Search This Blog

Sunday, January 8, 2017

శ్రీమద్భాగవతం – 96

శ్రీమద్భాగవతం – 96
కుచేలోపాఖ్యానం

శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. కృష్ణుడికి తెలియకుండా ఒకరోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వరం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసులవారు, పోతనగారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడయిన శుకుడు అభిమన్యుని కుమారుడయిన పరీక్షిత్తును చూసి ‘ఓరాజా! ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెపుతాను విను’ అని కుచేలుని గురించి చెప్తున్నాడు.కుచేలుడు అపారమయిన మానాభిమానములు కలిగిన వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచి పెట్టిన వాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్న వాడు. విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరమూ బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహాయిష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీలేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. గోవింద సఖుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి ‘కృష్ణా, నాకు సహాయం చేస్తావా’ అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తానుకూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మమూ తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒకరోజున భర్తతో అంది ‘మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు. నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పదిమాట్లు ఆకలేస్తోంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేక పోయానే అని అమ్మ బాధ పడుతుందేమోనని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకున్తున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా. మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్లి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా యిస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి. పిల్లల కోసమయినా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది’ అని చెప్పింది.భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు ‘పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళలేము కదా! స్నేహితుడికి ఏదయినా కానుక పట్టుకెళ్ళాలి కదా! ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మనింట్లో ఏమి కానుక ఉంది?” అని అడిగాడు. అపుడు ఆవిడ “మనకి ఉన్నదే మనం యిద్దాము. మన యింట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టి యిస్తాను తీసుకువెళ్ళండి’ అన్నది. కుచేలుడి జీవితకాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరుపెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము. కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని బార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడి వేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో, రథములనుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి, చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సఖుడయిన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న యింటిని తెలుసుకున్నాడు. యింటిముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తు పడతాడో పట్టాడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక యిచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి యివ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి యిపుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు. భటులు ‘ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అపుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ వున్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్లి కృష్ణ పరమాత్మతో ‘అయ్యా మీకోరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు’ అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంతదూరంలో చూసి ‘కుచేలా ఎప్పుడు వచ్చావు?’ అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా ఎన్నాళ్ళకు చూశానయ్యా నిన్ను లోపలికి రావలసింది’ అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీ దేవి, తానూ తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంస తూలికా తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్ళు తెప్పించి ఆయన కాళ్ళకింద పళ్ళెం వుంచి ఆదిలక్ష్మియైన రుక్మిణీదేవి నీళ్ళు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్ళు పోస్తుండగా, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమయిన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్ళు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తలమీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు.ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటినిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీ దేవి తెల్లబోయింది. ఆమె కూడా తామరపువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేదతీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం యిచ్చాడు. తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు.ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁడీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?ఏమి ఆశ్చర్యము! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందఱో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకానీ ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహా యోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం యింతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దానిమీద కూర్చోవడమా! అసలు ఈయన ఎవరు? అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు.అపుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమా! నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలాకాలం వేదం నమ్ముకును వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. అవునా?” అని అడిగాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆరోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేక పోతున్నాడు. కుచేలా ఎవరి దగ్గరికయినా వెడితే ఏమయినా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు?” అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గు పడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి యిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేలా, చాలా ఐశ్వర్య వంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి యిచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, కొబ్బరి నీళ్ళను గాని ఎవరయినా భక్తితో తెచ్చి యిస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీత వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను. అని కుచేలుని వద్ద ఉన్న అతుకుల మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు. అలా పోసుకునే సరికి 14 భువనభాండములలో వున్న సమస్త జీవరాసుల కడుపునిండి బ్రేవుమని త్రేన్చాయి. కృష్ణుడికి యింకా ప్రీతి ఆగక మరియొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని, కృష్ణా, మీరు తిన్నది చాలు. యిహలోకమందు పదితరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకచాలు’ అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు.పరమాత్మ కుచేలుడు యిచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు. తాను యింత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు.కుచేలుడు తెల్లవారు ఝామున లేని మరల తనకి వున్న మాసిపోయిన దుస్తులనే ధరించి ‘కృష్ణా, నేను వెళ్ళివస్తాను’ అని చెప్తే కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు. కుచేలుడు తన యింటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యం. ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్లమంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా. నేను తెచ్చిన అటుకులు తిన్నాడా. నా సఖుడిది ఏమి సౌజన్యం. నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కానీ అలా యివ్వలేదు’ అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడయిపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండి పోయేటట్లు నాకు వరమును యిచ్చాడు. అని అనుకున్నాడు. తన ఇల్లు ఉన్నచోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది. ఆ సౌధమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటుఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఎ మహాపురుషునిదో తన పూరి యింటి స్థానంలో అత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు.ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు. అది తన యిల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురువచ్చి భర్త కాళ్ళకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామి కృప వలన యిలా అయిపొయింది అని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును యిచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు యింట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించి పోతూ యిహము నందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి, అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు.ఇంట పరమపవిత్రమయిన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది. ఎవరు దరిద్రుడయిన కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టి ఈ ఆఖ్యానమును వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదములయందు భక్తికలిగి, వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మోక్షమును పొందుతారు” అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.

