Search This Blog

Monday, September 17, 2018

భాగవతం - 6 వ భాగం

భాగవతం - 6 వ భాగం

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన!
విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేతపరతు!!

ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి! భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. కానీ ’మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన దానిని, నాకు శారదాదేవి ఏది కృపచేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఆయన అంటారు –

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కని గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.

’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఎన్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికి దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యే అని ఏడిచేటటుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.
’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి
చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.
ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.
’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.
అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు. మీరు అస్తమానూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి? ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును ఇచ్చారు.

సేకరణ:
సందేపూడి తిరుమల రావు

భాగవతం - 5 వ భాగం

భాగవతం - 5 వ భాగం

పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!

పోతనగారి శక్తి ఏమిటోపోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.

పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెట్టే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –

’కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా దింభకున్’

అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో

’కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’

ఎదురుగుండా ఉన్న భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టాము అనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు. కాబట్టి ఇపుడు శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ ఎందులోంచి వచ్చాయి? అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. కాబట్టి ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.

పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. ’ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చివేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యం పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి ’మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. తరువాత కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంతగొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. అదీ పోతనగారంటే! మహానుభావుడు అంత నిరాడంబరుడు


సేకరణ:
సందేపూడి తిరుమల రావు

భాగవతం - 4 వ భాగం

భాగవతం - 4 వ భాగం

శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాదు – ’ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు’ అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు. పడితీరుతుంది. ధ్రువుడంతటివాని శరీరం పడిపోయింది. ఎవని శరీరం అయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు. ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి ’నేను’ అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. ’నేను’ అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది. మరణభయంలో సమస్తమయిన అజ్ఞానం ఉంది. అవిద్య ఉంది. భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యమును పట్టుకో. అది అంత తేలికయిన విషయం కాదు. భాగవతమును వినినివాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.

ఏడురోజులు భాగావతమును వినిని పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. – ’శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను’ అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము. ’మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ (సౌందర్యలహరి – 97) అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా మాయలో తిరుగుతూనె ఉన్నాము. ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది. అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలు అంటారు –

’నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’

భాగవతమును వినేవాళ్ళు ’భాగవతమును నేను వింటున్నాను” అని ఎప్పుడూ వినకూడదు. ’పిబత భాగవతం’ – భాగవతమును తాగేసెయ్యి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి.కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి – అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ వున్నారు నోరు పుచ్చుకోను అనదు. పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలొ సాధారణంగా మీరు తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూదా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం?

వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమయిన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తననోటిద్వారా ప్రవచనం చేశారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది.

ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారు.
వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉంది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం
వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి అవతలపారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు.

పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒకమాట వింటూ ఉంటాము – ’ఏదోనండి, రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడండీ ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండీ – కుదరడం లేదు – నాకూ చదవాలని ఉంటుంది’ అంటూ ఉంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనం చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరినదిలో స్నానం చేసి ఒకసైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. ’పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి’ అన్నారు. వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు – ’అయ్యా మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!’

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
బలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా?

ఎంత వినయముతో చెప్పారో చూడండి! ’నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను” అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి!

సేకరణ:
సందేపూడి తిరుమల రావు

భాగవతం - 3 వ భాగం

భాగవతం - 3 వ భాగం

భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహేడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ‘ఎక్కడో ఏదో చెయ్యడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది’ అని అనుకున్నారు.

ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. ‘వేదరాశినంతటినీ విభాగం చేశాను. పదిహేడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది’ అని ఆలోచన చేశారు.

ఆ ఆలోచన చేసినపుడు మహానుభావుడు నారదుడు దర్శనం ఇచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడూ నారదుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడూ నారదుడే. ‘నారం దదాతి ఇతి నారదః’ – ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒకమాట చెప్పారు. ‘వ్యాసా, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో, ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు. భారతమును రచించావు. కానీ భారతంలో కృష్ణకథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతేతప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతున్నదో విశ్వము ఎలా సృష్టించబడిందో పంచభూతములు ఎలావచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై స్థితికర్తయై, ప్రళయ కర్తయై ఈలోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆకారణం చేత నీమనస్సులో ఎక్కడో చిన్నలోటు ఏర్పడింది. ఇది పూర్తిచేయడానికి నీవు భాగవత రచన చెయ్యి’ అని ప్రబోధం చేశారు.

అపుడు వ్యాసభగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత, ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తనజన్మ సార్ధకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మలనుండి మనస్సు ఏది పట్టుకొనక పోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్ధకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు.

అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు.అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగినవ్యక్తి. అందుకని తన కుమారుడయిన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు.

ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –

‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి’

నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను ఉంది మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునండు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.

సేకరణ
సందేపూడి తిరుమల రావు

భాగవతం - 2 వ భాగం

భాగవతం - 2 వ భాగం

మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు.

