Search This Blog

Sunday, December 25, 2016

భాగవతం - 14 వ భాగం

భాగవతం - 14 వ భాగం

తదనంతరం కుంతీదేవి స్తోత్రం చేసింది. ఆవిడ ఆదినారాయణా అని ప్రారంభించింది. కృష్ణా నాభక్తి ఇంకా పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు. మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఎఆంటి మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదేవి అడుగుతోంది. ‘పాండురాజు కుమారులయిన ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదనము చేయవలసింది.
స్వామీ నీయందు నా నమస్సు రమించిపోవాలి. పూజామందిరంలోనే కాదు. నేను ఏపని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. నీ నామస్మరణము నుండి నా మనస్సు ఆగకూడదు. నీవు ఈశ్వరుడవు, నీవు సర్వ జగన్నియామకుడవు. నీవు తలచుకుంటే ఏమి ఇవ్వలేవు! అందుకని కృష్ణా, నాకు అటువంటి భాగ్యమును కటాక్షించవా! నాకు ఆ మోహమును తెంపి అవతల పారవేయవలసింది. సంసారమనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి. వాటిని గండ్ర గొడ్డలితో తెంపి అవతల పారేయి’ అని అడిగింది అమ్మ.

అంట కృష్ణ పరమాత్మ కూడా ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాడు. పొంగిపోయి ‘ అప్పుడే ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి, నువ్వు సంతోషించాలి’ అనే భావం వచ్చేట్లుగా హేలగా చూసి, ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. అంటే! మాయ ఆవరించింది. ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ మందహాసపు కాంతులలో మైమరచిపోయేటట్లు చేసేశాడు. ఆయన దర్శనానికి ఉండే శక్తి అటువంటిది. అందుచేత ‘స్వామీ నిరంతరమూ నీ గురించి భావన చేసే అదృష్టమును ప్రసాదించవలసింది’ అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోయిన తరువాత పదినెలలకు ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉడాయించారు.

భీష్ముని చరిత్ర:

కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజుగారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందఱో రాజులను తెగటార్చాను. దానివలన నాకు కలిగిన పాపం ఏవిధంగా పోతుంది’ అని బాధపడుతున్న సమయంలో, ‘ధర్మసూక్షములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్యమీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు – అక్కడికి వెడదాం పద’ అని మహానుభావుడు కృష్ణభగవానుడు ధర్మరాజును తీసుకొని వెళ్ళినప్పుడు, భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రం భాగవతంలో వివరించ బడింది.

భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది. భీష్ముని జీవితం అంట తేలికయిన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమయిన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది.

ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభనొక దానిని తీర్చారు. ఆ సభకు ఋషులు ప్రజాపతులు మొదలయిన వారందరూ విచ్చేశారు. వారు ఆ సభయందు కూర్చుని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్లు చూడడం ఎలాగా, భగవంతునియందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పథంలో నడిచినవారు అవుతారు. అందుచేత వీళ్ళందరికీ ఏవిధంగా కళ్యాణమును సాధించిపెట్టాలి అని సభ జరుగుతోంది.

ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్దకూతురు. సహజంగా ఆవిడ చాలా సౌందర్యరాశి. పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమయిన అందగత్తె. మహాసౌందర్యరాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు. వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది.

గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో వున్న అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. కాని ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారిరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయమును మరచిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకి అర్థం అయ్యేవి కావు. కథ నడిస్తే మనకి అర్థం అవుతుంది.

అపుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడమేమిటి, రాజర్షి అలా ప్రవర్తించడమేమిటా అని అనుకున్నారు. అనుకుని వారిద్దరినీ శపించారు. ‘ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించెదవు గాక’ అని రాజర్షిని శపించారు. గంగమ్మను ‘నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు జీవించెదవు గాక’ అని శపించారు. తదనంతరం ‘శరీరం విడిచిపెట్టిన తరువాత మరల స్వర్గలోకమునకు వస్తావు’ అని శాపవిమోచనం చెప్పారు. ఆకారణం చేత రాజర్షి తానూ ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు.

ఆ కాలంలో భారత వర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి. బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకొని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందికి వస్తోంది. ‘అయ్యో నేనెంత పొరబాటు చేశాను. నేనయినా ఆ సమయంలో పమిట సర్దుకుని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి’ అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్ట వసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత బాధగా ఉన్నారు’ అని అడిగింది. అపుడు వాళ్ళు ఒక చిత్రమయిన విషయమును ప్రతిపాదన చేశారు. ‘మేము అష్టవసువులము. భార్యలతో కలిసి ఆకాశమార్గములో వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము. మేము వసిష్ఠ మహర్షి ఆశ్రమమును చూశాము. అందులో ‘నందిని’ అనే కామధేనువు ఉంది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ, తేజస్సుతోనూ ఉంది. దానిని ‘దయు’ అనబడే వసువు భార్య చూసి ‘అది మామూలు ఆవేనా’ అని భర్తను అడిగింది. అపుడు ఆయన అది మామూలు ఆవు కాదు – దానిని కామధేనువు అంటారు – దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికయినా తీరుతుంది’ అని చెప్పాడు. అపుడు ‘ద్యు’ భార్య అంది –‘నాకు ‘ఉసీనర’ అనే స్నేహితురాలు వుంది. ఆమె కొద్దిగా రోగగ్రస్తయై వార్ధక్యమును పొందింది. ఆవిడకు మరల యౌవనం వస్తే నాతోపాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామదేనువును అపహరించి తీసుకువెళ్ళి దానిపాలు ఉసీనరకి పట్టిద్దాము’ అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ‘ద్యు’ ఆ కామదేనువును అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వశిష్ఠమహర్షి సాయంకాలం పూజకోసమని దర్భలు మొదలయినవి సేకరించదానికని వెళ్ళారు. వారు తిరిగివచ్చి ఆశ్రమంలో చూశారు. నందినీధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్ఠలో కూర్చుని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూశారు. అష్టవసువులు కామదేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు జన్మించెదరు గాక’ అని శపించారు. ఈ వార్తా తెలిసి అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠమహర్షి పాదాలమీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేతట్లు చేయండి’ అని ప్రార్థించారు. అపుడు ఆయన అన్నారు – ‘మీరు ఎనమండుగురు వసువులు. మీ ఎనమండుగురిలో ఏడుగురియందు పాపము తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం ‘ద్యు’కి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమయిన కారణము ‘ద్యు’. అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు. కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలి పెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన ‘ద్యు’ మాత్రం పరాక్రమవంతుడై, కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకము నందు కొంతకాలము ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ‘ద్యు’ మాత్రము కొంతకాలము భూలోకము నందు ఉండవలసినదే’ అని ఆయన శాపవిమోచానమును కటాక్షించారు.