శ్రీమద్భాగవతం – 95

శ్రీమద్భాగవతం – 95
ధర్మజుని రాజసూయ యాగము

రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. కర్ణుడికి ఒకరికి దానం యివ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధా భక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు. పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి. వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారుచేయించమని తమ్ముడయిన భీమసేనునికి పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే యింటి యజమాని వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యతా కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు. యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు. వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు. భోజనపంక్తిలో రుచులూరించే పదార్థములను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలాఅంత అందంగా రాజసూయ యాగ క్రతువు జరిగింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు. ఇపుడు సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందఱో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందఱో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు వున్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. అపుడు వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి ‘అన్నయ్యా, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి అన్నయ్యా ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశాములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు యివాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయన యిక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి’ అన్నాడు.ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంత జ్ఞానియో సహదేవుడు చూడండి. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారు వన్నె గల వస్త్ర ద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కానీ మూడిన వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. అపుడు శిశుపాలుడు లేచి “ఈయన గోపాలుర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది యితడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది యితడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఈయన కులం తెలియదు. ఈయన గోత్రం తెలియదు. వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రామించాడో. ఎంతమందితో తిరిగాడో. ఇది నడువడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరుగని వాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా! సభలో వీనికన్నా తగినవారు లేరా! కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను యిప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను’ అని తన గదాదండము తీసుకుని కృష్ణుని మీదకు వెళుతున్నాడు.కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రమును స్మరించి ఆ చక్రమును శిశుపాలుని మీదికి ప్రయోగించారు. అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి. నూరు తప్పుల వరకు కాపాడతానని మేనత్తకు మాట యిచ్చాడు. ఇప్పుడు శిశిపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తి అయిపోయాయి. సుదర్శన చక్రమును ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్ను ముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తదనంతరం పాండవులందరూ అవబృథ స్నానమును చేశారు. యాగము అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవబృథ స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరమునకు చేరుకుంటున్నారు.శ్రీకృష్ణుడు సాళ్వుని, దంతవక్త్రుని చంపుట ఈలోగా సాళ్వుడు అనబడే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమయిన తపస్సు చేశాడు. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. పరమశివుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. అపుడు సాళ్వుడు తన యిష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరశివుని కోరాడు. అపుడు పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానమును నిర్మింపజేసి సాళ్వునికి యిచ్చాడు. ఆ విమానమునకు సౌభకము అని పేరు. ఆ విమానమును ఎక్కి ద్వారకా నగరం మీదకి వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపుర కుడ్యములను, గోపురములను తన గదా దండంతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్దమును ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనపడ్డాయి. రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్లు సాళ్వుడు కూడా మాయా వసుదేవుడిని సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుడిని సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటివారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలా ఖిన్నులయారు. కానీ మిగలిన వాళ్ళు ‘ఇది జరిగేది కాదు – వసుదేవుడు లోపలే ఉన్నాడు’ అని చెప్పారు. అప్పుడు ఆయన సుదర్శన చక్రమును ప్రయోగిస్తే సాళ్వుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తునియలు అయిపొయింది. తదనంతరం దంతవక్త్రుడు వచ్చాడు. వీడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. శిశుపాల దంతవక్త్రులిద్దరూ మరణించిన తరువాత వారిలో వున్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. గతంలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకులయిన జయవిజయులకు ఇవ్వబడిన శాపం చేత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి కాబట్టి ఈ జన్మలో వారు శిశిపాల దంతవక్త్రులుగా జన్మించి వారిరువురూ శ్రీకృష్ణ పరమాత్మచే సంహరింపబడి ఆయనలో లీనమయిపోయారు.

