమద్భాగవతం -- 94🌹#శ్రీకృష్ణుని_మహిమ_నారదుండరయుట🚩

నారదమహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో ‘నారదా, కృష్ణుడు 16వేలమందిని పెళ్లి చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా?” అని అడిగారు. అప్పుడు ఆయన 16వేలమందిని ఎన్ని రోజులు పెళ్ళి చేసుకున్నాడు?” అని అడిగాడు. ఆయన నరకాసురుడి మీదికి యుద్ధమునకు వెళ్ళినపుడు నరకాసురుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచిన 16వేలమంది రాజ కుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి 16వేలమందికి 16వేల సౌధములు నిర్మించి 16వేలమందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16వేలమంది కృష్ణులై తాళి కట్టారట’ అన్నారు. ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా జరుగుతుంది? అన్నాడు. అనగా అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునాకు గురి అయ్యారో చూడండి. తాళి అయితే కట్టాడు. మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు? అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరకు బయల్దేరి భూలోకమునకు వచ్చాడు. ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉంది. ఆ నగరంలోని ఒక యింట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న 16వేలమంది స్త్రీలలో ఒకస్త్రీ గృహం. ఆవిడ తామర పూవువంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానునికి విసురుతోంది. భార్యచేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదా మని వెనక్కి వెళ్ళిపోబోతుండగా అటు తిరిగి కూర్చుని సేవలందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా! లోపలికి రండి. మీరు నాతొ ఏదయినా పని ఉండి వచ్చారా? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని ఔదల దాల్చి చేయడానికి ఈ సేవకుడు మీ దగ్గర సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ ’ అన్నాడు. అపుడు నారదుడు ‘కృష్ణా! మహానుభావా! దామోదరా నీవు భక్తులపాలిట సర్వ కాలముల యందు కల్పవృక్షము వంటి వాడివి. దుష్ట జనులను నిగ్రహించడానికి నీవు యిటువంటి అవతారములను స్వీకరిస్తావు. ఏ నీ పద సేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరమూ నా మనస్సు వశించి ఉండే వరమును నాకు యీయవలసినది’ అని నారదుడు కృష్ణుని అడిగాడు. తరువాత బయటికి వచ్చి ఈ యింట్లో ఉన్నాడు కాబట్టి పక్క యింట్లో ఎలా ఉండగలడు అనుకుని ఆ యింట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క యింట్లోకి వెళ్లి యిలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలాగే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెడితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురమునందు నిలబడిన నారదుడు అన్నాడు – ఏమి నా ఆశ్చర్యము! ఏమి నా ఆనందము! ఏమి కృష్ణ పరమాత్మ! మహానుభావుడు యింతమందితో రమిస్తున్నాడు. ఎలా? ఏకకాలమునందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కాని, అపవిత్రత కాని తనకి అంటనట్లు సూర్యకిరణములు బురడమీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు యిన్ని ఇళ్ళల్లో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు’ అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.
ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమయిన సంసార రీతి. దీనివలన మనకు ఏమి తెలుస్తున్నది? కృష్ణ పరమాత్మ 16వేలమంది కన్యలను మదము చేత చేసుకున్న వాడు కాదు. వారిని ఉద్ధరించాలని చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వమును, విష్ణు తత్త్వమును ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడు చేష్టితములను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వారము! ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాప కత్వము ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం యిచ్చారు. ఎవరయితే పరమభక్తితో కృష్ణ భగవానుని సంసారమును నారదుడు చూసే ప్రయత్నము చేసి తాను ఆనందించిన కథా వృత్తాంతమును విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో, వారియందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుడిని తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమునందు అపారమయిన ధనమును పొంది పశు, పుత్రా మిత్ర వనితాముఖ సౌఖ్యములన్నిటిని అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఆ ఆఖ్యానమును పూర్తిచేశారు.