ఆ ఎనమండుగురు ఇపుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయింది. ‘అమ్మా నీవు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు’ అని అడిగారు. అపుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి – ‘రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నాను’ అంది. అపుడు వాళ్ళు –‘అయితే అమ్మా, మాకు ఒక ఉపకారం చేసిపెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళుతున్నావు కనుక నీకడుపున మేము ఎనమండుగురం పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాపవిమోచనం కోసం మాకొక సహాయం చేసిపెట్టాలి. భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్నతల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాపవిమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము. నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచి పెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు’ అని కోరారు. అపుడు గంగమ్మ ‘తప్పకుండా అలాగే చేస్తాను’ అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా జరిగితే గంగాతీరము నందు భారతవంశములో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థియై తపిస్తున్నాడు. ఆయనకీ సామ్రాజ్యం ఉంది. సత్యం ఉంది, ధర్మం ఉంది. అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానము లేదు. ఈశ్వరానుగ్రహమును ఆపెక్షించి ఆయన గంగాతీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకుపూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియములను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమయిన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. తన తొడమీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆయన అన్నాడు – అమ్మా నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడమీద కూర్చున్నావు అని అడిగాడు. ఆవిడ అంది – నన్ను గంగ అంటారు. నేను గంగానదికి అధిష్ఠాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అపుడు ఆయన అన్నాడు. నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు. కానీ ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. కుడి తొడమీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే వుంది. ఎప్పుడయినా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడమీద కూర్చోవాలి. కానీ ఇపుడు నీవు వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. ఇపుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలులేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. కాన నాతొ సామానమయిన వాడు నా కొడుకు. ‘ఆత్మావై పుత్రనామాసి’ నా తేజస్సు నా కుమారునియందు ఉంటుంది. అందుకని నీవు నా కుమారుడికి భార్యవు అవుదువు గాని. అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు.

ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్నా గోభిషుడు అనే రాజర్షి చూశాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజుగారి కుమారుడిగా జన్మిస్తాను’ అని ఆయన తెజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతొ జన్మించాడు

భాగవతం - 21 వ భాగం

భాగవతం - 21 వ భాగం

పరీక్షిత్తు – కలి – ధర్మదేవత
పరీక్షన్మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు అయి దేశాన్నంతటినీ కూడా ఏంటో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణ ప్రదంగా ఉన్నదో అంట ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరుకాయలు. నెలకి మూడు వానలు! ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తాను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశి, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర మొదలయిన రాష్త్రముల నన్నిటిని జయించాడు. ఏకచ్ఛత్రాధిపత్యంగా విశాలమయిన సామ్రాజ్యమును తన పతాకఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు.

పరీక్షిన్మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట! యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని, దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకుని వెళ్ళడం చూసేవారు. అంట నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకు వెడుతుంటే, శిబిరము వేసుకుని ఉంటే, ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి ‘మహానుభావా’ మీ పెదతాతగారయిన ధర్మరాజుగారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకుని ఉంటే, తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ, శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని, శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారధ్యం చేస్తుంటే పాండవ మధ్యముడయిన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి ఫల్గునా, రధం ఎటు తిప్పాలి’ అని అడిగేవాడు. అర్జునుని పిలిచి ‘బావా’ అని హాస్యం ఆడేవాడు. ‘శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆడరించాడో! ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరుగెడుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు బావా, ఎక్కడికి పరుగెడుతున్నావు?’ అని అడిగాడు. అపుడు అర్జునుడు ‘శివాలయానికి వెడుతున్నాను. ఈవేళ శివరాత్రి. అభిషేకం చెయ్యాలి’ అన్నాడు. అపుడు కృష్ణుడు శివాలయంలోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా’ అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం! కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. ‘నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో?” అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు.

కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదా పురస్కృతమైన విశేషములను విని, కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీని చీనామ్బరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదములయందు నిరంతరమూ రమించి పోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడయిన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన చూశాడు. దీనిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని మీరు కేవలము ఒక పురాణ కథగా చదివితే దానివలన ఎంత ప్రయోజనము వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ ఘట్టమును మీరు చాలా సునిశితంగా పరిశీలించాలి. భాగవతము భాగవతముగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమయిన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగేముందు దాని వెనకాతల ఒక కీలకమయిన సందర్భం ఉంటుంది. ఇపుడు శుకుడు వచ్చి కోర్చోవలసిన సందర్భం వస్తోంది. అలా రావడానికి గాను దాని వెనక ఏదో మహత్తరమయిన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణములో పరిశీలన చేయకపోతే భాగవతమును వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యం మీకు అందదు. భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి వున్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు. తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే, ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడయినా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే ‘క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షీ’ అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఒర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయింది. దీనిని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉంది. ఎద్దుకు నాలుగు కాళ్ళూ లేవు. ఒక కాలిమీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమిమీద డేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబదినట్లుగా ఆన్న ఎద్దు తన మూడుకాళ్ళు పోయాయని ఏడవడం లేదు – ఆవు ఏడవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇదీ మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది – ‘నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా’ అని అడిగింది. ‘మంగళప్రదురాలా’ అంటే ‘శుభం ఇవ్వడం మాత్రమే తెలిసివున్నదానా’ అని అర్థం.

మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గునపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంతుంది. మనం అన్నం తినడానికి నాగలిపట్టి అమ్మ గుండెలమీద గాట్లు పెడతాం. అమ్మ పంటలు పండించి మనకి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులవెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇపుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా!’ అడిగితె భూమి అంది ‘నేను దేనికి ఎదుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృత యుగమయినా, మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది.’ ఇక్కడ గోవు బాధ పడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నాడో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది ‘కలి ప్రవేశించాడయ్యా – నేను ఏడుస్తున్నా నంటావేమిటి? నీకు మూడు కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను’ అంది. ఆయనకీ మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు? ఆవిడ అంది –

కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. ఆటను రావడానికి కాలము దారిని ఇచ్చింది కాలము ఈశ్వరరూపం. ఆ కలి లోపలి అడుగు పెట్టి పాదములు ఇంకా పూన్చుకోలేదు – పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు నాలుగు పాదములు ఉండేవి. ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది. మూడు పాదములు లేవు. కలిపురుషుడు వచ్చేయడం వలన నీకు మూడు పాదములు పోయాయి’ అంది.

అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మమూ. ధర్మమునకు, భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మమనబడే వృషభము. అందుకే శంకరుడు వృషభమును ఎక్కుతాడని అంటారు. అనగా ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెపుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ‘నేను దేవతలా గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు’ అంది. రాబోయే కాలములో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువయిపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మున్నగు కార్యక్రమములు జరగవు. మీరు మరల సంపదను పొందడానికి అగ్నిహోతము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే, ప్రీతిచెండిన దేవతలు మరల వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. ‘హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చేయము’ అని దేవతలు శుభములను చేయరు.

భాగవతం - 20 వ భాగం

భాగవతం - 20 వ భాగం

ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు. ‘ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా తెలుసా?” అని విదురుని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విడురుడిని పిలిచి ‘నాకు నిద్ర పట్టడం లేదు. ఏదయినా మంచిమాటలు చెప్పు’ అనేవాడు. అప్పుడు విదురుడు ‘నీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? దొంగలకి నిద్ర పట్టదు. నీవు దొంగవి. నీ తమ్ముడి రాజ్యం, నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నీవు దొంగిలించాలని ఆలోచన చేస్తున్నావు’ అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తరువాత వాటిని విని ధృతరాష్ట్రుడు ‘నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను. నేను ఈ మొహమ్లోంచి బయటకు రాలేను’ అనేవాడు. కనీసం ఒక మంచివ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకుని, బుర్రకి పట్టినా లేకపోయినా రాత్రి మంచి మాటలు వినేవాడు. ఈ పుణ్యమునకు గాను విశ్వరూప సందర్శనంలో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనం చేయించాడు. జీవితంలో ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో చూడండి!

అటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ‘ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలియదు. అని కన్నుల నీరు పెట్టుకున్నాడు.

ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్కళ్యాణమే. ఎందుకు ఏడుస్తున్నావు? అని ధర్మరాజుని అడిగాడు. పాపం మా పెదనాన్న గారికి కళ్ళు లేవు, ఉత్తర దిక్కుకి తపస్సుకి అని వెళ్ళిపోయారు. ఆయన ఏమి తింటారు? ఎవరు పెడతారు? అన్నాడు ధర్మరాజు. అపుడు నారదుడు ఈ పిచ్చి ప్రశ్న మానెయ్యి. ఎవరు పెడతారని అంటావేమిటి? రెండు కళ్ళు ఉన్న దానిని నాలుగు కాళ్ళు ఉన్నది తినేస్తోంది. నాలుగు కాళ్ళు ఉన్న దానిని రెండు కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి, పళ్ళు పండి అందవేమోనని క్రిందకు వంగి అందిస్తున్నాయి. కాయ కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్న వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకు బెంగ ఎందుకు? ఆటను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తరదిక్కున ఋషులు ఉంటే ఆశ్రమమును చేరుకున్నాడు’ అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అనిన మాటలకు చాలా వైరాగ్యమును పొందాడు.

ఇవాల్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నింటిని వశం చేసుకొని అంతర్ముఖుడు అయిపోయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిల్ల జేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే అటువంటి యోగాగ్ని యందు తన శరీరమును బూడిద చేసేస్తాడు. బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మమును చేరిపోతారు. నువ్వు సంతోషించు’ అని చెప్పాడు. అర్జునుడు వెళ్ళి ఇప్పటికి ఏడు నెలలు అయింది. కృష్ణ భగవానుడిని చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది?’ అని ఆశ్చర్యపోతూ విదురుడిని ‘మీరు తీర్థయాత్రలు చేశారు. అనేక క్షేత్రములకు వెళ్ళారు. ద్వారకానగరం ఎలా ఉంది? కృష్ణ భగవానుడు క్షేమమేనా?’ అని అడిగాడు.

కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విడురునికి తెలుసు. కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాదన్న అప్రీతికరమయిన వార్త విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది.
‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం’
సత్యమయినా అప్రియమయిన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు.

కానీ ధర్మరాజు నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూస్తె అవతార పురుషుడై, ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజముల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడయిన కృష్ణుడు శరీరము విడిచి పెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్లే. నాకు అనుమానంగా ఉంది’ అని బాధపడ్డాడు.

ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అప్పుడు అర్జునుడు ‘అన్నయ్యా, మన నెచ్చెలి, మన దైవము, బంధువు, మన సమస్తము అయిన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా! ముల్లు కాలిలో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్న వాడు ఆ ముల్లు తీయడానికి వేరొక ముల్లును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరించి, శరీరములో ఉన్న ముల్లు తీసేసిన తరువాత శరీరములో గుచ్చుకున్న ముల్లు, చేతిలో వున్న ముల్లు రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరముతో ఈ లోకములోనికి ప్రసంగముల యందు జీవితమును పాడుచేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తానూ శరీరముతో వచ్చి ముల్లును ముల్లుతో తీసినట్లు తాను లోకమునకు గీత చెప్పి నడవడి నేర్పి మనలను ఉద్ధరించి అని అంటూ ఆశ్చర్యం ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకొన్ అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు, కేవలం కడవలో నీళ్ళు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించ్నంత తేలికగా గాండీవము ఉన్న నన్ను ఓడించేశారు. నన్ను ఓడించి కృష్ణ పట్నులను నావద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకొకటి అర్థం కాలేదు. ఈ గాండీవమునే కదా నేను అప్పుడు పట్టుకున్నది. ఈ రథమునే కదా నేను అప్పుడు ఎక్కాను.

యాత్ర యోగీశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః!
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ!!

ఏనాడు నీ జీవన రథం లోంచి కృష్ణుని తీసివేశావో ఆ నాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే!
‘అన్నయ్యా, ఇవ్వాళ కృష్ణుడు లేదు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణమును గురిపెట్టి కదులుతున్న చెప్పాను కొట్టాను. ఖాండవ వనమును దహించ డానికి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాను. 18 అక్షౌహిణుల సైన్యమును చీల్చి చెండాడాను. అన్ని చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధము చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఈవేలం మనం జీవచ్ఛవాలమై ఉన్నాము’ అన్నాడు.