Friday, January 6, 2017

శ్రీమద్భాగవతం -- 94 శ్రీకృష్ణుని_మహిమ_నారదుండరయుట

శ్రీమద్భాగవతం -- 94🌹#శ్రీకృష్ణుని_మహిమ_నారదుండరయుట🚩

నారదమహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో ‘నారదా, కృష్ణుడు 16వేలమందిని పెళ్లి చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా?” అని అడిగారు. అప్పుడు ఆయన 16వేలమందిని ఎన్ని రోజులు పెళ్ళి చేసుకున్నాడు?” అని అడిగాడు. ఆయన నరకాసురుడి మీదికి యుద్ధమునకు వెళ్ళినపుడు నరకాసురుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచిన 16వేలమంది రాజ కుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి 16వేలమందికి 16వేల సౌధములు నిర్మించి 16వేలమందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16వేలమంది కృష్ణులై తాళి కట్టారట’ అన్నారు. ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా జరుగుతుంది? అన్నాడు. అనగా అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునాకు గురి అయ్యారో చూడండి. తాళి అయితే కట్టాడు. మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు? అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరకు బయల్దేరి భూలోకమునకు వచ్చాడు. ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉంది. ఆ నగరంలోని ఒక యింట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న 16వేలమంది స్త్రీలలో ఒకస్త్రీ గృహం. ఆవిడ తామర పూవువంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానునికి విసురుతోంది. భార్యచేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదా మని వెనక్కి వెళ్ళిపోబోతుండగా అటు తిరిగి కూర్చుని సేవలందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా! లోపలికి రండి. మీరు నాతొ ఏదయినా పని ఉండి వచ్చారా? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని ఔదల దాల్చి చేయడానికి ఈ సేవకుడు మీ దగ్గర సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ ’ అన్నాడు. అపుడు నారదుడు ‘కృష్ణా! మహానుభావా! దామోదరా నీవు భక్తులపాలిట సర్వ కాలముల యందు కల్పవృక్షము వంటి వాడివి. దుష్ట జనులను నిగ్రహించడానికి నీవు యిటువంటి అవతారములను స్వీకరిస్తావు. ఏ నీ పద సేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరమూ నా మనస్సు వశించి ఉండే వరమును నాకు యీయవలసినది’ అని నారదుడు కృష్ణుని అడిగాడు. తరువాత బయటికి వచ్చి ఈ యింట్లో ఉన్నాడు కాబట్టి పక్క యింట్లో ఎలా ఉండగలడు అనుకుని ఆ యింట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క యింట్లోకి వెళ్లి యిలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలాగే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెడితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురమునందు నిలబడిన నారదుడు అన్నాడు – ఏమి నా ఆశ్చర్యము! ఏమి నా ఆనందము! ఏమి కృష్ణ పరమాత్మ! మహానుభావుడు యింతమందితో రమిస్తున్నాడు. ఎలా? ఏకకాలమునందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కాని, అపవిత్రత కాని తనకి అంటనట్లు సూర్యకిరణములు బురడమీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు యిన్ని ఇళ్ళల్లో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు’ అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.
ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమయిన సంసార రీతి. దీనివలన మనకు ఏమి తెలుస్తున్నది? కృష్ణ పరమాత్మ 16వేలమంది కన్యలను మదము చేత చేసుకున్న వాడు కాదు. వారిని ఉద్ధరించాలని చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వమును, విష్ణు తత్త్వమును ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడు చేష్టితములను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వారము! ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాప కత్వము ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం యిచ్చారు. ఎవరయితే పరమభక్తితో కృష్ణ భగవానుని సంసారమును నారదుడు చూసే ప్రయత్నము చేసి తాను ఆనందించిన కథా వృత్తాంతమును విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో, వారియందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుడిని తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమునందు అపారమయిన ధనమును పొంది పశు, పుత్రా మిత్ర వనితాముఖ సౌఖ్యములన్నిటిని అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఆ ఆఖ్యానమును పూర్తిచేశారు.భీముడు జరాసంధుని వధించుటఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు. అపుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. ‘అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేకమంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమయిన హింసలు పొందుతున్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించ వలసినది’ అని కోరాడు. ఆమాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి ‘తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము’ అని మాట యిచ్చి, ఈ సందర్భంలో ఎం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసు ఉన్న వాడయి ఉంది ఉద్ధవుడిని అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును పదిమందికి కట్టబెడతారు. అపుడు ఉద్ధవుడు అన్నారు “ఇటువంటి కార్యం చేసేముందు ఒకపని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు నాలుగు దిక్కులా ఉండే రాజుల పీచమణచదానికి నలుగురిని పంపవలెను కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి’ అన్నాడు. ‘చాలామంచి ఆలోచన చెప్పావు’ అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు.
ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురినీ నాలుగు దిక్కులకు పంపారు. నాలుగు దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు ఒక్క జరాసంధుడు తప్ప. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ ‘ధర్మజా, నీవు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించడం కోసమని నేను అర్జునుడు భీమును బ్రాహ్మణ రూపంలో వెళతాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదయినా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణరూపంలో వెళ్లి యుద్ధ భిక్షను అడుగుతాము. ఇస్తాను అనిన తరువాత వాడు తప్పుకోవడానికి వీలులేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము’ అని ముగ్గురూ బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి?” అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులయిన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి ముగ్గురిని తేరిపార చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చినవాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17సార్లు ఓడిపోయాడు. కానీ 18 వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18 వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అపుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తానూ ఓడిపోయానన్నది జరాసంధుడు మరచిపోయాడు. 18 వ సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉంది. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి!
“ఏమి వింతయ్యా! నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధ భిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయను” అన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడంలోనే వాని మరణం వచ్చింది.
‘కృష్ణా నాతొ యుద్ధ భూమిలో నిలబడడం అంటే అంత తేలికయిన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరాక్రమములు ఉన్నవాడు. గాండీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్న పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా. అతడు మహా బలవంతుడు. పైగా వాయుపుత్రుడు. నాతో బలమునకు సరిపోతాడు’ అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలు పెట్టాడు. భీమసేనుడు జరాసందునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.
వెంటనే మల్లయుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారుచేశారు. జరాసంధుడు భీమసేనుడు యిద్దరూ మల్లయుద్ధం మొదలుపెట్టారు. భయంకరమయిన యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురోడి పోయి యిద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. బీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడియందు ప్రవేశపెట్టారు. కృష్ణుడు తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది పదివేల ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టుకొమ్మ తీసి దానిని రెండుగా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒకకాలును తన రెండు కాళ్ళతో తొక్కిపట్టి రెండవ కాలును పట్టుకుని ఉత్తరించేస్తే, శరీరంలో సగభాగం తలవరకూ జరాసంధుడి శరీరం రెండు ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ యిటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ‘ధర్మ బద్ధమయిన పాలన చేసే వాడు ఎవడు ఉంటాడో, వానియందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మ బద్ధంగా పరిపాలించండి’ అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచి పెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధనకనకవస్తు వాహనములను పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగము చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.