భీముడు జరాసంధుని వధించుటఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు. అపుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. ‘అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేకమంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమయిన హింసలు పొందుతున్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించ వలసినది’ అని కోరాడు. ఆమాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి ‘తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము’ అని మాట యిచ్చి, ఈ సందర్భంలో ఎం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసు ఉన్న వాడయి ఉంది ఉద్ధవుడిని అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును పదిమందికి కట్టబెడతారు. అపుడు ఉద్ధవుడు అన్నారు “ఇటువంటి కార్యం చేసేముందు ఒకపని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు నాలుగు దిక్కులా ఉండే రాజుల పీచమణచదానికి నలుగురిని పంపవలెను కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి’ అన్నాడు. ‘చాలామంచి ఆలోచన చెప్పావు’ అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు.
ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురినీ నాలుగు దిక్కులకు పంపారు. నాలుగు దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు ఒక్క జరాసంధుడు తప్ప. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ ‘ధర్మజా, నీవు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించడం కోసమని నేను అర్జునుడు భీమును బ్రాహ్మణ రూపంలో వెళతాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదయినా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణరూపంలో వెళ్లి యుద్ధ భిక్షను అడుగుతాము. ఇస్తాను అనిన తరువాత వాడు తప్పుకోవడానికి వీలులేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము’ అని ముగ్గురూ బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి?” అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులయిన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి ముగ్గురిని తేరిపార చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చినవాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17సార్లు ఓడిపోయాడు. కానీ 18 వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18 వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అపుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తానూ ఓడిపోయానన్నది జరాసంధుడు మరచిపోయాడు. 18 వ సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉంది. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి!
“ఏమి వింతయ్యా! నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధ భిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయను” అన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడంలోనే వాని మరణం వచ్చింది.
‘కృష్ణా నాతొ యుద్ధ భూమిలో నిలబడడం అంటే అంత తేలికయిన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరాక్రమములు ఉన్నవాడు. గాండీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్న పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా. అతడు మహా బలవంతుడు. పైగా వాయుపుత్రుడు. నాతో బలమునకు సరిపోతాడు’ అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలు పెట్టాడు. భీమసేనుడు జరాసందునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.
వెంటనే మల్లయుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారుచేశారు. జరాసంధుడు భీమసేనుడు యిద్దరూ మల్లయుద్ధం మొదలుపెట్టారు. భయంకరమయిన యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురోడి పోయి యిద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. బీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడియందు ప్రవేశపెట్టారు. కృష్ణుడు తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది పదివేల ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టుకొమ్మ తీసి దానిని రెండుగా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒకకాలును తన రెండు కాళ్ళతో తొక్కిపట్టి రెండవ కాలును పట్టుకుని ఉత్తరించేస్తే, శరీరంలో సగభాగం తలవరకూ జరాసంధుడి శరీరం రెండు ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ యిటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ‘ధర్మ బద్ధమయిన పాలన చేసే వాడు ఎవడు ఉంటాడో, వానియందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మ బద్ధంగా పరిపాలించండి’ అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచి పెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధనకనకవస్తు వాహనములను పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగము చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.