పురాణ వాజ్ఞ్మయమునంతటిని కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుకచేతనే అపారమయిన జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే – ఆయన మంచి నిండు యౌవనములో ఉండే రోజులలో తండ్రిగారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు వివాహం అక్కరలేదు...ఈలోకం అంతా దుఃఖభూయిష్టమయిపోయింది. నేను ఆనందమును అనుభవించాలి. అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను’ అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకనుంచి వ్యాసుడు పుత్రునిమీద వున్న కాంక్షచేత ‘హాపుత్రా హాపుత్రా’ అని అరుస్తూ వెంటవస్తున్నారు. శుకుడు ‘ఓయ్’ అనలేదు. అంతటా ఆత్మతత్త్వమును చూడడానికి అలవాటయిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో వున్న చెట్లు అన్నీ ‘ఓయ్ ఓయ్’ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యౌవనమునందే ఒంటిమీద బట్టలేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు.

శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్కనుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటిమీద వస్త్రం కట్టుకోకుండా లేచివచ్చి శుకునికి నమస్కరించారు. అపుడు శుకుడు నిండు యౌవనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అపుడు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కుమారుడు యౌవనంలో ఉన్నాడు. నేను వార్ధక్యమునందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి ఈ తేడా’ అని వ్యాసుడు అప్సరసలను అడిగారు. అడిగితే అప్సరసలు అన్నారు – ‘నీ కుమారునికి స్త్రీ పురుష భేదము తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీపురుష భేదము తెలుసు. అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము’ అని బదులు చెప్పారు. అదీ శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే!

శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరోకరిచేత చెప్పించకుండా శుకునిచేత మాత్రమే చెప్పించారు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్ధత చూశాడు. ‘కుశ’ అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంత సేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే – కర్మ చేయగా చేయగా ఇంటిని తుడుచుకుకుని తుడుచుకుని బూజులన్నీ దులుపుకుని పండగ వచ్చే ముందు శుభ్రపరుపబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చొనడానికి, సత్కర్మాచరణమును పూనికతో సంతోషముతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధియందు ఆనందప్రదమయిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానివలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానముచేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేదానికి దర్భాలతో సంబంధం ఉంది. తిరగేస్తే – ‘శుక’ అయింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణము లేదు. అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యడానికి కర్మలేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడు. ఆయన ఇరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు. బ్రహ్మముతో కలిసిఉంటాడు. బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనందస్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన ‘కౌపీనపంచకము’ అని ఒక పంచకము చేశారు. అందులో – ‘అసలు కౌపీనము పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ వున్నాడు’ అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగియై ఈశ్వరుని పాదారవిందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వానికి ఇంద్రపదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు.

అటువంటి మహానుభావుడయిన శుకుడు నిరంతరమూ ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదయినా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవుపాలు పితకడానికి ఎంతసమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు వాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడయినా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి, వీరు ఫలానా వీరు ఫలానా అని గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ లోపలపెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమము తగ్గిపోయి లోకముతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని ఏడురోజులు భాగవతములు ప్రవచనము చేశాడు.

సేకరణ
సందేపూడి తిరుమల రావు

Bhagavatham - compiled by Sandepudi Tirumala Rao

భాగవతోత్తములకు అందరికి
జై శ్రీ రామ్-జై శ్రీ కృష్ణా...
ఈ రోజు  నుండీ భగవంతుని అవతారాల ప్రయోజనం శ్రీ భాగవతం గురించి అధ్యయనం మొదలుపెడుతున్నాం...

ఆ సర్వేశ్వరునికి శతకోటి ప్రణామములూ..

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

భాగవతం - 1 వ భాగం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.

వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విదివిదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.

పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమినిచేత వెతమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.

‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ!
వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం!!

పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశాములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధంగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రమునొకదానిని పెద్దలు ప్రతిపాదించారు.

‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!

‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!! (దేవీభాగవతం 1-3-21)
మద్వయం – మకారంతో రెండు పురాణములు ప్రారంభంఅవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము.
భద్వయం – భ తో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణము, భవిష్య పురాణము.
బ్రత్రయం – బ్ర’ తో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము.
వచతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహపురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము.
అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క  అక్షరమునకు ఒక్కొక్క పురాణం వస్తుంది.
అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.
వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.(సశేషం)

Saturday, January 14, 2017

శ్రీమద్భాగవతం - 101 వ భాగం

శ్రీమద్భాగవతం - 101 వ భాగం

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందఱో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో.
యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమము అయి వున్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.
కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు. నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు. ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది. తదనంతరం కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తె తలలోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఎ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడో ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనం యిచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు యిక నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. అపుడు కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.
దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవదమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు. అపుడు కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.
యాదవుల అంతమొందుట
ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన యినప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపొయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటె వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడ గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉంది, పాశుపతాస్త్రం ఉంది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు. అపుడు ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం యిక ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.
ఫలశ్రుతి :
కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం యిస్తున్నాను’ అన్నారు. అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాటపట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండలకర్ణముల్ మదేభగతియు నీలవేణియుఁ గృపారస దృష్టియుఁ గల్గు వెన్నుఁ డిమ్ముగఁ బొడసూపుఁ గాత గను మూసిన యప్పుడు విచ్చు నప్పుడున్.
‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండు నరుడు లోకులు వొగడన్!!
‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో యిది వినిన వాళ్ళకి ఇది వ్రాసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో వున్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.
అందరూ భాగవతం చదివి ఆనందించండి. ఇంత మంచి భాగవతం చక్కగా చెప్పిన గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి మా పాదాభివందనాలు.
* భాగవతం పూర్తయ్యింది **
" సార్వజనీనమైన సెలవు "
""ఓమ్ శాంతి శాంతి శాంతిః ""