శ్రీమద్భాగవతం -- 93 నృగమహారాజు_చరిత్రము

#శ్రీమద్భాగవతం -- 93    #నృగమహారాజు_చరిత్రము🌹🌹🌹

కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు తాగాలని అనుకున్నారు. అక్కడ వున్నా నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి పది ఉంది. దానిని చూసి వాళ్ళు తెల్లపోయారు. దానిని పైకితీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసరవెల్లిని పైకి తీయలేకపోయారు. వెంటనే వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి కృష్ణపరమాత్మకు చెప్పారు. అపుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయట పడేశాడు. సర్వజ్ఞుడు అయిన పరమాత్మ సాంబుడు మొదలయిన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లిని ‘నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు? ఎందువలన నీకీ జన్మ వచ్చింది?’ అని అడిగారు. ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ‘మహానుభావా, నేను ఇక్ష్వాకువంశంలో జన్మించిన నృగ మహారాజుని’ అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడు. నృగ మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు ‘నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది. కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ, కృష్ణా ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ, నేను చేసిన దానములు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం యిచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజుగారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకేఒక జీవనాధారమై ఉన్నది ఇపుడు ఆ ఆవు కనపడడం లేదు. ఆ ఆవుకోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ‘అది నా ఆవు. నృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు’ అని చెప్పాడు. అపుడు ఆ బ్రాహ్మణుడు ‘నేను యిప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను యిప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను’ అన్నాడు. ‘లేదు ఈ గోవు నాది’ అన్నాడు కశ్యపుడు. ‘కాదు ఈ గోవు నాది’ అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ‘అయ్యా, ఈ గోవును యింతకు పూర్వం నాకు దానం యిచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి నా అవును నాకు యిప్పించు’ అని రాజును కశ్యపుడు అడిగాడు. అపుడు రాజుగారు రెండవ బ్రాహ్మణునితో ‘నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం యిచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం యిచ్చేసిన గోవు. కాబట్టి ఆ గోవును నీవు యిచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు యిచ్చేస్తాను. అన్నాడు. అపుడు రెండవ బ్రాహ్మణుడు తనకు ‘ఆ ఆవే కావాలి’ అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. అపుడు రాజుగారు ‘నీకు లక్ష గోవులను యిస్తాను. ఈ గోవును విడిచిపెట్టు’ అన్నాడు. ‘నాకు ఎన్ని గోవులు యిచ్చినా అక్కర్లేదు. నాకు ఈ గోవే కావాలి’ అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు.అపుడు రాజు కశ్యపుని చూసి ‘నీకు నా రాజ్యంలోని భాగమును ఇమ్మంటే ఇస్తాను. లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను యిస్తాను. తీసుకువెళ్ళు’ అన్నాడు. అపుడు కశ్యపుడు ‘నేను అడిగిన గోవును ఇవ్వలేక పోయావు. ఇంక నాకు యివ్వవలసినది ఏమీ లేదు’ అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగ మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపొయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు.అపుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాపఫలితం ఒకటి ఉంది. అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గ లోకమునకు తీసుకు వెళతాము. ఆ పాపఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లియై నూతిలో పడి ఉండండి’ అన్నారు. అపుడు నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు ‘నీవు ఒక బ్రాహ్మణుడికి దానం యిచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి ఊసరవెల్లివై పడి ఉండు’ అన్నారు.ఈమాటలు నృగ మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వ లోకములకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ‘బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని, తెలియక గాని ఎవరయినా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకున్తాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు వున్న భక్తి అటువంటిది’ అన్నారు. ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను యిస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా! ఆ బ్రాహ్మణునకు అంత మౌడ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మూడుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపొతే రాజ్యం యిస్తానన్నాడు. కానీ కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం కాని, యితర గోవులు కాని అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదయినా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడయిన వాడు యితరులు చేసిన తప్పుడు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవీ యిక్కడ మనకు కలిగే సందేహములు. వీటికి సమాదానములను కొందరు పెద్దలు వివరణ యిచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు?ఓక్ గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమయిన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు యింకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించెయ్యాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదయినా యిస్తానన్నా ఆయన ఆశ పొందలేదు. దానిని అంగీకరించలేదు. రాజు నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ రాజు అవతలి వారియందు వున్న తృప్తిని గమనిన్చాలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమయిన తృప్తితో పొందవలసిన లక్షణము. దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాపఫలితమును అనుభవించడమే. కాబట్టి కృష్ణ పరమాత్మ యింకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు. ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్నకతలా ఉంటుంది. కానీ యిందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కథ నేర్పుతుంది. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింప జేసింది. నేను యిస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమయిన ఫలితమును యిచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించ గలిగిన శుభ ఫలితములను యివ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమయిన స్థితిని అవిష్కరిస్తుంది.పౌండ్రక వాసుదేవుడుపూర్వం కరూషదేశమును పౌండ్రక వాసుదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడయిన తరువాత ఆయనకు ఎవరో ‘అయ్యా మీపేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతున్నది’ అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనుస్సు చేయించుకున్నాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరము కట్టుకోవడం ప్రారంభించాడు. ఆవిధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఒక రాయబారిని పిలిచి నీవు వెళ్లి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి యిచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్లి ‘అయ్యా పౌండ్రక వాసుదేవుడు మీకీ రాయబారం పంపించాడు’ అని చెప్పాడు. ఆ పత్రికలో “నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో, అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే. నాకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. నీకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివలన యిబ్బంది వస్తోంది. కాబట్టి నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నిటిని వదిలి పెట్టెయ్యాలి. వాసుదేవుడు అన్న పేరును వదిలి పెట్టెయ్యాలి. లేకపోతె యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టుపెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు’ ఇదీ రాయబారం లోని సారాంశం. కృష్ణుడు అన్నారు “ఈ చిహ్నములు నాకు సహజములు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి అతడు కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందాం’ అని పంపించివేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వానిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకపకా నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అపుడు చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ‘ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది”’ అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఎ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళలా కృష్ణుడినే తలచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఎ కారణం చేత తలచినా సంతతము తలచినది ఆ వస్తువునే కాబట్టి చివరకు ఆ వస్తువులోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలల తోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నములు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినపుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు.కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతలకి పారేశాడు. ఇది అనవసర విషయముల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలయిన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్త్వికమయిన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్త్వ గుణంతో ఉంచుకుని, భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప, లేని పోని భేశాజములు అంత మంచివి కావు అని హెచ్చరిక చేసే అద్భుతమయిన లీల.