ఈ మాటలను విని ధర్మరాజు ‘ఇంక మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడయితే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తరువాతి యుగానికి అవకాశం చూపాడు. కాబట్టి మనం ఉండవలసిన అవసరం లేదు’ అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు.

తానూ కట్టుకున్న సార్వభౌమ లాంఛనమయిన పట్టు వస్త్రములను, ఆభరణములను విడిచిపెట్టి, కేశ పాశములకు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనస్సులో పెట్టాను. మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకు వెళ్ళి అపానమనబడే మృత్యు వాయువు నందు పెట్టాడు. అపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమయిన శరీరమునందు పెట్టాడు. ఈవిధంగా ఇప్పుడు శరీరము పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమయిన సన్యాసమని అంటారు. ఇహ తను మాట్లాడడు. ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుట్టు విరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడి వెనుక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమయిన శరీరములోకి హోమము చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యమును పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీ దేవి. తన భర్తలు వెళ్ళిపోయిన తరువాత ఇంక తను ఉండకూడదని తానూ కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరమును విడిచి పెట్టేసింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను, ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులయిన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో, ఎవరు చదివారో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదారవిందములయందు భక్తిని కృప చేస్తాడు’ అని పోతన గారు అభయం ఇచ్చారు. ఆ ఘట్టం అంట మహోత్క్రుష్టమయిన ఘట్టం.

భాగవతం - 18 వ భాగం

భాగవతం - 18 వ భాగం

ధర్మరాజు వచ్చి విజయం కలగాలని ఆశీర్వదించమని అడుగగా భీష్ముడు ‘నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవమునకు పొంగిపోయాను. మీ అయిదుగురి జోలికి రాను’ అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడయిపోయాడు. చర్మమంతా ముడతలు పడిపోయింది. జుట్టు నెరిసిపోయింది. తన కళ్ళముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షమునకు సర్వ సైన్యాధిపతియై నిలబడ్డాడు. అపుడు ధర్మరాజు ‘తాతా, నీవు రానక్కరలేదు. కానీ నీకు స్వచ్చందమరణ వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనుస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో వుంటే ఎలాగా తాతా’ అని చేతులు నులిమాడు. ‘ఇప్పుడు ఆ విషయం అడగడం కొన్నాళ్ళు పోయాక కనపడు, చూద్దాం’ అన్నాడు భీష్ముడు. ‘మా యోగక్షేమములు మాత్రం దృష్టిలో పెట్టుకో తాతా’ అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.

భీష్ముడు రోజూ యుద్ధం చేసేవాడు. అనంతరము శిబిరమునకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి ‘నీవు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను. ఎంతమందిని చంపావు? ఏమి చేశావు? నువ్వు తలుచుకుంటే ఆర్జునుడిని చంపలేవా? నువ్వు కావాలని పాండవులను వెనక వేసుకు వస్తున్నావు. నువ్వు పాండవ పక్షపాతివి. అని సూటీపోటీ మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు భీష్ముడిని. పాపం భీష్ముడు, ఆ వయస్సులో అన్నిమాటలు విని ఒకరోజు దుర్యోధనునితో ‘దుర్యోధనా, ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కాని!’ అని మండలాకారమయిన ధనుస్సును పట్టుకున్నాడు.

ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్నివేల మందిని తెగటార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధమునకు పాండవులు గజగజ వణికి పోయారు. అర్జునుడిని భీష్ముని మీద యుద్ధమునకు పంపించారు. అర్జునుడు యుద్ధమునకు వహ్చ్చాడు. భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారధ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుస్సు పట్టనని ఏ విధమయిన అస్త్ర శస్త్రములను పట్టాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయమును దూతలు వచ్చి భీష్మునికి చెప్పారు. అపుడు భీష్ముడు ‘సర్వ సైన్యాధిపతిగా నేనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను’ అన్నాడు.

కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. అటువంటి కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఇపుడు ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆరోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనుస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఎందుకూ పనికిరాకుండా పోయాడు. భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది. కృష్ణుని మోదుగ చెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు ఏరులై కారిపోతోంది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మరచిపోయి భీష్ముడిని చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి క్రిందికి దిగిపోయాడు. అప్పుడు భీష్ముడు తన కోదండమును పక్కనపెట్టి కృష్ణుడికి నమస్కరించాడు.

పదిరోజుల యుద్ధం పూర్తయిన తరువాత ధర్మరాజుగారు కృష్ణుడిని పిలిచి అన్నారు ‘పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంక మనం యుద్ధం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు. అరివీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా?” అని కృష్ణ పరమాత్మని అడిగాడు. అపుడు కృష్ణ పరమాత్మ అన్నారు ‘దీనింకి ఒక్కటే పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరమునకు వెళ్ళి నమస్కారం చేసి, ఆయననే అడుగు, నేనూ మీతో వస్తాను. పదండి’ అన్నాడు.

అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజుగారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ‘ధర్మజా, ఇంత రాత్రివేళ పాదచారివై ఎందుకు వచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదయినా కోరుకో’ అని చెప్పాడు. అపుడు ధర్మరాజు ‘తాతా, నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాతా?’ అని అడిగాడు. ప్రపంచంలో ఇది ఎంత దారుణమయిన మాటో ఆలోచించండి. అపుడు భీష్ముడు ఒక నవ్వు నవ్వి ‘నా చేతిలో ధనుస్సు ఉన్నంత కాలం నేను మరణించను. మనవడు అర్జునుని ప్రజ్ఞచూసి అతను వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనుస్సును కొన్ని సందర్భములలోనే ప్రక్కన పెడతాను. రథం మీద స్త్రీవచ్చి, బాణం వేస్తే, ఎవరిదయినా పతాకం క్రిందికి జారిపోతే, వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకమూ క్రిందకు జారిపోదు. కాబట్టి మీకు ఉన్న అవకాశం ఒక్కటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. ఆ శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి. అపుడు శిఖండి బాణములు వేస్తే నేను ధనుస్సు పక్కన పెట్టేస్తాను. ధనుస్సు పక్కన పెట్టిన పిదప మరల నేను బాణం వెయ్యను. అపుడు వెనకనుండి అర్జునునితో బాణపరంపరను కురిపించి, నా శరీరమును పడగొట్టండి’ అని చెప్పాడు. అపుడు పాండవులు అలాగే తాతా అని చెప్పి వెళ్ళిపోయారు.