శ్రీమద్భాగవతం -- 93 నృగమహారాజు_చరిత్రము

#శ్రీమద్భాగవతం -- 93    #నృగమహారాజు_చరిత్రము🌹🌹🌹

కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు తాగాలని అనుకున్నారు. అక్కడ వున్నా నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి పది ఉంది. దానిని చూసి వాళ్ళు తెల్లపోయారు. దానిని పైకితీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసరవెల్లిని పైకి తీయలేకపోయారు. వెంటనే వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి కృష్ణపరమాత్మకు చెప్పారు. అపుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయట పడేశాడు. సర్వజ్ఞుడు అయిన పరమాత్మ సాంబుడు మొదలయిన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లిని ‘నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు? ఎందువలన నీకీ జన్మ వచ్చింది?’ అని అడిగారు. ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ‘మహానుభావా, నేను ఇక్ష్వాకువంశంలో జన్మించిన నృగ మహారాజుని’ అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడు. నృగ మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు ‘నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది. కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ, కృష్ణా ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ, నేను చేసిన దానములు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం యిచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజుగారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకేఒక జీవనాధారమై ఉన్నది ఇపుడు ఆ ఆవు కనపడడం లేదు. ఆ ఆవుకోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ‘అది నా ఆవు. నృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు’ అని చెప్పాడు. అపుడు ఆ బ్రాహ్మణుడు ‘నేను యిప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను యిప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను’ అన్నాడు. ‘లేదు ఈ గోవు నాది’ అన్నాడు కశ్యపుడు. ‘కాదు ఈ గోవు నాది’ అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ‘అయ్యా, ఈ గోవును యింతకు పూర్వం నాకు దానం యిచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి నా అవును నాకు యిప్పించు’ అని రాజును కశ్యపుడు అడిగాడు. అపుడు రాజుగారు రెండవ బ్రాహ్మణునితో ‘నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం యిచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం యిచ్చేసిన గోవు. కాబట్టి ఆ గోవును నీవు యిచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు యిచ్చేస్తాను. అన్నాడు. అపుడు రెండవ బ్రాహ్మణుడు తనకు ‘ఆ ఆవే కావాలి’ అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. అపుడు రాజుగారు ‘నీకు లక్ష గోవులను యిస్తాను. ఈ గోవును విడిచిపెట్టు’ అన్నాడు. ‘నాకు ఎన్ని గోవులు యిచ్చినా అక్కర్లేదు. నాకు ఈ గోవే కావాలి’ అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు.అపుడు రాజు కశ్యపుని చూసి ‘నీకు నా రాజ్యంలోని భాగమును ఇమ్మంటే ఇస్తాను. లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను యిస్తాను. తీసుకువెళ్ళు’ అన్నాడు. అపుడు కశ్యపుడు ‘నేను అడిగిన గోవును ఇవ్వలేక పోయావు. ఇంక నాకు యివ్వవలసినది ఏమీ లేదు’ అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగ మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపొయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు.అపుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాపఫలితం ఒకటి ఉంది. అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గ లోకమునకు తీసుకు వెళతాము. ఆ పాపఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లియై నూతిలో పడి ఉండండి’ అన్నారు. అపుడు నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు ‘నీవు ఒక బ్రాహ్మణుడికి దానం యిచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి ఊసరవెల్లివై పడి ఉండు’ అన్నారు.ఈమాటలు నృగ మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వ లోకములకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ‘బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని, తెలియక గాని ఎవరయినా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకున్తాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు వున్న భక్తి అటువంటిది’ అన్నారు. ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను యిస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా! ఆ బ్రాహ్మణునకు అంత మౌడ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మూడుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపొతే రాజ్యం యిస్తానన్నాడు. కానీ కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం కాని, యితర గోవులు కాని అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదయినా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడయిన వాడు యితరులు చేసిన తప్పుడు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవీ యిక్కడ మనకు కలిగే సందేహములు. వీటికి సమాదానములను కొందరు పెద్దలు వివరణ యిచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు?ఓక్ గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమయిన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు యింకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించెయ్యాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదయినా యిస్తానన్నా ఆయన ఆశ పొందలేదు. దానిని అంగీకరించలేదు. రాజు నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ రాజు అవతలి వారియందు వున్న తృప్తిని గమనిన్చాలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమయిన తృప్తితో పొందవలసిన లక్షణము. దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాపఫలితమును అనుభవించడమే. కాబట్టి కృష్ణ పరమాత్మ యింకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు. ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్నకతలా ఉంటుంది. కానీ యిందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కథ నేర్పుతుంది. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింప జేసింది. నేను యిస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమయిన ఫలితమును యిచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించ గలిగిన శుభ ఫలితములను యివ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమయిన స్థితిని అవిష్కరిస్తుంది.పౌండ్రక వాసుదేవుడుపూర్వం కరూషదేశమును పౌండ్రక వాసుదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడయిన తరువాత ఆయనకు ఎవరో ‘అయ్యా మీపేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతున్నది’ అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనుస్సు చేయించుకున్నాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరము కట్టుకోవడం ప్రారంభించాడు. ఆవిధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఒక రాయబారిని పిలిచి నీవు వెళ్లి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి యిచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్లి ‘అయ్యా పౌండ్రక వాసుదేవుడు మీకీ రాయబారం పంపించాడు’ అని చెప్పాడు. ఆ పత్రికలో “నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో, అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే. నాకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. నీకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివలన యిబ్బంది వస్తోంది. కాబట్టి నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నిటిని వదిలి పెట్టెయ్యాలి. వాసుదేవుడు అన్న పేరును వదిలి పెట్టెయ్యాలి. లేకపోతె యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టుపెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు’ ఇదీ రాయబారం లోని సారాంశం. కృష్ణుడు అన్నారు “ఈ చిహ్నములు నాకు సహజములు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి అతడు కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందాం’ అని పంపించివేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వానిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకపకా నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అపుడు చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ‘ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది”’ అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఎ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళలా కృష్ణుడినే తలచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఎ కారణం చేత తలచినా సంతతము తలచినది ఆ వస్తువునే కాబట్టి చివరకు ఆ వస్తువులోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలల తోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నములు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినపుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు.కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతలకి పారేశాడు. ఇది అనవసర విషయముల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలయిన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్త్వికమయిన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్త్వ గుణంతో ఉంచుకుని, భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప, లేని పోని భేశాజములు అంత మంచివి కావు అని హెచ్చరిక చేసే అద్భుతమయిన లీల.