Tuesday, January 3, 2017

శ్రీమద్భాగవతం – 92 ఉషా పరిణయం

శ్రీమద్భాగవతం – 92  ఉషా పరిణయం:

పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. ఆటను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. వేయి చేతులు వున్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ‘వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు’ అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. ఆటను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు ‘నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు.అపుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు.పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈవిధంగా శంకరుడు కోతబయత తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు.ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి ‘శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతొ యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది’ అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అపుడు ఆయన అన్నాడు – ఇపుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది రక్షించవలసినవాడూ తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడూ తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు వున్న ఇంకొక రూపంతో వేయాలి. ‘నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది’ అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు. ఇపుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణమును అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివ కేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానమును బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది. ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టముగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఎ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది’ అని అడిగింది. అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అప్పుడు చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందఱో రాజాధిరాజులను చూశాను. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు’ అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అపుడు చిత్రలేఖ ‘ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.’ అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అక్కడ ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశమార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. అసురీవృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురి గొడవ అక్కరలేదు. యుద్ధం కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు “అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది’ అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది’ అని అన్నాడు.శంకరుడు భక్త వత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు.కాబట్టి యిపుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభం అయింది. శివుడు యుద్ధంలో లొంగనంత సేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. అపుడు శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి డీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది. ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వనాల లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమయినదిగా జ్వరము బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరం యిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడయినా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్త్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును యిస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మా చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లియైన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటిమీద ఉన్న వలువలన్నిటిని విప్పేసి, జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురునిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనుస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరల యుద్ధం ప్రారంభం అయింది. అపుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. ‘నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలులేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసినది అని. శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్ధం రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆరోజు కృష్ణ భగవానుడు బాణాసురునకు ఉన్న బాహువులలో 996బాహువులను సుదర్శన చక్రధారల చేత తెన్చేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. ఇప్పుడు వాని శరీరమునందు రజోగుణ తమో గుణములు లేవు. శుద్ధ సత్త్వంతో ఉంటాడు. ‘ఈశ్వరా వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసురసంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని నాలుగు చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు’ అని ఆరోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు.ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యిపుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు. ఈవిధంగా ఉషాపరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది.ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు పరమ శివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో ఎవరు తుట్టతుదకు నాలుగు చేతులతో, పరమశివునికే కింకరుడు అయ్యాడో కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో ఆయన నామం ఎవరు చెపుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్లకి ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషాపరిణయఘట్టమును, బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంతగొప్ప ఆఖ్యానము.

శ్రీమద్భాగవతం – 91వ భాగం

శ్రీమద్భాగవతం – 91

ఒకనాడు కృష్ణభగవానుడు పరమసంతోషంగా రుక్మిణీ దేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసురసంధ్య వేళ దాటిన కాలం. ఆ యిల్లు కర్పూరము అగరు మొదలయిన సువాసనలతో ఉంది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకొని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో “రుక్మిణీ, నిన్ను చూస్తే నీవు చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తోంది. నేను ఐశ్వర్య హీనుడను, దరిద్రుడను. ఎక్కడో సముద్రగర్భంలో యిల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంట మంచి సంబంధం విడిచి పెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టేవేమో అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈమాటలు వింటున్నప్పుడు రుక్మిణీ దేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయింది. అపుడు ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆవిడ ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళనుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కదిగాడు. కర్పూర వాసనవచ్చే పలుకులు ఆమె చెవులలోకి ఊదాడు. ఆమె నేలమీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టేసి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వురేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు ఆమె ప్రసన్న మయేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అదేమిటి రుక్మిణీ నేను నీతో విరసోక్తులాడాను. ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి’ అన్నాడు.
కృష్ణుడి లాంటి స్వామి యిలా మాట్లాడవచ్చునా? అని మనకి అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది. అటువంటి చిన్న దోషమును స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవియందు భరించడు. రుక్మిణీ దేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. ‘అష్టమహిషులలో నేను పట్టమహిషిని. కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండ నా మందిరమునకు విచ్చేస్తూ ఉంటారు’ అని ఆమె మనస్సులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది. కానీ యథార్థమునకు కృష్ణ పరమాత్మ 16వేల ఎనిమిది మంది గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజూ ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు. కానీ ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మన మేధకు అందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయి పొతే ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మి అంశ. కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమెనుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు. కాబట్టి యిపుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన.
కృష్ణుని మాటలు విన్న తరువాత అమ్మవారు చాలా అద్భుతమయిన విషయమును చెప్పింది. ‘కృష్ణా! మీరు చెప్పిన అన్నీ పరమ యదార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరివలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరు నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసే వారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములు ఎవరు ఉంటారో, అటువంటి వారికి చెందినవాడవు నీవు. ఎప్పుడూ కూడా పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప, వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి.
సౌందర్య వంతులయిన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యముతో పనిలేదు. నీకు కావలసినది అంతఃసౌందర్యము. కృష్ణా, నీవు అనిన మాటలల్తో చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించే దానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేతకాని, వాక్కు చేతకాని, చేరేదానను కాను. ఈశ్వరా, నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని యివ్వు’ అని అడిగింది. కృష్ణుడు ‘రుక్మిణీ! నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరయినా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటి సారి రుక్మిణీ దేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవశుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమయిన ఘట్టం ఈ ఘట్టం. రుక్మిణీ దేవి కృష్ణుడిని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణీ విజయం. దానిని మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము.
బలరాముడు రుక్మిని చంపుట
రుక్మికి రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణుని మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడుగారు కావాలి. కానీ అల్లుడుగారి నాన్న గారు, అమ్మగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు, ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళను ఎంతగానో ఆదరించాలి. కానీ ఆ పిల్లవాడు తన అక్కచెల్లెళ్ళను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం యిందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనం ప్రయోజనమును పొందగలుగుతాము. లేకపోతె అది మన జీవితమును ఉద్ధరించదు.
రుక్మికి రుక్మిణి అంటే తోడపుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడయిన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు యిచ్చి వివాహం చేశాడు. మనవరాలయిన రుక్మలోచనను కృష్ణుని మనుమడయిన అనిరుద్ధునకిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అందరు బయలుదేరి పోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగ రాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్త్వం కలిగిన వాడు. కడుపులో చాలా బాధ పడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్లి ‘ఏమయ్యా నీకేమయినా బుద్ధి వున్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు. నీ కూతురుని కృష్ణుడు కొడుకుకు యిచ్చి వివాహం చేస్తావా. ఆరోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తిపట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు. అపుడు రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నీవు భోజ కటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీ దేవికి కృష్ణునియందు పుట్టిన కొడుక్కి నీ కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తావా! నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే. నీవు చాల తొందరగా నీ అవమానములు మర్చిపోతావు’ అన్నాడు.
ఇతని మాటలు విన్న రుక్మి ‘బలరామ కృష్ణులను ఎలా అవమానించ గలను?’అని కళింగ రాజుని అడిగాడు. అపుడు కళింగ భూపతి ‘ఏమీ లేదయ్యా బలరాముడికి ద్యూతం ఆడడం అంత బాగా రాదు. ద్యూతమునకు రమ్మనమని ఆహ్వానిస్తే రానని అనడు కదా! కాబట్టి బలరాముణ్ణి ద్యూతమునకు రమ్మనమని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితుడయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నువ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నీవు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి’ అన్నాడు.
ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని ద్యూతమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి వున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. ఆఖరున బలరాముడికి కోపం వచ్చి లక్ష రూకలను ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. ‘నేను గెలిచాను’ అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. అపుడు బలరాముడు సరే వేరొకసారి లక్ష ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు రుక్మి. అశరీరవాని ఈ ఆటలో బలరాముడే గెలిచాడు అని పలికింది. ఇంత అశరీర వాని చెప్పినా రుక్మి నవ్వుతూ నువ్వు గొల్లలలో పుట్టిన వాడివి, ఆవుల వెంట, దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునే వాడివి. నీవు రాజులతో ద్యూతం ఆడడం ఏమిటి? నీవేమి మాట్లాడుతున్నావు? అన్నాడు. బలరాముడు ఇంక వీడిని ఊరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీదనుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి క్రింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం క్రింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్కదెబ్బ కొట్టాడు. మూతి వెనక్కు వెళ్ళిపోయి నెత్తురు కక్కుకుని రుక్మి చచ్చిపోయాడు. అపుడు కృష్ణుడు లేచి ‘రుక్మిణీ బయలు దేరదామా’ అన్నాడు. అయ్యో తప్పకుండా బయలుదేరదాము అన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంతే. తన పుట్టింటివారనే మమకారములు ఆవిడకు లేవు. ‘నా భర్త ధర్మమూర్తి. ఆయనకు తెలుసు ఏమిచేయాలో, ఆయన ఏమి చేస్తే అదే యదార్థం. అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీ దేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు.

శ్రీమద్భాగవతం – 90వ భాగం

శ్రీమద్భాగవతం – 90

నరకాసుర వధ:   కృష్ణ భగవానుడు తనంతతానుగా శక్తిమంతుడు. కృష్ణుడు లేని నాడు అష్టప్రకృతులకు కదలిక లేదు. అతి చిన్నతనంలోనే ఎందఱో రాక్షసులను పరిమార్చాడు. నరకాసురుడిని సంహరించడంలోకి వచ్చేటప్పటికీ సత్యభామను తీసుకువెళ్ళాడు. తన ఎనమండుగురు భార్యలలో ఒక్క సత్యభామను తప్ప మిగిలినవారి నెవ్వరినీ తీసుకువెళ్ళలేదు. ఇలా రామాయణంలో దశరథమహారాజుగారు కైకమ్మను తీసుకు వెడితే మనకు రామాయణం అంతా వచ్చింది. సత్యభామతో కృష్ణుడు యుద్ధమునకు వెళ్ళడం వలన మనకు దీపావళి పండుగ వచ్చింది. ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువుతీరి ఉండగా దేవతలు ఇంద్రుడు దుర్వాసమహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ‘మహానుభావా కృష్ణా, నరకాసురుని ఆగడములు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలములను తస్కరించాడు. వరుణుడి ఛత్రమును ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారము చేసి మణిపర్వతమును ఎత్తుకుపోయాడు. వాని ఆగడములు అన్నీ యిన్నీ కాదు. కృష్ణా, నీవే వానిని పరిమార్చాలి’ అన్నారు. అపుడు కృష్ణుడు తాను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతల నందరిని సాంత్వన పరిచాడు. తరువాత తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథమును ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయమునకు సత్యభామ అక్కడికి వచ్చింది.సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తయిన పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. సత్యభామ అనేక రంగములలో ప్రవీణురాలు. ఆ తల్లి కృష్ణ భగవానుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. ‘నాథా, మీతో యుద్ధ భూమికి వద్దామనుకుంటున్నాను’ అంది. కృష్ణ పరమాత్మ అన్నారు – ‘ సత్యభామా! యుద్ధం అంటే ఏమిటో సరదాగా ఉంటుందని అనుకుంటున్నావు. రోజూ నాతొ ప్రణయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే తుమ్మెదల ఝుంకారములు వినపడవు. బ్రహ్మాండమయిన ఏనుగులు తొండములను ఎత్తి ఘీంకారములు చేస్తుంటాయి. అక్కడ పద్మములనుండి వచ్చే పుప్పొడితో కూడిన గాలి రాదు. శరవేగంతో పరుగెత్తే గుర్రములు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కలనుండి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరముల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచి పెట్టిన బాణపరంపరలు వచ్చి మీదపడిపోతాయి. అక్కడ కలహంసలు మొదలయిన పక్షులతో కూడిన సరోవరములు ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో భయంకరమయిన శత్రువులు రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను. నీవు నాతో రావద్దు’ అన్నారు. అపుడు సత్యభామ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్లుగా ఎంతో ప్రియముగా చక్కటి మాట చెప్పింది. ఆయుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులే అయినా అక్కడ దైత్య సమూహములే ఉన్నా నాకేమీ భయం లేదు. నీ భుజములనబడే దుర్గముల చాటున నేను ఉంటాను. నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను. అని ప్రార్ధన చేసింది. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధ రంగమునకు తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. ఇద్దరూ గరుత్మంతుని అధిరోహించి యుద్ధభూమిని వెళ్ళారు. ప్రాగ్జ్యోతిషపురమునకు చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలోని హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు రాక్షసుడు. అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి. పరమాత్మా ఒక్కసారి తన చేతిలో పట్టుకున్న గద చేత ప్రహారము చేస్తూ ఆ దుర్గములనన్నిటినీ నేలకూల్చేశాడు. పాంచజన్యమును చేతిలో పట్టుకొని ప్రళయ కాలంలో మేఘము ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యమును పూరించారు. మురాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగ్జ్యోతిష పురమును మురాపాశములతో కట్టి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించారు. మురాసురుడు పైకి వచ్చాడు. తన అయిదు తలలతో వాడు బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచ భూతములను మ్రింగివేసేలా ఉన్నాడు. వాని జడ సాగిన అగ్నిహోత్రంలా ఉంది. అటువంటి జడతో వాడు నీటిలోనుండి పైకి లేచి కృష్ణుని వంక చూశాడు. పరమాత్మ తన గదా ప్రహారముతో మురాసురుని శిరస్సుని బ్రద్దలు చేశాడు. వాడు మరణించాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు ఏడుగురు కృష్ణ పరమాత్మ మీదికి యుద్ధమునకు వచ్చారు. ఆ ఏడుగురిని కూడా కృష్ణ పరమాత్మ నిర్మించారు. ఈవార్త నరకాసురుడికి చేరి యుద్ధమునకు వచ్చాడు. నరకాసురుడు ఆదివరాహ మూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు. వాడు పధ్నాలుగు భువనములను గెలిచినవాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది. తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడివేసింది. తను వేసుకున్న హారములు అవీ బయటకు వ్రేలాడకుండా అమరిక చేసేసుకుంది. ఆమెలో ఎక్కడ భయం కనపడడం లేదు. ముఖం దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వ్రేలాడకుండా బొడ్డులో దోపుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి ‘నాథా, ధనుస్సును ఇలా యివ్వండి’ అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివి ఏమి ఉంటాయి. రాక్షసుల మస్తకమును ఖండించడానికి అనువయిన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుస్సును