వెళ్ళిన తరువాత శిబిరంలో అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. ‘మహానుభావుడు, తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్నా అని మేము ఎవరిని పిలవాలో తెలియక మాపట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధపెడుతుంటే నాన్నా అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నను కాను నాన్నా నేను తాతను అని చెప్పి, ఆయన ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలములయందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తియై తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడి పోయాడు. అటువంటి వాడిని సవ్యసాచియై గాండీవం పట్టుకుని, శిఖండిని అడ్డుపెట్టుకుని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే, ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్యా?’ అని అడిగాడు. అపుడు కృష్ణుడు కొట్టక తప్పాడు. ధర్మం కోసం కొట్టవలసిందే. నీవు కొట్టు తప్పాడు’ అన్నాడు.

యుద్ధమునకు వచ్చారు. శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు. అపుడు భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. పెట్టిన తరువాత శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరు బాణములు వేశాడు. భీష్ముని కవచం దుళ్ళి పోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతేలేదు. భీష్ముని శరీరంలో బొటనవేలంత నందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే! మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపులనుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు. కాబట్టి ఒక్క తలవెనక మాత్రం బాణములు తగలలేదు. ఒంటినిండా బాణపరంపరను వేసిన తరువాత సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో భీష్ముడు రథం మీద నుంచి దుళ్ళి క్రింద పడిపోయాడు.

అలా పడిపోయినపుడు ఆయన శరీరం భూమికి తగలలేదు. బాణములతో పడిపోయి ఉండిపోయాడు. అప్పుడు యుద్ధం ఆపి అందరు పరుగు పరుగున భీష్ముని దగ్గరకు వచ్చేశారు. అపుడు భీష్ముడు ‘నాపని అయిపొయింది. నేను స్వచ్ఛంద మరణమును కోరాను. ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరమును విడిచిపెట్టను. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తరువాత, రథ సప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక, ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచి పెడతాను’ అని అర్జునుని పిలిచి, ‘నా తల వెనక్కి వ్రేలాడి పోతున్నది. నా మర్మ స్థానములు అన్నీ కదిలిపోతున్నాయి. బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది. నాకు తలగడ అమర్చు’ అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకు వచ్చారు. ‘ఈ తలగడలు కాదు. నాకు కావలసింది యుద్ధ భూమియందు పడుకున్న వానికి బాణములతో తలగడను ఏర్పాటు చేయాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు’ అన్నాడు భీష్ముడు. అపుడు అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడను ఏర్పాటు చేసుకుని ‘నేను ఈ యుద్ధభూమి యందే పడి వుంటాను. ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి’ అని కందకం తవ్వించుకుని ఆ భూమిమీద పడి ఉండిపోయాడు.

భాగవతం - 19 వ భాగం

భాగవతం - 19 వ భాగం

తరువాత కురుక్షేత్ర సంగ్రామం అయిపొయింది. ధృతరాష్ట్రుని పక్షం అంతా ఓడిపోయింది. పాండవపక్షం గెలిచేసింది. అప్పటికి కూడా భీష్ముడు అంపశయ్య మీదనే ఉన్నాడు. మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగింది. ‘దాహం వేస్తోంది’ అన్నాడు. నీళ్ళు పట్టుకు వచ్చారు. అంపశయ్య మీద పడుకున్న వాడు లౌకికమయిన జలములు త్రాగడు. ఏ నీళ్ళు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు. ‘అర్జునా, మంచినీళ్ళు ఇయ్యి’ అన్నాడు. అపుడు అర్జునుడు పర్జన్యాస్త్రమును ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోనుండి అమృతోదకం పైకిలేచి భీష్ముని నోటిలో పడింది. ఆ నీటిని త్రాగాడు. త్రాగి అంపశయ్య మీద పడి ఉన్నాడు. భీష్ముడు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో ‘భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు. నీవు బయలుదేరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, ఆయన దగ్గర ధర్మములు తెలుసుకో. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మరల ధర్మం చెప్పేవాడు లేదు’ అని చెప్పాడు. అయితే భీష్ముడు చెప్పిన ధర్మములు భారతంలో చెప్పారు తప్ప భాగవతంలో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే ఉత్తర గర్భం మీదికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భమును కృష్ణుడు రక్షించాడు అనే మాటను భీష్ముడు విన్నాడు. ఉపపాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనేమాటను విన్నాడు. విని భీష్ముడు కాలమును ముందు స్తుతి చేస్తాడు.

పదినెలలూ పూర్తీ అయిన పిమ్మట ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించాడు. అసలు యధార్తమునకు అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆవంశము ఆక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. కానీ ధర్మరాజు అంతటి వాడు తనకు వంశంలేదు అని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా, తనను తానూ రక్షించుకోవడం చేతకాని వాణ్ణి, గర్భాస్తమయిన పిండమును రక్షించాడు కృష్ణుడు. కృష్ణ భగవానుని అనుగ్రహము చేత బ్రతికింప బడి బయటకు వచ్చిన పిల్లవాడు కనుక అతనికి ‘విష్ణురాతుడు’ అని పేరు పెట్టారు.

పరీక్షిత్తు పుట్టిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజుగారు సభాతీర్చి ఉన్నారు. లేకలేక కలిగిన పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తన తొడమీద కూర్చోబెట్టుకుని, సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతీవాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించారు. అలా ఎందుకు చూస్తాడంటే ‘మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రము అనే అస్త్రం వచ్చి అగ్నిహోత్రమును వేదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ స్తోత్రం చేస్తే, ఎవరో ఒక అంగుష్ఠ మాత్రమయిన మూర్తి శంఖ చక్ర గదా పద్మములతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెదతాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడయినా కనపడతాడా’ అని సభలో చూసేవాడు. విష్ణురాతుడు అని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లాడిని ‘పరీక్షిత్’ అని పిలిచారు. అందుకని ‘పరీక్షిత్’ అయ్యాడు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు ఆ పిల్లవాని జాతకం చూసి ‘యితడు ఆమచంద్రమూర్తి వంశమునకు మొదటివాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానములు చేశాడో అటువంటి దానములు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువులను, బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణములను విడిచి పెడతాడో అలా బాణములను విడిచి పెడతాడు. కార్తవీర్యార్జునుడు వేయి చేతులతో ధనుస్సును పట్టుకుని బాణములను వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్టచివర శరీరం విడిచి పెట్టవలసిన సమయం ఆసన్నమయిన నాడు ఆవు పాలు పితికినంత సేపు తప్ప ఎక్కడా నిలబడని బ్రహ్మజ్ఞాని, ఈ పిల్లవాడి ఆర్తిచూసి కృష్ణ భగవానుని పాదములయందు బుద్ధి రమిస్తూ ఉండగా శరీరమును విడిచిపెట్టి, మోక్షమును పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమయిన వ్యక్తి మీ వంశంలో పుట్టాడు’ అని చెప్పారు.

ధర్మరాజు గారు పొంగిపోయారు. అప్పుడు అనుకున్నాడు. ‘నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను కొన్ని కోట్లమందిని తెగటార్చాను. ఎందఱో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చేయాలి. అశ్వమేధయాగమునకు కావలసినటువంటి సంభారములు, బంగారము ఎక్కడి నుండి వస్తాయి?’ అని భీమార్జునులను పిలిచి అడిగాడు. అపుడు భీమార్జునులు ‘అన్నయ్యా, దానిని గురించి నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. ఎందుచేత అంటే ఇతః పూర్వం ఉత్తర భారతదేశంలో మరుత్తు అనే రాజు అశ్వమేధ యాగం చేసి తత్సంబంధమయిన కాంచన పాత్రలు మొదలయిన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలనాధికారం ఉన్నది కనుక, ఆ ప్రాంతం మన పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది కనుక ఆ సంపదను సంభారములను మేము తీసుకువస్తాము. నీవు అశ్వమేధ యాగము చేయవలసింది’ అన్నారు.

ధర్మరాజు గారు మూడు అశ్వమేధ యాగములు చేశారు.ఆ యాగములకు కృష్ణ పరమాత్మను ఆహ్వానించారు. ఆయనను సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. తరువాత కృష్ణ పరమాత్మ ద్వారకా నగరమునకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్నవాళ్ళందరూ ఆయనను ఎంతో స్తోత్రం చేశారు. అక్కడ ద్వారకా నగరంలోని ప్రజలు స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు.
అక్కడ హస్తినాపురంలో అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు.

విదురుని ఆగమనము

ఒకరోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి తీసుకొని వచ్చాడు. తరువాత విదురుడు చక్కటి భోజనం చేశాడు. తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని అయ్యా మహానుభావా, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు. ఇది మా అదృష్టం. మీరు మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రిగారు మరణిస్తే, ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల క్రింద పెట్టుకుని కాపాడి తానూ తీసుకువచ్చి ఆహారమును నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్డామనుకున్నప్పుడు, అనేకమయిన ప్రయోగములు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు కోరుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఈ తీర్థములకు వేల్లాతో, ఏమేమి చూశారో మాకు చెప్పవలసింది’ అని అడిగాడు.

తీర్థయాత్ర చేసివచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తే ఇవతలి వాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రములలోని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతమును కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే వింటారు. భాగవతము విన ఫలితం వట్టినే పోదు.

 ధృతరాష్ట్రుని వానప్రస్థము

తరువాత ధృతరాష్ట్రుని దగ్గరకు వెళతాడు విదురుడు. ధృతరాష్ట్రునితో ‘నామాట విని ఉత్తర క్షణంలో లేచి ఉత్తర దిక్కుకి వెళ్ళిపో. ఎవరికోసం చూడకు. ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట జీవితం నీకు చాలు. ఇప్పటికయినా నామాట విను. వెళ్ళిపోయి ఈశ్వరునియందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆహుతి చెయ్యి. అలా యోగమార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నీవు చేసిన పాపములకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది’ అన్నాడు.

ధృతరాష్ట్రుడు ‘గొప్పమాట చెప్పావయ్యా! నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి? భీముడు మొదలయిన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటి కూడు తిని ఇంకా సంతోషంగా బ్రతికేస్తున్నానా? ఛీ నాకు రోత పుట్టింది వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.
అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు. భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ప్రతిరోజూ ఉదయం ధర్మరాజుగారు స్నానానుష్ఠానము లన్నీ పూర్తి చేసుకున్న తరువాత వచ్చి పెదతండ్రిగారయిన ధృతరాష్ట్రుడికి, గాంధారికీ తల తాటించి నమస్కరించేవాడు. ఆరోజుకూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురమునకు వచ్చాడు. ఆయన కనపడలేదు. ‘నావల్ల ఏదో అపకారం జరిగి వుంటుంది. నా పెదతండ్రి అంధుడు, వృద్ధుడు. ఆయన బిడ్డలు అందరూ మరణించారు. వీళ్ళ వలన ఇంకా సుఖ పడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో! నాకు చాలా బెంగగా ఉంది. గాంధారీమాత కూడా కనపడడం లేదు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు’ అని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు.                        

భాగవతం - 17 వ భాగం

భాగవతం - 17 వ భాగం

ఒకచోట అంబ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసిందని పేర్కొనడం జరిగింది. స్కందుడు ప్రత్యక్షమై ‘ఏమి నీ కోరిక’ అని అడిగాడు. అపుడు ఆమె ‘భీష్ముడిని నిగ్రహించాలి’ అని చెప్పింది. అపుడు ఆయన ‘అది నేను చెప్పలేను. భీష్ముడికి వరం ఉంది. చేతిలో ధనుస్సు ఉండగా ఆయనను ఎవరూ చంపలేరు. పైగా ఆయన మహాధర్మజ్ఞుడు. అందుకని నేను నీకొక పుష్పమాలను ఇస్తాను. ఈ పుష్పమాల మేడలో వేసుకొని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు’ అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మేడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందఱో రాజులను అడిగింది. అపుడు వాళ్ళు ‘మహాధర్మాత్ముడయిన భీష్మునితో మేము ఎందుకు యుద్ధం చేయాలి? ఆయనను ఎందుకు సంహరించాలి? ఆ మాలను మేము వేసుకోము. ఆయనతో యుద్ధం చేయము’ అన్నారు. అపుడు ఆమె మా మాలను ద్రుపద రాజుగారి ఇంటిరాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘ఏమికావాలి’ అని అడిగాడు. అంటే ‘భీష్ముడిని సంహరించాలి’ అంది. అపుడు రుద్రుడు ‘నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు. వచ్చే జన్మలో నీకోరిక తీరుతుంది. కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోవలసింది’ అని చెప్పాడు. అపుడు ఆమె యోగాగ్నిలో శరీరమును వదిలివేసి మరల పుట్టింది.

ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదయి పుడితే భీష్ముడు యుద్ధం చేయదు. అందుకని మగవాడిగా మారాలి. అందుకని మరల తపస్సు చేసి మగవానిగా మారింది. అందుకే ‘శిఖండి’ అని పేరు పెట్టారు. అందుకే ఎవరయినా ఎంతకీ వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారనుకొండి – అపుడు వీడెక్కడ దొరికాడు రా నాకు –శిఖండిలా దొరికాడు’ అంటాము. శిఖండి వెనుక అంత కథ ఉంది. శిఖండి ద్రుపదుని కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలో చేరాడు. మహానుభావుడు భీష్ముడు తన జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నాడు. ఇంత కష్టపడి విచిత్ర వీర్యునికి అంబిక, అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమయిన కొంతకాలమునకు విచిత్ర వీర్యునికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అంబిక, అంబాలిక విధవలు అయిపోయారు. వంశము ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీ దేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు. మనవలూ లేరు. వంశం ఆగిపోయింది. అపుడు సత్యవతీ దేవియే భీష్ముడిని పిలిచింది. ‘భీష్మా, వంశము ఆగిపోయింది. యుగ ధర్మముననుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళు అయినటువంటి అంబిక, అంబాలికలయందు వాళ్ళు ఋతు స్నానము చేసిన తరువాత నీవు వారితో సంగమించు. అలా సంగమిస్తే మరల వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా చేయడంలో దోషం లేదు.

అపుడు భీష్ముడు –‘అమ్మా, నేను ఆనాడు ప్రతిజ్ఞచేశాను. నేను ఏ స్త్రీయండు కూడా అలా ప్రవర్తించను. నేను బ్రహ్మచర్య నిష్ఠయందు ఉన్నవాడను. అందుకని వంశము లేకపోతే నేను ఏమీ చేయలేను. కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్కటే పరిష్కారం. ఎవరైనా బ్రహ్మ జ్ఞాన సంపన్నుడై, కేవలం వర కటాక్షం కోసమని సంగామించడం తప్ప శరీరమునందు అటువంటి కోర్కె లేని ఒక బ్రాహ్మణుని ఒక బ్రహ్మ జ్ఞానిని వేడుకో’ అన్నాడు. అపుడు సత్యవతీ దేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. తరువాత వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించడం జరిగింది. ధృతరాష్ట్రునకు దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకి పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాకుతూ తాతగారయి గడ్డాలు నెరిసిపోయి మహా ధర్మజ్ఞుడయి భీష్ముడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యులను గురువుగా పెట్టి ఆ వంశమును సాకుతూ నడిపిస్తున్నాడు.

ఆయన కళ్ళముందే పాండురాజు పుత్రులకు ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య బ్రహ్మాండమయిన కలహం బయలుదేరింది. అపుడు ఇంత ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అన్నాడనుకోండి అపుడు అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుని ఈ ఇద్దరిని చూసుకుని యుద్ధమునకు దిగాడు. సర్వసైన్యాది పత్యం ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది. భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం తానసలు యుద్ధ భూమికి రానన్నాడు కర్ణుడు.

భీష్ముడు ఎన్నోమార్లు ధర్మం చెప్పాడు. ‘అర్జునుని ఎవరూ గెలవలేరు. పాండవుల పట్ల ధర్మం ఉన్నది, వాళ్ళు నెగ్గుతారు’ అని. అటువంటి భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకును వ్రేలాదవలసిన అవసరం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి వుంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా! భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? అలాంటి భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బానములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ’ అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. భీష్ముడిని అన్ని బాహాములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు.

అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచములో దేనికయినా ఆలంబనము ధర్మమే! భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రీడ జరుగుతోంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరానుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అనిన తరువాత, ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయినా తరువాత శకునికి గుర్తువచ్చింది ‘నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆవిడని ఒడ్డు’ అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు ‘దౌపదిని ఒడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి వెళుతుంది కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు. ఇప్పుడు నాకు శకుని యజమాని. నేను అయన దాసుడిని. దోషం ఆయనకీ వెడుతుంది’ అనుకుని ధర్మరాజు ద్రౌపదికి ఒడ్డి ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయిన ద్రౌపదీ దేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడ్చాడు. ఊడుస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది. ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసినది’ అని అడిగింది. అపుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డె అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీ దేవి శపిస్తే, ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ’ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమూ అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపదీ’ అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణము నందు వైక్లబ్యమే! ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణములతో కొట్టారు. ధర్మాచరణము అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి!

ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధమునకు వచ్చాడు. దుర్యోధనునితో ఒకమాట చెప్పాడు. ‘నీవు పాండవులవైపు ఉన్న వాళ్ళలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను. కానీ పాండవుల జోలికి మాత్రం వెళ్ళను’ అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహా అని నమస్కరించాడు. ‘తాతా, మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్ళం. మాకు విజయం కలగాలని ఆశీర్వదించు’ అన్నాడు.

అపుడు భీష్ముడు ‘నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవమునకు పొంగిపోయాను. మీ అయిదుగురి జోలికి రాను’ అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడయిపోయాడు. తన కళ్ళ ముందు తనవాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షమునకు సర్వసైన్యాధిపతియై నిలబడ్డాడు. అపుడు ధర్మరాజు ‘తాతా నీవు రానక్క రాలేదు. కానీ నీకు స్వచ్ఛందమరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనుస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో వుంటే ఎలా తాతా’ అని చేతులు నులిమాడు. ‘ఇప్పుడు ఆ విషయం అడుగకు. కొన్నాళ్ళు పోయాక కనపడు. చూద్దాం’ అన్నాడు భీష్ముడు. ‘మా యోగక్షేమములు మాత్రం దృష్టిలో పెట్టుకో తాతా’ అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.

భాగవతం - 15 వ భాగం

భాగవతం - 15 వ భాగం

శంతన మహారాజు పెరిగి పెద్దవాడయిన తరువాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒకమాట చెప్పాడు. ‘నేను ఒకప్పుడు గంగాతీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడి తొడమీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకుంది. నిన్ను నా కోడలిని చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను. అందుకని గంగాతీరములో మెరుపు తీగవంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు’ అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు.

శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటాడదానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతికోసమని గంగాతీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అనినమ్మి ఆవిడను వివాహం చేసుకోవదానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడ అంది – ‘నేను నీకు భార్యను అవుతాను. కానీ నాదొక షరతు’ అంది. ‘ఏమీ నీ షరతు’ అని అడిగాడు శంతనుడు.

నే ఏపని చేసినా ఆడ శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పనిచేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురుచేపుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను’ అంది.
శంతనమహారాజు బాహ్యసౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహు అందగాడు. అందునా పెద్దకొడుకు. మొట్టమొదట పుట్టిన వాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టీ పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండు చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది. అనగా ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. ఏడుగురు వసువులకి ఆవిడ మరల స్వస్తితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విదిచిపెట్టేసింది. శంతనుడు గంగంమకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. ఊరుకున్నారు.

అలా ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాదు ఏడు సార్లు అయిపొయింది. ఏడుగురు కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. ఎనిమిదవసారి మహా తేజోవంతమయిన కుమారుడు జన్మించాడు. ఎనిమిదవ మారు ఆ బిడ్డను తీసుకుని గంగవైపు వెళ్ళిపోతోంటే ఆయన అన్నాడు – ‘ఛీ రాక్షసీ! ఎవరయినా మాతృత్వమును కోరుకుంటారు. నీవేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు. ఇప్పడు ఈ పని ఎనిమిదవ మాటు చేస్తున్నావు. ఇంక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలులేదు’ అన్నాడు.

అప్పుడు గంగమ్మ నవ్వి అంది – ‘నువ్వు నేను చేసినపనికి ఎప్పుడు అడ్డుపెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డుపెట్టావు. అందుకని నేను వెళ్ళిపోతాను’ అంది. ‘నీవు వెడితే వెళ్ళిపో. నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు’ అన్నాడు. అంటే ఆవిడ అంది – ‘అది కుదరదు. నీకొడుకు కాదు. అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా! నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు. నేను ఏడుగురు వసువులకి సహజస్తితిని ఇచ్చాను. వీడు ఎనిమిదవవాడు. వీడు బతకాలి. వీనిని తీసుకువెళ్ళి వసిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమయిన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెప్పుతాను. అప్పటి వరకు వీనిని నాదగ్గర ఉంచుకుంటాను’ అని చెప్పి కొడుకును తీసుకుని గంగమ్మ గంగాలోకి వెళ్ళిపోయింది.

తరువాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం ఎలుతున్నాడు. వేటకి వెడుతున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. గంగమ్మ చెప్పిన మాట మరచిపోయాడు.
ఒకనాడు గంగాతీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యౌవనంలో వున్న వ్యక్తి అద్భుతంగా బాణ ప్రయోగం చేయడం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. ‘నాకొడుకు కూడా వుంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడు’ అని బాబూ నీవెవరు ఏమిటి’ అని ఆరా తీశాడు. అపుడు గంగమ్మ వచ్చి ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఈయన గాంగేయుడు. గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధములుగా రాశీ భూతమయిన రాజనీతిజ్ఞుడు. ధర్మమూ తెలిసి ఉన్నవాడు. పైగా విలువిద్యా నేర్పరి. నీ కొడుకును నీకు అప్పజెప్పుతున్నాను’ అని ఆ కొడుకును ఆయనకు అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది.
అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఏంటో సంతోషంతో ఉన్నాడు. సభచేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి.

ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీ దేవి యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినపుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోటునుండి ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగాతీరంలో పడవమీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది.
శంతనుడు సత్యవతీ దేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. ఆవిడ అంది – ‘ నేను స్వేచ్ఛా విహారిణిని కాను. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకు వెడుదువుగాని. నా తండ్రి అనుమతి తీసుకోనవలసినది’ అని చెప్పింది.
అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనుని చూసి దాశరాజు వంగివంగి నమస్కారములు చేసి ‘అయ్యా, మీకు నేను ఏమి చేయగలవాడను’ అన్నాడు. అపుడు శంతనుడు ‘నీ కన్యకా రత్నమును నాకు ఈయవలసింది’ అన్నాడు. అప్పుడు దాశరాజు – ‘నాకూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా?” అని అడిగాడు. అపుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్దకొడుకు ఉన్నాడు. అతడు మహానుభావుడు. ధర్మజ్ఞుడు. గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీ దేవి కోసం తను కొడుకును ఎలా విడిచి పెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

కానీ శంతనుడికి సత్యవతీ దేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్రపట్టడం లేదు. ఆహారం తీసుకోవడం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి ‘నాన్నగారూ ఏమయింది’ అని అడిగాడు. ఈ విషయమును సూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితె ‘మీనాన్న గారికి ఈ వయస్సులో మరల వివాహం మీదికి మనస్సు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాశరాజు ఒక నియమం పెట్టాడు’ అని ఆ విషయములను తెలియజేశారు.

అపుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ‘అయ్యా మీ కుమార్తె అయిన సత్యవతీ దేవిని మా తండ్రిగారికి ఇచ్చి వివాహం చేయండి’ అని అడిగాడు. అడిగితె దాశరాజు అన్నాడు – తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా?’ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ‘ తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యమును పరిత్యాగం చేసేస్తున్నాను. నేను రాజ్యం తీసుకొను. మానాన్నగారి కోర్కె తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి’ అన్నాడు. అపుడు దాశరాజు ‘ఇప్పటివరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమ వంతుడవు. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంట పరాక్రమ వంతుడయిన నీ కొడుకు సత్యవతీ దేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదనీ ఏమిటి హామీ?” అని అడిగాడు.

అపుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞచేశాడు. ‘నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవమును, తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత! మా తండ్రిగారి కోసం నేను భీష్మమయిన ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అన్నాడు. అది సామాన్యమయిన ప్రతిజ్ఞకాదు. వృద్ధుడయిన తండ్రికోసం ఇటువంటి ప్రతిజ్ఞచేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుభులు మ్రోగి పైనుంచి పుష్ప వృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞచేశాడు కనుక ఆ రోజునుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు.

ఈ విషయమును తండ్రిగారయిన శంతన మహారాజు విని తెల్లబోయాడు. ‘నీవు నాగురించి ఏంటో త్యాగం చేశావు. అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను. ఒకటి – యుద్ధభూమిలో నీవు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండు – నీకు మరణము లేదు. స్వచ్ఛంద మరణమును నీకు ప్రసాదిస్తున్నాను. మరణము నీవు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు’ అని.