Tuesday, January 3, 2017

శ్రీమద్భాగవతం – 92 ఉషా పరిణయం

శ్రీమద్భాగవతం – 92  ఉషా పరిణయం:

పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. ఆటను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. వేయి చేతులు వున్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ‘వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు’ అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. ఆటను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు ‘నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు.అపుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు.పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈవిధంగా శంకరుడు కోతబయత తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు.ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి ‘శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతొ యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది’ అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అపుడు ఆయన అన్నాడు – ఇపుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది రక్షించవలసినవాడూ తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడూ తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు వున్న ఇంకొక రూపంతో వేయాలి. ‘నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది’ అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు. ఇపుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణమును అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివ కేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానమును బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది. ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టముగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఎ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది’ అని అడిగింది. అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అప్పుడు చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందఱో రాజాధిరాజులను చూశాను. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు’ అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అపుడు చిత్రలేఖ ‘ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.’ అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అక్కడ ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశమార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. అసురీవృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురి గొడవ అక్కరలేదు. యుద్ధం కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు “అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది’ అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది’ అని అన్నాడు.శంకరుడు భక్త వత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు.కాబట్టి యిపుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభం అయింది. శివుడు యుద్ధంలో లొంగనంత సేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. అపుడు శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి డీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది. ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వనాల లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమయినదిగా జ్వరము బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరం యిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడయినా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్త్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును యిస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మా చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లియైన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటిమీద ఉన్న వలువలన్నిటిని విప్పేసి, జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురునిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనుస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరల యుద్ధం ప్రారంభం అయింది. అపుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. ‘నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలులేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసినది అని. శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్ధం రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆరోజు కృష్ణ భగవానుడు బాణాసురునకు ఉన్న బాహువులలో 996బాహువులను సుదర్శన చక్రధారల చేత తెన్చేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. ఇప్పుడు వాని శరీరమునందు రజోగుణ తమో గుణములు లేవు. శుద్ధ సత్త్వంతో ఉంటాడు. ‘ఈశ్వరా వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసురసంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని నాలుగు చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు’ అని ఆరోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు.ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యిపుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు. ఈవిధంగా ఉషాపరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది.ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు పరమ శివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో ఎవరు తుట్టతుదకు నాలుగు చేతులతో, పరమశివునికే కింకరుడు అయ్యాడో కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో ఆయన నామం ఎవరు చెపుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్లకి ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషాపరిణయఘట్టమును, బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంతగొప్ప ఆఖ్యానము.