స్వామి సత్యభామ చేతికి ఇచ్చారు. ఆ ధనుస్సును ఎడమచేతితో పట్టుకుని ఒంచి వింటినారిని విప్పి వంగి కుడిచేతితో కట్టింది. ఈ దృశ్యమును చూసి కృష్ణ పరమాత్మలో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఆ ధనుస్సును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్దమును ప్రారంభించి ఒక్కొక్క బాణము తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణమును తీసి తొడుగుతుంటే వీర రసము, శృంగార రసము, భయ రసము, రౌద్ర రసములు ఆమెలో తాండవిస్తున్నాయి. రానురాను యుద్ధం పెరిగిపోతోంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణములను ప్రయోగించడం ప్రారంభించారు. ,మూడు లోకములలో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేషి ముంగురులన్నీ నుదుటికి అన్తుకుపోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు ‘సత్యా, నీ యుద్ధమునకు నేను ఎంతో పొంగిపోయాను. అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణములతో నిలబడి ఉన్నాడు. అపుడు నరకాసురుడు అన్నాడు ‘చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నీవు పక్కన కూర్చున్నావు. పౌరుషం ఉన్నవాడివైతే యిప్పుడు యుద్ధమునకు రావలసింది’ అన్నాడు. ఈమాటలు విన్న నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను’ అని తన చేతిలో వున్న సుదర్శన చక్రమును ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రుంపబడిన నరకాసురుని శిరస్సు కుండలములు ప్రకాశిస్తూ ఉండగా దుళ్ళి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాదనే పరమ సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకములయందు దీపములను వెలిగించారు. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకనే మనం దీపావళి అమావాస్య అంటాము. దీని వెనకాతల ఉండే రహస్యమును మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. యథార్థమునకు నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడు.నరకాసురుడు ఆదివరాహ మూర్తికి, భూదేవికి జన్మించాడు. అనగా ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. భూదేవి అతని తల్లి. ప్రాక్ – జ్యోతి అనగా మొదటి నుండి వున్న జ్యోతి – అనగా ఇక్కడే ఉన్న ఆత్మా వస్తువు. ఈ ఆత్మా వస్తువును తెలుసుకోవడానికే మనం ఈ శరీరంలోకి వచ్చాము. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిషపురమునకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. మాహిష్మతీ పురమునకు వెళ్ళాడు. మాహిషి అనగా మహిష ప్రవృత్తి –దున్నపోతు లక్షణం. వాడు మురాసురుడు, నిశుంబుడు, హయగ్రీవుడు అనబడే ముగ్గురు స్నేహితులను పట్టుకున్నాడు. సత్వరజస్తమో గుణములనే మూడు గుణములతో స్నేహమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఈ మూడు గుణములలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురమునుంది మాహిష్మతీ పురమునకు వచ్చేశాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై’నీకు ఏమి కావాలి’ అని అడిగారు. ఇది భాగవతం లోనిది కాదు. తనకు మరణం ఉండకూడదని అన్నాడు. ‘కుదరదు మరొకవరం కోరుకొనమ’ని చెప్పారు. వాడు ఏమి అడుగుదామా అని ఆలోచిస్తుండగా బ్రహ్మగారు ‘అమ్మ చేతిలో చచ్చిపోయేలా నీకు వరం యిస్తాను, పుచ్చుకుంటావా’ అని అడిగారు. అంటే వాడు అనుకున్నాడు ‘అమ్మకి పెంచడం తెలుసు తప్ప చంపడం తెలియదు కదా! కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్దనుండి వరమును పొందాడు. తాను అమ్మచేతిలో పోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాడు. తెలుసుకోలేక అదితి కుండలములను అపహరించాడు. ఆకాశమునకు ప్రకాశించే రెండు కుండలములు సూర్య చంద్రులు. వాటిని దొంగిలించాను, కాలము యొక్క ప్రసరణ తనమీద లేదన్నాడు. తనకు మరణం లేదన్నాడు. మాయ అనగా ప్రకృతి. ప్రకృతి అంటే పధ్నాలుగు భువనములు. అవే చతుర్దశి. చతుర్దశీ కన్యను వివాహం చేసుకున్నాడు. అనగా 14 భువనముల మాయకు చిక్కి ఈ భోగ భాగ్యములన్నీ శాశ్వతము అనుకున్నాడు. అనేకమంది రాజుల దగ్గరికి వెళ్లి వారిని చంపి ఆ పిల్లలను తీసుకువచ్చే వాడు. తాను తెచ్చిన ఏ స్త్రీనీ అనుభవించలేదు. కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిన తరువాత కృష్ణ పరమాత్మ వారిని ద్వారకానగరం పంపించి వేసి యింద్రుడి దగ్గరకు వెళ్లి వచ్చిన తరువాత ఈ 16 వేల మందికి 16వేల అంతఃపురములను కట్టి ఏకముహూర్తము నందు ఒకే కృష్ణుడుగా కనపడుతూ 16వేల రూపములతో వివాహం చేసుకున్నాడు. 16వేలమందిని చెరసాలలో పెట్టడం అంటే ఈశ్వరుని పదహారు కళలు. బ్రహ్మగారి వరం ప్రకారం నరకాసురుడు తల్లి చేతిలోనే చచిపోవాలి. ఆ భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. సత్య అనగా మారనిది అని అర్థం. ఈ ప్రపంచంలో మారానికి పరమేశ్వరుడు మాత్రమే. మారని వాడు సత్యము అయితే ఆ సత్యము ‘భా’ – అనగా కాంతి – ‘మ’ అనగా సంపద – సత్యము కాంతి వలన వచ్చే సంపద. ఇది మనకు భూమిలో కనపడుతుంది. భా – ఈశ్వరుడు ‘మ’ – సంపద. సత్యభామ – భూదేవి – ఐశ్వర్యం.గరుత్మంతుని మీద కృష్ణుని పక్కన సత్యభామగా కనపడుతున్నది ఈశ్వరుని సోత్తయిన భూసంపద. లక్ష్మీ అంశ రుక్మిణి, భూ అంశ సత్యభామ. సత్యభామాదేవి వృత్తాంతమును ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మ జ్ఞానము ఒక జన్మలోనయినా కలుగుతుంది. సత్య-భ-మ ఈశ్వరుడి కాంతి సంపద యుద్దమును వింటున్నారు. ఆ యుద్ధము అజ్ఞానము మీద ఉంటుంది. కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడు. మనకోసమని పరమాత్మ నరకాసుర సంహారంలో ఇంత గొప్ప లీల చేశాడు.