శ్రీమద్భాగవతం – 91వ భాగం

శ్రీమద్భాగవతం – 91

ఒకనాడు కృష్ణభగవానుడు పరమసంతోషంగా రుక్మిణీ దేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసురసంధ్య వేళ దాటిన కాలం. ఆ యిల్లు కర్పూరము అగరు మొదలయిన సువాసనలతో ఉంది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకొని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో “రుక్మిణీ, నిన్ను చూస్తే నీవు చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తోంది. నేను ఐశ్వర్య హీనుడను, దరిద్రుడను. ఎక్కడో సముద్రగర్భంలో యిల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంట మంచి సంబంధం విడిచి పెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టేవేమో అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈమాటలు వింటున్నప్పుడు రుక్మిణీ దేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయింది. అపుడు ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆవిడ ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళనుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కదిగాడు. కర్పూర వాసనవచ్చే పలుకులు ఆమె చెవులలోకి ఊదాడు. ఆమె నేలమీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టేసి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వురేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు ఆమె ప్రసన్న మయేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అదేమిటి రుక్మిణీ నేను నీతో విరసోక్తులాడాను. ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి’ అన్నాడు.
కృష్ణుడి లాంటి స్వామి యిలా మాట్లాడవచ్చునా? అని మనకి అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది. అటువంటి చిన్న దోషమును స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవియందు భరించడు. రుక్మిణీ దేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. ‘అష్టమహిషులలో నేను పట్టమహిషిని. కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండ నా మందిరమునకు విచ్చేస్తూ ఉంటారు’ అని ఆమె మనస్సులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది. కానీ యథార్థమునకు కృష్ణ పరమాత్మ 16వేల ఎనిమిది మంది గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజూ ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు. కానీ ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మన మేధకు అందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయి పొతే ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మి అంశ. కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమెనుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు. కాబట్టి యిపుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన.
కృష్ణుని మాటలు విన్న తరువాత అమ్మవారు చాలా అద్భుతమయిన విషయమును చెప్పింది. ‘కృష్ణా! మీరు చెప్పిన అన్నీ పరమ యదార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరివలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరు నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసే వారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములు ఎవరు ఉంటారో, అటువంటి వారికి చెందినవాడవు నీవు. ఎప్పుడూ కూడా పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప, వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి.
సౌందర్య వంతులయిన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యముతో పనిలేదు. నీకు కావలసినది అంతఃసౌందర్యము. కృష్ణా, నీవు అనిన మాటలల్తో చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించే దానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేతకాని, వాక్కు చేతకాని, చేరేదానను కాను. ఈశ్వరా, నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని యివ్వు’ అని అడిగింది. కృష్ణుడు ‘రుక్మిణీ! నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరయినా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటి సారి రుక్మిణీ దేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవశుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమయిన ఘట్టం ఈ ఘట్టం. రుక్మిణీ దేవి కృష్ణుడిని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణీ విజయం. దానిని మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము.
బలరాముడు రుక్మిని చంపుట
రుక్మికి రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణుని మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడుగారు కావాలి. కానీ అల్లుడుగారి నాన్న గారు, అమ్మగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు, ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళను ఎంతగానో ఆదరించాలి. కానీ ఆ పిల్లవాడు తన అక్కచెల్లెళ్ళను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం యిందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనం ప్రయోజనమును పొందగలుగుతాము. లేకపోతె అది మన జీవితమును ఉద్ధరించదు.
రుక్మికి రుక్మిణి అంటే తోడపుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడయిన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు యిచ్చి వివాహం చేశాడు. మనవరాలయిన రుక్మలోచనను కృష్ణుని మనుమడయిన అనిరుద్ధునకిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అందరు బయలుదేరి పోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగ రాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్త్వం కలిగిన వాడు. కడుపులో చాలా బాధ పడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్లి ‘ఏమయ్యా నీకేమయినా బుద్ధి వున్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు. నీ కూతురుని కృష్ణుడు కొడుకుకు యిచ్చి వివాహం చేస్తావా. ఆరోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తిపట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు. అపుడు రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నీవు భోజ కటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీ దేవికి కృష్ణునియందు పుట్టిన కొడుక్కి నీ కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తావా! నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే. నీవు చాల తొందరగా నీ అవమానములు మర్చిపోతావు’ అన్నాడు.
ఇతని మాటలు విన్న రుక్మి ‘బలరామ కృష్ణులను ఎలా అవమానించ గలను?’అని కళింగ రాజుని అడిగాడు. అపుడు కళింగ భూపతి ‘ఏమీ లేదయ్యా బలరాముడికి ద్యూతం ఆడడం అంత బాగా రాదు. ద్యూతమునకు రమ్మనమని ఆహ్వానిస్తే రానని అనడు కదా! కాబట్టి బలరాముణ్ణి ద్యూతమునకు రమ్మనమని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితుడయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నువ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నీవు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి’ అన్నాడు.
ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని ద్యూతమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి వున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. ఆఖరున బలరాముడికి కోపం వచ్చి లక్ష రూకలను ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. ‘నేను గెలిచాను’ అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. అపుడు బలరాముడు సరే వేరొకసారి లక్ష ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు రుక్మి. అశరీరవాని ఈ ఆటలో బలరాముడే గెలిచాడు అని పలికింది. ఇంత అశరీర వాని చెప్పినా రుక్మి నవ్వుతూ నువ్వు గొల్లలలో పుట్టిన వాడివి, ఆవుల వెంట, దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునే వాడివి. నీవు రాజులతో ద్యూతం ఆడడం ఏమిటి? నీవేమి మాట్లాడుతున్నావు? అన్నాడు. బలరాముడు ఇంక వీడిని ఊరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీదనుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి క్రింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం క్రింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్కదెబ్బ కొట్టాడు. మూతి వెనక్కు వెళ్ళిపోయి నెత్తురు కక్కుకుని రుక్మి చచ్చిపోయాడు. అపుడు కృష్ణుడు లేచి ‘రుక్మిణీ బయలు దేరదామా’ అన్నాడు. అయ్యో తప్పకుండా బయలుదేరదాము అన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంతే. తన పుట్టింటివారనే మమకారములు ఆవిడకు లేవు. ‘నా భర్త ధర్మమూర్తి. ఆయనకు తెలుసు ఏమిచేయాలో, ఆయన ఏమి చేస్తే అదే యదార్థం. అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీ దేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు.